ప్రియమైన నా దేశ వాసులారా,
స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుండి మీకు ఇవే నా శుభాకాంక్షలు.
దేశ ప్రజలు ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు జన్మాష్టమి పర్వదినాన్ని కూడా జరుపుకుంటున్నారు. నేను ఇక్కడ ఎంతో మంది బాల కన్నయ్యలను చూస్తున్నాను. సుదర్శన చక్రధారి మోహనుడి నుండి చరఖాధారి మోహనుడి వరకు మన సాంస్కృతిక, చారిత్రక వారసత్వంలో చోటు ఉండడమనేది మనం చేసుకున్న అదృష్టం.
దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ ప్రతిష్ట కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయులకు, మహిళలకు, పురుషులకు, ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న వారికి, త్యాగాలు చేసిన వారికి ఈ ఎర్ర కోట బురుజుల మీది నుండి ఈ దేశపు 125 కోట్ల మంది భారతీయుల తరఫున నేను శిరస్సు వంచి వందనమాచరిస్తున్నాను.
కొన్ని సందర్భాలలో ప్రకృతి విపత్తులు మనకు ఒక పెద్ద సవాలును విసురుతాయి. మంచి వర్షాలు పడితే అది దేశం సుభిక్షంగా ఉండడానికి దోహదపడుతుంది. అయితే, వాతావరణ మార్పుల కారణంగా కొన్ని సార్లు అది ప్రకృతి విపత్తుగా మారుతుంది. ఇటీవలి కాలంలో దేశంలో పలు ప్రాంతాలు ప్రకృతి విపత్తులకు గురయ్యాయి. మరొక వైపు, ఒక ఆసుపత్రిలో మన అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంక్షోభ సమయంలో, ఈ విషాద ఘడియలో వారికి 125 కోట్ల మంది ఈ దేశ ప్రజలు భుజం భుజం కలిపి అండగా ఉన్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రజలందరి సంక్షేమానికి పూచీపడేందుకు గల ఏ అవకాశాన్నీ వదిలిపెట్టబోమని నేను ఈ దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను.
ప్రియమైన నా దేశవాసులారా, ఈ సంవత్సరం స్వతంత్ర భారతదేశానికి ఎంతో ప్రత్యేకమైన సంవత్సరం. మనం గత వారం క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన 75 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. అలాగే ఈ ఏడాది మనం చంపారణ్ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాలను, సాబర్ మతీ ఆశ్రమ స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్నాం. అలాగే లోక మాన్య తిలక్ ఇచ్చినటువంటి ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ నినాదానికి ఈ ఏడాదితో శత వసంతాలు. గణేశ్ ఉత్సవాలకు 125 సంవత్సరాలు. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు వారు ప్రారంభించిన సామూహిక గణేశ్ ఉత్సవాలకు ఈ ఏడాదితో 125 సంవత్సరాలు అవుతున్నాయి. ఇది దేశం కోసం ఒక లక్ష్యానికి మనల్ని మనం పునరంకితులను చేసుకునేందుకు ప్రేరణనిస్తుంది. 1942 నుండి 1947 వరకు ప్రజలలో కనిపించిన సమష్టి కృషి, పట్టుదల అయిదు సంవత్సరాల లోనే బ్రితటిషు వారు ఈ దేశం వదలిపెట్టి వెళ్లేటట్టు చేశాయి. మనం ఇదే పట్టుదలను ఈ 70 వ స్వాతంత్ర్య వత్సరం నుండి 75వ స్వాతంత్ర్య వత్సరం వరకు అంటే, 2022 వరకు కొనసాగించాలి.
మనం 75 వ స్వాతంత్ర్య సంవత్సరానికి చేరుకోవడానికి ఇంకా అయిదు సంవత్సరాల సమయం మనకు ఉంది. మన మహనీయ దేశ భక్తుల త్యాగాలను స్మరించుకుంటూ మనం అందరం సమైక్యంగా పట్టుదలతో, పటుతర దీక్షతో పనిచేస్తూ సాగితే, వారు కన్న కలలకు అనుగుణమైన భారతదేశాన్ని 2022 నాటికి నిర్మించగలగడానికి వీలవుతుంది. అందువల్ల మనం ‘నవ భారతదేశా’న్ని నిర్మించడానికి ప్రతిజ్ఞ చేపడుతూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి.
మన దేశ 125 కోట్ల మంది ప్రజల సమష్టి సంకల్పం, కఠిన శ్రమ, త్యాగం, పట్టుదలల శక్తి ఎంతటివో మనకందరికీ తెలుసు. కృష్ణ భగవానుడు ఎంతో శక్తిమంతుడు. ఆయనకు మద్దతుగా గోపాలకులు కర్రలు తీసుకు వచ్చి గోవర్ధన గిరిని ఎత్తేందుకు నిలబడ్డారు. భగవాన్ రాముడు లంకకు వెళ్లడంలో వానర సేన ఆయనకు ఎంతో సాయపడింది. రామసేతును నిర్మించారు. ఫలితంగా రాముడు లంకకు చేరుకోగలిగాడు. అలాగే మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీజీ.. వారు కదుళ్లు, చరఖాలతో దేశ స్వాతంత్ర్య సంగ్రామంవ యొక్క కలనేతతో దేశ ప్రజలకు సాధికారతను కల్పించారు. ప్రజలందరి ఉమ్మడి కృషి , కఠోర దీక్ష, పట్టుదలలు దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టాయి. ఇక్కడ ఎవరూ పెద్దా కాదు, చిన్నా కాదు. మనకు ఒక కథ జ్ఞాపకం వస్తూ ఉంటుంది.. బుల్లి ఉడుత సైతం మార్పుకు ఎలా చోదక శక్తిగా నిలబడిందో. అందువల్ల ఈ దేశంలోని 125 కోట్ల మంది ప్రజలలో ఎవరూ పెద్దా కాదు, ఎవరూ చిన్నా కాదు. అందరూ సమానులే.
మనలోని ప్రతి ఒక్కరు, వారు ఎక్కడి వారైనా సరే ఒక కొత్త సంకల్పంతో, ఒక కొత్త శక్తితో, ఒక కొత్త ఉత్సాహంతో కృషి చేసినట్టయితే మన అందరి సమష్టి శక్తితో 75వ స్వాతంత్ర్య వత్సరమైన 2022 కల్లా మనం మన దేశ ముఖ చిత్రాన్ని మార్చి వేయగలుగుతాం. అది భద్రమైన , సుసంపన్నమైన, సమృద్ధితో తులతూగే బలమైన దేశం- ‘న్యూ ఇండియా’ (నవ భారతదేశం) అవుతుంది. ఈ ‘నవ భారతదేశం’లో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ వేదికపై దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావడంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించనుంది.
మన స్వాతంత్ర్యోద్యమం మన విశ్వాసాలతో ముడిపడింది. ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు, పొలం దున్నుతున్న కర్షకుడు, వివిధ పనులలో నిమగ్నమైన శ్రామికుడు.. వీరు అందరి మనసులలోనూ ఒకటే భావన. తాము చేస్తున్న పని ఏదైనప్పటికీ అది చివరకు ఈ దేశ విముక్తికి దోహదపడేదేనని. ఇలాంటి భావనే గొప్ప శక్తిని సమకూర్చింది. కుటుంబంలో కూడా.. చూడండి, ప్రతి రోజూ ఆహారాన్ని తయారు చేస్తాం. అయితే దానిని భగవంతుడికి నివేదించినపుడే, అది ప్రసాదంం అవుతుంది.
మనం పని చేస్తున్నాం. కానీ, మనం దానిని ఈ మాతృభూమి ప్రతిష్ఠ కోసం పనిచేస్తున్నామన్న స్పూర్తితో, ఈ దేశం పట్ల భక్తి ప్రపత్తులతో కొనసాగిస్తే, ఈ దేశ ప్రజల పేదరికాన్ని దూరం చేయాలన్న సంకల్పంతో పని చేస్తే, సమాజంలో అందరూ కలిసి మెలిసి ఉండేలా పనిచేయగలిగితే, దేశ భక్తితో మనం పని చేయగలిగితే, మనం చేసే పనిని దేశానికి అంకితం చేస్తూ పని చేయగలిగితే- దాని ఫలితం ఎంతో ఎక్కువ ఉంటుంది. అందుకే మనమందరం ఈ స్పూర్తితో ముందుకు సాగాలి.
2018 జనవరి 1 మామూలు రోజు ఎంతమాత్రం కాదు. ఈ శతాబ్దం ఆరంభంలో పుట్టిన వారికి అప్పటికి పద్దెనిమిది ఏళ్లు. వారి జీవితాలకు సంబంధించి నిర్ణయాత్మక సంవత్సరం. వారు 21 వ శతాబ్దంలో ఈ దేశ భవితవ్యాన్ని నిర్ణయించే భాగ్య విధాతలు అవుతారు. ఈ యువజనులను నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, గౌరవిస్తున్నాను. వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ దేశ భవితవ్యాన్ని మలచే శక్తి మీకు ఉంది. ఈ దేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావలసిందిగా ఈ భాగ్యోదయ దేశం మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణ భగవానుడికి అర్జునుడు ఎన్నో ప్రశ్నలను సంధించినపుడు కృష్ణ భగవానుడు నీ ఆలోచనలు, విశ్వాసాల ప్రకారమే నీవు నీ లక్ష్యాన్ని సాధించగలవని అర్జునుడితో అంటాడు. మనకు గట్టి పట్టుదల ఉంది. మనం ఉజ్జ్వలమైన భారతావనికి కట్టుబడి ఉన్నాం. కానీ మనం చేయాల్సింది- ఎవరైతే నిరాశమయ స్థితిలో ఎదిగారో వారందరూ- అలాంటి నిరుత్సాహాన్ని పక్కనపెట్టాలి. గట్టి విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి.
మనం ‘చల్ తా హై’ (సాగుతుందిలే అనే) వైఖరిని పక్కన పెట్టాలి. బదల్ సక్ తా హై (మారగలుగుతుంది అనే దానిని) గురించి ఆలోచించాలి. ఈ వైఖరి ఒక దేశంగా మనకు మేలు చేస్తుంది. మనకు ఈ విశ్వాసం ఉండాలి. త్యాగం, కఠోర పరిశ్రమ, ఏదైనా సాధించాలన్న సంకల్పం.. ఇవి అలవడితే మనకు అందుకు తగిన వనరులు అందుతాయి, అవి సాధించడానికి తగిన సామర్ధ్యం లభిస్తుంది, అక్కడ నుండి ఒక పెద్ద పరివర్తనే చోటుచేసుకుంటుంది. మన సంకల్పం చివరకు సాఫల్యంగా మారుతుంది.
సోదర సోదరీమణులారా, మన దేశ ప్రజలు మన రక్షణను, భద్రతను గురించి ఆలోచించడం సహజం. మన దేశం, మన సైన్యం, మన సాహసవీరులు, యూనిఫాం లో ఉన్న మన దళాలు, అది సైన్యం, వాయుసేన లేదా నావికాదళం ఏదైనా కావచ్చు, అన్ని సైనికవిభాగ దళాలను ఎప్పుడు ఏ క్షణంలో పిలిచినా వారు తమ అద్భుత ధైర్య సాహసాలను, పరాక్రమాన్ని, తమ శక్తిని ప్రదర్శించారు. ఈ వీర సైనికులు దేశం కోసం అంతిమ త్యాగానికి ఏనాడూ వెనుకాడలేదు. అది వామపక్ష తీవ్ర వాదమైనా, ఉగ్రవాదమైనా, చొరబాట్లయినా, దేశంలో అంతర్గత సమస్యలను రెచ్చగొట్టే శక్తుల విషయంలో నైనా- దేశ ఏకీకృత సర్వీసుల లోని దళాలు అత్యున్నత త్యాగాలను చేస్తూ వస్తున్నాయి. సర్జికల్ స్ట్రయిక్ జరిగినపుడు ప్రపంచం భారతదేశ శక్తి సామర్ధ్యాలను గుర్తించక తప్పలేదు.
నా ప్రియమైన దేశ ప్రజలారా,
భారతదేశ భద్రత మా ప్రాధాన్యం. అది మన కోస్తా తీరం కావచ్చు, మన సరిహద్దులు కావచ్చు, అంతరిక్షం లేదా సైబర్‌స్పేస్ కావచ్చు.. భారత దేశం తన భద్రతకు పూచీ పడగల స్థితిలో ఉంది. అంతేకాదు, దేశానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా తిప్పి కొట్టగల శక్తి భారతదేశానికి ఉంది.
నా ప్రియాతిప్రియమైన దేశ ప్రజలారా,
ఈ దేశాన్ని దోచుకున్న వారు, పేద ప్రజలను దోచుకున్న వారు ఈరోజు ప్రశాంతంగా నిద్రపోలేకుండా ఉన్నారు. దీనితో కష్టపడి పనిచేసేవారు, నిజాయితీ పరుల ఆత్మవిశ్వాసం పెరిగింది. నిజాయితీపరులైన వారు తమ నిజాయితీకి గుర్తింపు ఉందని అనుకుంటున్నారు. ఈ రోజు మనం నిజాయతీ పండుగను జరుపుకుంటున్నాం. ఇక్కడ నిజాయితీ రాహిత్యానికి తావులేదు. ఇది మనకు ఒక కొత్త ఆశను కల్పిస్తోంది.
బినామీ ఆస్తులకు వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాలుగా చట్టం పెండింగ్ లో ఉంది. కానీ ఇప్పడు మేం బినామీ ఆస్తులకు వ్యతిరేకంగా చట్టం తీసుకు వచ్చాం. ఇంత తక్కువ వ్యవధిలో ప్రభుత్వం 800 కోట్ల రూపాయల విలువ గల బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకోగలిగింది. ఇలాంటివి జరిగితే, సామాన్యుడికి ఈ దేశం నిజాయితీపరుల కోసమేనన్న నమ్మకం కలుగుతుంది.
రక్షణ రంగానికి సంబంధించి ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ విధానం ముప్పై, నలభై సంవత్సరాలుగా ఎటూ తేలకుండా ఉంది. మా ప్రభుత్వం దానిని అమలు చేసింది. మేం మా సైనిక దళాల ఆకాంక్షలను నెరవేర్చడంతో వారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఈ దేశ రక్షణకు సంబంధించిన వారి సంకల్పం మరెన్నో రెట్లు పెరుగుతుంది.
ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉంది. జిఎస్ టి సహకారపూర్వక సమాఖ్యవాద స్ఫూర్తిని అద్దం పట్టి చూపింది. పోటీతో కూడిన సహకారపూర్వక సమాఖ్యవాదానికి సరికొత్త శక్తినిచ్చింది. జిఎస్‌టి విజయం దానిని విజయవంతం చేయడానికి జరిగిన గట్టి కృషికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం దీనిని ఒక మహాద్భుతంగా తీర్చిదిద్దింది. ఇంత తక్కువ సమయంలో మనం జిఎస్‌టి ని ఎలా అమలు చేసుకోగలుగుతున్నామని ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇది మన సామర్ధ్యానికి నిదర్శనం. ఇది భవిష్యత్ తరాలలో విశ్వాసం, నమ్మకం పాదుకొల్పడానికి ఎంతగానో దోహదపడుతుంది.
కొత్త వ్యవస్థలు ఆవిర్భవిస్తున్నాయి. ఈనాడు రెట్టింపు వేగంతో రహదారుల నిర్మాణం జరుగుతోంది. రెట్టింపు వేగంతో రైల్వే మార్గాల నిర్మాణం జరుగుతోంది. స్వాతంత్ర్యానంతరం ఇన్ని దశాబ్దాలుగా అంధకారంలో మగ్గిన 14 వేల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించడం జరిగింది. 29 కోట్ల మంది ప్రజలకు బ్యాంకు ఖాతాలు ప్రారంభమయ్యాయి. సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులు భూసార పరీక్షా కార్డులు అందుకున్నారు. 2 కోట్ల మందికి పైగా పేద తల్లులు, సోదరీమణులు వంట చెరకు వాడడం లేదు. వారికి ఇప్పుడు ఎల్‌పిజి గ్యాస్ స్టవ్ సదుపాయం కల్పించబడింది. పేద ఆదివాసీలకు వ్యవస్థపై విశ్వాసం ఏర్పడింది. అభివృద్ధి పథంలో చిట్ట చివరన ఉన్న వ్యక్తి కూడా ఈరోజు ప్రధాన స్రవంతిలో కలిసి వస్తున్నాడు. దేశం ప్రగతిపథంలో ముందడుగు వేస్తోంది.
ఎనిమిది కోట్ల మందికి పైగా యువతకు స్వయం ఉపాధి కోసం ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రుణాలను మంజూరు చేయడం జరిగింది. బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. ఎవరైనా మధ్యతరగతికి చెందిన వ్యక్తి స్వంత ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే తక్కు వడ్డీకి రుణం లభిస్తోంది. ఈ రకంగా దేశం ముందుకు సాగుతోంది. ప్రజలు ఈ ఉద్‌ుమంలో కలిసి వస్తున్నారు.
కాలం మారింది. ప్రభుత్వం తను చెప్పినట్టు చేయడానికి కట్టుబడి ఉంది. అంటే ఇంటర్వ్యూ ప్రక్రియను తొలగించడం వంటివి.
ఇక కార్మిక రంగం ఒక్కదానిలోనే చూడండి, చిన్న వ్యాపారి కూడా 50 నుండి 60 వరకు ఫారాలను భర్తీ చేయవలసివుండేది. ఇప్పడు మేం వాటిని కేవలం 5 నుండి 6కు తగ్గించి ఎంతో అనుకూలంగా ఉండేట్టు చేశాం. పరిపాలనను సులభతరం చేసే సుపరిపాలనకు సంబంధించి నేను ఇలాంటి ఎన్నో ఉదాహరణలను చెప్పగలను. దీనిని పునరుద్ఘాటిస్తూ మేం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడాన్ని అమలు చేశాం. అందువల్ల దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు మా పాలనపై విశ్వాసం ఉంచగలుగుతున్నారు.
ప్రియమైన దేశవాసులారా,
భారతదేశం అంతర్జాతీయంగా ఒక స్థాయిని పొందింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో మనం ఒంటరి కాదు. ఇది ఎంతో సంతోషం కలిగించే విషయం. ఎన్నోదేశాలు సానుకూలంగా మనకు మద్దతిస్తున్నాయి..
హవాలా కానివ్వండి లేదా ఉగ్రవాదానికి సంబంధించిన సమాచారం కానివ్వండి, అంతర్జాతీయ సమాజం కీలక సమాచారంతో మనల్ని సమర్ధిస్తోంది. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు విషయంలో మనం ఇతర దేశాలతో చేతులు కలిపాం. మనకు మద్దతు తెలుపుతున్న, మన పరాక్రమాన్ని గుర్తిస్తున్న దేశాలన్నింటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
జమ్ము & కశ్మీర్ అభివృద్ధి, ప్రగతి విషయానికి వస్తే, దాని సుసంపన్నత, అక్కడి ప్రజల ఆకాంక్షల విషయానికి వస్తే అది జమ్ము & కశ్మీర్ ప్రభుత్వం ఒక్కదాని బాధ్యతగా కాకుండా, అది బాధ్యతాయుత పౌరులుగా మనందరి బాధ్యత. జమ్ము & కశ్మీర్‌ను మరోసారి స్వర్గధామంగా చేసి దానికి పూర్వ వైభవం తెచ్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం.
కశ్మీర్ విషయంలో మాటల గారడీలు, రాజకీయాలు ఉన్నాయి. అయితే కొద్దిమంది వ్యాప్తి చేస్తున్న వేర్పాటువాదంపై విజయం సాధించడమెలాగన్న విషయంపై నాకు గల విశ్వాసం విషయంలో నాకు స్పష్టత ఉంది. ఈ సమస్యను తుపాకిగుండ్ల ద్వారా కానీ, దూషణల ద్వారా కానీ పరిష్కరించలేం. కశ్మీరీలందరినీ కలుపుకుపోవడం ద్వారా మాత్రమే దీనిని పరిష్కరించగలం. 125 కోట్ల మంది భారతీయల గొప్ప వారసత్వం అది. ఇక్కడ దూషణల ద్వారా కానీ, తుపాకిగుండ్ల ద్వారా కానీ మార్పు రాదు. అందరినీ కలుపుకుపోవడం వల్ల మాత్రమే వస్తుంది. మేం ఈ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేం గట్టి చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదంపై గాని, ఉగ్రవాదుల పట్ల గాని ఏమాత్రం ఉదారంగా ఉండే ప్రశ్నే లేదు. తీవ్రవాదులను ప్రధాన స్రవంతిలో కలవాల్సిందిగా మేం కోరుతూ వస్తున్నాం. ప్రజాస్వామ్యం అందరికీ వారి వాణిని వినిపించేందుకు సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తోంది. ప్రధాన స్రవంతిలో ఉంటూ ఎవరైనా చైతన్యవంతులు కావచ్చు.
వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టడంలో భద్రతా దళాల కృషిని నేను అభినందిస్తున్నాను. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుండి ఎంతో మంది యువతను వామపక్ష తీవ్రవాదం నుండి తప్పించి లొంగి పోయేందుకు, ప్రధాన స్రవంతిలో కలిపేందుకు వారు చర్యలు తీసుకున్నారు.
భద్రతదళాలు మన సరిహద్దులలో గట్టి నిఘాను ఉంచుతున్నాయి. శౌర్య పురస్కారాలు పొందిన వారి సాహసాలకు సంబంధించిన వివరాలతో భారత ప్రభుత్వం ఈ రోజు ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తోందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. దేశానికి ఎంతో ప్రతిష్ఠను తీసుకువచ్చిన ఈ అసమాన సాహసవంతుల పూర్తి వివరాలను పొందుపరిచే ఒక పోర్టల్ ను కూడా ప్రారంభించనున్నాం. ఈ వీరుల త్యాగాల గాథలు యువతరానికి తప్పకుండా ప్రేరణగా నిలుస్తాయి.
సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దేశంలో నిజాయతీని, పారదర్శకతను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అవినీతిపైన, నల్లధనంపైన మా పోరాటం కొనసాగుతుంది. సాంకేతికతను ఉపయోగించుకుని వ్యవస్థను ‘ఆధార్’తో అనుసంధానం చేసే కృషి జరుగుతోంది. వ్యవస్థలోకి పారదర్శకతను తీసుకురావడంలో మేము విజయం సాధించాం. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ విధానాన్ని ప్రశంసిస్తూ, ఈ నమూనా పై అధ్యయనం కూడా చేపడుతున్నారు.
ఇప్పుడు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న సామాన్య మానవుడు కూడా ఉత్పత్తులను ప్రభుత్వానికి సరఫరా చేయగలుగుతున్నాడు. అతనికి ఎలాంటి మధ్య దళారీల అవసరం లేదు. అందుకు మేం ‘‘GEM’’ పోర్టల్ ను ప్రవేశపెట్టాం. ఈ పోర్టల్ ద్వారానే ప్రభుత్వం వస్తు సేకరణ చేపడుతోంది. భిన్న స్థాయిల్లో పారదర్శకత విజయవంతంగా తీసుకురాగలిగాం.
సోదర సోదరీమణులారా,
ప్రభుత్వ పథకాల అమలు వేగం అందుకొంటోంది. ఒక పనిలో జాప్యం జరిగిందంటే ప్రాజెక్టు అమలు ఆలస్యం కావడం, వ్యయ భారం పెరగడం మాత్రమే కాదు, ఎన్నో పేద కుటుంబాలు చాలా ఇబ్బందులు అనుభవించాల్సి వస్తోంది.
మరో 9 నెలల్లో మనం కుజ గ్రహాన్ని చేరబోతున్నాం. అది సాధించగల సామర్థ్యం మనకు ఉంది.
ప్రతి నెలా నేను ప్రభుత్వ ప్రాజెక్టులను సమీక్షిస్తున్నాను. 42 సంవత్సరాల క్రితం నాటి ఒక రైల్వే ప్రాజెక్టు కింద 70-72 కిలో మీటర్ల రైల్వే లైను నిర్మాణం కావలసి ఉంది. కానీ, అది 42 సంవత్సరాలుగా అలాగే మూలన పడి ఉంది.
సోదర సోదరీమణులారా,
కేవలం 9 నెలల కాలంలో కుజ గ్రహాన్ని చేరగల సామర్థ్యం ఉన్న దేశంలో 70-72 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టును మాత్రం 42 సంవత్సరాలైనా పూర్తి చేయలేకపోయారు. ఇది పేద ప్రజల మనస్సుల్లో అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులన్నింటినీ మేం చేపట్టాం. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మార్పు తీసుకువచ్చేందుకు మేం ఎంతగానో కృషి చేస్తున్నాం. జియో టెక్నాలజీ లేదా అంతరిక్ష టెక్నాలజీ వంటివి ఏవైనా కావచ్చు, ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాలను అనుసంధానం చేస్తూ, పరివర్తన తీసుకు వచ్చేందుకు కృషి జరుగుతోంది.
యూరియా, కిరోసిన్ ల కోసం కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వాతావరణాన్ని మీరందరూ చూశారు. కేంద్రం పెద్దన్న పెత్తనం చెలాయించేదిగాను, రాష్ట్రాలు చిన్న సోదరులుగాను పరిగణించిన సమయం అది. నేను సుదీర్ఘ కాలం ఒక ముఖ్యమంత్రిగా పని చేశాను. దేశ అభివృద్ధి క్రమంలో రాష్ట్రాలకు గల ప్రాధాన్యం నాకు తెలుసు. ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యం కూడా నాకు తెలుసు. అందుకే సహకార సమాఖ్యవాదం కోసం గట్టిగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు పోటీ స్వభావం ఉన్న సహకార సమాఖ్యవాదం దిశగా అడుగు వేస్తున్నాం. అందరం కలిసి ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం మీరు గమనించే ఉంటారు.
ఇదే ఎర్ర కోట బురుజుల మీది నుండి గతంలో ప్రధానులు మాట్లాడుతూ, దేశంలో విద్యుత్ సరఫరా కంపెనీల దు:స్థితిని గురించి ఆందోళనను వ్యక్తంచేసిన విషయం మీకోసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మేం "ఉదయ్" యోజన ద్వారా కలిసికట్టుగా విద్యుత్ కంపెనీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఫెడరలిజమ్ వాస్తవ రూపానికి ఇదే చక్కని ఉదాహరణ.
'జిఎస్‌టి' లేదా 'స్మార్ట్ సిటీ' ప్రాజెక్టులు కావచ్చు, 'స్వచ్ఛ భారత్ అభియాన్', 'మరుగుదొడ్ల నిర్మాణం' లేదా 'వ్యాపార సరళీకరణ' కార్యక్రమాలు కావచ్చు. అన్నీ రాష్ట్రాల భాగస్వామ్యంతో భుజం భుజం కలిపి కలిసికట్టుగా సాధిస్తున్నాం.
ప్రియమైన దేశవాసులారా,
‘నవ భారతం’లో ప్రజాస్వామ్యమే ఒక పెద్ద బలం. కానీ, మనం ప్రజాస్వామ్యాన్ని బ్యాలెట్ పెట్టెలకే పరిమితం చేశాం. ప్రజాస్వామ్యం అనేది కేవలం బ్యాలెట్ పెట్టెలకే పరిమితం కాకూడదు. అందుకే ప్రజలను వ్యవస్థ నడిపించే విధానానికి భిన్నంగా, వ్యవస్థకు ప్రజలే చోదక శక్తిగా ఉండే విధానాన్ని 'నవ భారత' ప్రజాస్వామ్యంలో ఆవిష్కరించేందుకు మేం కృషి చేస్తున్నాం. అటువంటి ప్రజాస్వామ్యమే నవ భారతానికి ఒక గుర్తింపు కావాలి. ఆ దిశగా అడుగు వేయాలని మేం వాంఛిస్తున్నాం.
‘‘స్వరాజ్యం నా జన్మహక్కు’’ అని లోక మాన్య తిలక్ నినదించారు. ‘‘సుపరిపాలన నా జన్మహక్కు’’ అనేది స్వతంత్ర భారతంలో ఒక నినాదం కావాలని మేం కోరుతున్నాం. ‘‘సురాజ్య’’ లేదా సుపరిపాలన అనేది మనందరి ఉమ్మడి బాధ్యత కావాలి. ప్రజలు వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలి. ప్రభుత్వం కూడా తన పై ఉన్న బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి.
‘‘స్వరాజ్’’ నుండి ‘‘సురాజ్’’ కు జరిగే పయనంలో పౌరులు ఎక్కడా వెనుకబడిపోకూడదు. ఉదాహరణకు.. గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని నేను దేశ ప్రజలకు పిలుపు ఇచ్చినపుడు జాతి యావత్తు ఒక్కటిగా స్పందించింది. నేను స్వచ్ఛతను గురించి మాట్లాడితే, స్వచ్ఛత ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు దేశంలోని ప్రతి ఒక్క ప్రాంతానికి చెందిన ప్రజలు చేతులు కలిపారు.
పెద్ద నోట్ల రద్దు ప్రకటించినపుడు ప్రపంచం యావత్తు ఆశ్చర్యపోయింది. మోదీకి ఇదే అంతం అని ప్రజలు భావించారు. కానీ, 125 కోట్ల మంది దేశ వాసులు ఎంతో సహనాన్ని, విశ్వాసాన్ని ప్రదర్శించడంతో నేను అవినీతిపై పోరాటంలో ఒకదాని తరువాత మరో అడుగు ముందుకు వేయగలుగుతున్నాం.
ప్రజలందరూ భాగస్వాములవుతున్న ఈ కొత్త విధానంలో ప్రజల చురుకైన భాగస్వామ్యంతో మా లక్ష్యాన్ని సాధించగలమనే నమ్మకం ఏర్పడింది.
ప్రియమైన నా దేశవాసులారా,
లాల్ బహదూర్ శాస్త్రి ‘‘జై జవాన్ జై కిసాన్’’ అని నినదించారు. అప్పటి నుండి మన రైతన్నలు వెనక్కి తిరిగి చూడలేదు. ఈ రోజు వారు రికార్డు స్థాయిలో పంట దిగుబడులు తీసుకురాగలుగుతున్నారు. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొంటూ కూడా కొత్త శిఖరాలు అధిరోహించగలుగుతున్నారు. ఈ ఏడాది పప్పుల దిగుబడులు రికార్డు స్థాయిలో ఉన్నాయి.
ప్రియమైన సోదర సోదరీమణులారా,
భారత్ కు పప్పులు దిగుమతి చేసుకొనే సాంప్రదాయం ఎప్పుడూ లేదు. అప్పుడప్పుడూ చేసుకోవలసి వచ్చినా వేల టన్నులకే అది పరిమితం. కానీ, ఈ సంవత్సరం వారు పేదలకు పౌష్ఠికాహారం అందించేందుకు 16 లక్షల టన్నుల పప్పులు ఉత్పత్తి చేసినపుడు వారికి ప్రోత్సాహకంగా ఆ ఉత్పత్తులు కొనుగోలు చేసే చారిత్రకమైన చర్య ప్రభుత్వం తీసుకొంది.
‘‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’’ మన రైతులకు భద్రత కల్పించింది. 3 సంవత్సరాల క్రితం ఈ పథకం వేరే పేరుతో అమలులో ఉన్నపుడు కేవలం 3.25 కోట్ల మంది రైతులకే అందుబాటులో ఉండేది. కానీ, అతి తక్కువ కాలంలోనే ఇప్పుడు అధిక శాతం మంది రైతులను ఈ పథకం పరిధిలోకి తీసుకురాగలిగాం. త్వరలో ఈ పథకం వర్తిస్తున్న రైతుల సంఖ్య 5.75 కోట్ల మైలురాయిని చేరనుంది.
‘‘ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన’’ రైతాంగం నీటి సమస్యలను తీర్చేందుకు ఉద్దేశించిన పథకం. రైతులందరికీ జల వనరులు అందుబాటులో ఉంటే వారు తమ వ్యవసాయ క్షేత్రాల నుండి మరింత విలువైన దిగుబడులు తీసుకురాగలుగుతారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఈ ఎర్ర కోట బురుజుల మీది నుండి నేను కొన్ని ప్రకటనలు చేశాను. ఆ ప్రాజెక్టుల్లో 21 ప్రాజెక్టులను మేము విజయవంతంగా పూర్తి చేయగలిగాం. మిగతా 50 కూడా త్వరలో పూర్తి కానున్నాయి. 2019 నాటికి 99 పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేయాలని నేను తీర్మానించుకున్నాను. విత్తనాలు ఉత్పత్తి చేయడం దగ్గర నుండి వ్యవసాయోత్పత్తులను మార్కెట్‌కు చేర్చడం వరకు రైతన్నలకు చేయూతను అందించలేకపోతే మనం మార్పు తీసుకురాలేం. దీనికి చక్కని మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థ చాలా అవసరం. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు విలువ గల కూరగాయలు, పళ్ళు, ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఫూడ్ ప్రాసెసింగ్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. మౌలిక వసతుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం "ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన"ను ప్రారంభించింది. ఈ వ్యవస్థ రైతన్నలకు విత్తనాలు సరఫరా చేయడం దగ్గర నుండి వారి ఉత్పత్తులు మార్కెట్‌కు చేర్చడం వరకు అన్ని దశల్లోను సహకారం అందిస్తుంది. ఇలాంటి ఏర్పాట్లు కోట్లాది రైతన్నల జీవితాల్లో కొత్త ఉషస్సులు తీసుకురాగలుగుతాయి.
కంపెనీల అవసరాలు, సాంకేతిక పరిజ్ఞానాల్లో మార్పులతో దేశంలో ఉద్యోగాల స్వభావంలో ఎంతో మార్పు వచ్చింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఉపాధి సంబంధిత పథకాల్లో ఎన్నో కొత్త చొరవలు ప్రవేశపెట్టింది. 21వ శతాబ్ది అవసరాలకు దీటుగా మానవ వనరులకు తగు శిక్‌ణ ఇచ్చేందుకు కృషి జరుగుతోంది. యువతకు హామీ రహిత రుణాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఒక భారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన యువత స్వతంత్రంగా నిలబడాలి. అతనికి ఉపాధి అందుబాటులో ఉండాలి. అతను ఉపాధి కల్పించగల స్థాయికి చేరాలి. గత మూడేళ్ళుగా ప్రధాన మంత్రి ‘‘ముద్ర యోజన’’ కోట్లాది మంది యువతీయువకులు స్వంతంగా వారి కాళ్ళపై వారే నిలబడగల పరిస్థితి తీసుకువచ్చింది. వారు మరికొంత మంది యువతకు కూడా ఉపాధిని కల్పించగలుగుతున్నారు.
విద్యారంగం విషయానికి వస్తే, మన విశ్వవిద్యాలయాలను ప్రపంచ శ్రేణి విద్యా సంస్థలుగా అభివృద్ధి చేసేందుకు ఎటువంటి ఆంక్షలు లేని వాతావరణం కల్పించాం. తమ భవిష్యత్తు తామే నిర్ణయించుకొనే స్వేచ్ఛ 20 విశ్వవిద్యాలయాలకు ఇచ్చాం. వాటి నిర్వహణలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదు. పైగా వాటికి 1000 కోట్ల రూపాయల వరకు నిధులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వారికి మేం పిలుపునిచ్చాం. దేశంలోని విద్యా సంస్థలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాయన్న నమ్మకం నాకు ఉంది.
గత మూడు సంవత్సరాలలో 6 ఐఐటి లు, 7 కొత్త ఐఐఎమ్ లు, 8 కొత్త ఐఐఐటి లు ఏర్పాటుచేశాం. విద్యారంగాన్ని ఉపాధి రంగంతో అనుసంధానం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశాం.
మాతృమూర్తులు, సోదరీమణులారా, భారత కుటుంబాల్లోని మహిళలు పెద్ద ఎత్తున ఉపాధిని ఆకాంక్షిస్తున్నారు. అందుకే మేం కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకువచ్చే అతి కీలకమైన అడుగు వేశాం. వారికి రాత్రి వేళల్లో కూడా ఉపాధి అవకాశం అందుబాటులో ఉండే విధంగా మార్పులు తెచ్చాం.
మన తల్లులు, సోదరీమణులు కుటుంబంలో అంతర్గత భాగం. మన భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండాలంటే వారి భాగస్వామ్యం ఎంతో కీలకం. అందుకే మేం మాతృత్వ సెలవు దినాలను 12 వారాల నుండి 26 వారాలకు పెంచాలని నిర్ణయించాం.
మహిళా సాధికారత విషయానికి వస్తే ‘‘తలాక్ అనే పదాన్ని మూడు సార్లు ఉచ్చరించడం’’ కారణంగా ఎన్నో కష్టాలు పడుతున్న సోదరీమణులకు ఊరట కల్పించాలని నేను భావిస్తున్నాను. వారికి మరో దారి లేదు. అందుకే ‘‘తలాక్ అనే పదాన్ని మూడు సార్లు ఉచ్చరించడం’’ వల్ల బాధితులైన మహిళలు దేశంలో భారీ ఉద్యమం తీసుకువచ్చారు. వారు మేధావుల మనస్సాక్షిని తట్టి లేపారు. దేశంలోని ప్రసార వ్యవస్థ కూడా వారికి అండగా నిలిచింది. ‘‘తలాక్ అనే పదాన్ని మూడు సార్లు ఉచ్చరించడాన్ని’’ వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి స్వీకారం చుట్టిన, ఉద్యమంలో అహర్నిశలు శ్రమిస్తున్న సోదరీమణులను నేను అభినందిస్తున్నాను. వారి పోరాటంలో దేశవాసుల సంపూర్ణ సహాయ సహకారాలు అందుతాయని నాకు విశ్వాసం ఉంది. వారి హక్కులు సాధించుకోగల వాతావరణం దేశం కల్పిస్తుంది. మహిళా సాధికారతలో అత్యంత కీలకమైన ఈ అడుగులో వారు తుది విజయం సాధించేందుకు భారత జాతి వారికి పూర్తిగా అండగా నిలుస్తుంది. దీనిపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
కొన్ని సందర్భాల్లో విశ్వాసం ముసుగులో సహనం కోల్పోయిన కొంత మంది సామాజిక వ్యవస్థను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. శాంతి, సామరస్యం, ఐక్యతలే దేశానికి బలం. మతవాదం, కులతత్వం వంటి విష స్వభావాలు దేశానికి ఎన్నడూ లాభదాయకం కాదు. గాంధీ, గౌతమ బుద్ధులు జన్మించిన భూమి ఇది. ప్రతి ఒక్కరిని కలుపుకొంటూ మనం ముందుకు సాగాలి. మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో ఇది ఒక భాగం. దానిని మనం విజయవంతంగా ముందుకు నడిపించాలి. విశ్వాసం ముసుగులో హింసను ఏ విధంగానూ సహించేది లేదు.
ఒక ఆసుపత్రిలో ఒక రోగికి ఏదైనా జరిగితే ఆసుపత్రినే దగ్ధం చేస్తున్నారు. ఒక ప్రమాదం జరిగితే వాహనాలను నాశనం చేస్తున్నారు. ప్రజలు ఉద్యమించి ప్రభుత్వ ఆస్తులను తగులబెడుతున్నారు. ఇదేనా స్వేచ్ఛా భారతం ? 125 కోట్ల మంది భారతీయుల సుసంపన్నత ఇదేనా ? ఎవరి సంస్కృతిక వారసత్వం ఇది ? ఎవరి విశ్వాసం ఇది ? 125 కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న భూమి ఇది. అందుకే విశ్వాసం ముసుగులో జరిగే ఏ దౌర్జన్యకాండ విజయం సాధించలేదు. దీనిని దేశం ఎన్నటికీ ఆమోదించదు. ఒకప్పుడు మన నినాదం ‘‘భారత్ ఛోడో’’ (భారత్‌ను వదిలి పోండి), అయితే ఇప్పుడు మన నినాదం ‘‘భారత్ జోడో’’ (భారత్‌ను కూడా కలుపుకోండి). దేశాన్ని ముందుకు నడిపించడంలో సమాజంలోని ప్రతి ఒక్క విభాగాన్ని కలుపుకొంటూ మనం ముందుకు సాగాలి.
సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించాలంటే, శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ, సమతూకమైన అభివృద్ధి, కొత్త తరం మౌలిక వసతులు చాలా అవసరం. అప్పుడే మనం భారతీయుల కలలను సాకారం చేయగలుగుతాం.
సోదర సోదరీమణులారా,
మూడేళ్ళుగా మేం పలు నిర్ణయాలు తీసుకున్నాం. కొన్నింటిని గుర్తించే ఉంటారు. మరికొన్నింటి గుర్తించలేకపోయి ఉండవచ్చు. అయితే, ఒక్క విషయం మాత్రం తథ్యం. పెద్ద మార్పు దిశగా అడుగు వేస్తున్నప్పుడు కొన్ని అవరోధాలు కూడా ఎదుర్కొనక తప్పదు. ఈ ప్రభుత్వం పనితీరు గమనించండి. ఒక రైలు రైల్వే స్టేషన్ ను దాటుతున్నపుడు లేదా ట్రాక్ మారుతున్నపుడు వేగాన్ని 60 నుండి 30 కిలోమీటర్లకు తగ్గించాలి. అలాంటి వేగం తగ్గించవలసిన పరిస్థితి లేకుండానే మేం దేశాన్ని కొత్త దారిలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. అదే వేగాన్ని కొనసాగిస్తున్నాం.
మేం ఎన్నో కొత్త చట్టాలు, జిఎస్‌టి వంటి కొత్త వ్యవస్థలు తీసుకువచ్చాం. వాటన్నింటిని విజయవంతంగా అమలు చేయగలిగాం. ఆ పనులు కొనసాగుతున్నాయి.
మౌలిక వసతులపై మేం అధికంగా దృష్టి కేంద్రీకరించాం. చిన్న పట్టణాల్లోని ‘‘రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, విమానాశ్రయాల నిర్మాణం, జల మార్గాలు, రోడ్డు మార్గాల విస్తరణ, గ్యాస్ గ్రిడ్‌లు, వాటర్ గ్రిడ్‌ల నిర్మాణం, ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్’’ ఏర్పాటు వంటి ఎన్నో పథకాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాం. అన్ని రకాల ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం.
ప్రియమైన నా దేశ వాసులారా,
భారతదేశం 21వ శతాబ్ధిలోకి పురోగమించాలంటే తూర్పు భారతం సుసంపన్నం కావడం చాలా అవసరం. తూర్పు ప్రాంతానికి అద్భుతమైన సామర్ధ్యాలు, విలువైన మానవ వనరులు, అపారమైన ప్రకృతి సంపద, కార్మిక శక్తి ఉన్నాయి. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగల శక్తి ఉంది. అందుకే మేం తూర్పు భారతం- బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య ప్రాంతాలపై అధికంగా దృష్టి కేంద్రీకరించాం. ఈ ప్రాంతాలన్నీ మరింతగా అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతాల్లో ఎంతో విలువైన ప్రకృతి వనరులు ఉన్నాయి. దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్ డానికి శ్రమించగల సామర్థ్యాలు ఉన్నాయి.
సోదర, సోదరీమణులారా,
అవినీతి రహిత భారతదేశం నిర్మాణం అత్యంత కీలకమైన సవాలు. దానికి కొత్త ఉత్తేజం ఇవ్వడానికి మేం ప్రయత్నిస్తున్నాం. మేం ప్రభుత్వం ఏర్పాటు చేయగానే తీసుకొన్న మొదటి చర్య ఎస్ఐటి (‘సిట్’) ఏర్పాటు. ఇప్పటికీ 1.25 లక్షల కోట్ల రూపాయల విలువైన నల్లధనాన్ని వెలికి తీసుకురాగలిగామని మూడేళ్ళ తరువాత ఈ రోజు నేను మీ అందరికీ గర్వంగా చెప్పగలుగుతున్నాను. దోషులను చట్టం పరిధిలోకి తీసుకురావడం లేదా లొంగిపోక తప్పని పరిస్థితి కల్పించాం.
మేం తీసుకున్న తదుపరి చర్య ‘‘పెద్ద నోట్ల చెలామణీ రద్దు’’. ఈ చర్య ద్వారా మేం ఎన్నో మైలు రాళ్ళను సాధించాం. భారీ మొత్తంలో మూలుగుతున్న నల్లధనాన్ని వ్యవస్థీకృత ఆర్థిక రంగం పరిధిలోకి తీసుకురాగలిగాం. మొత్తం సొమ్ము అంతటినీ వ్యవస్థీకృతమైన బ్యాంకింగ్ రంగం పరిధిలోకి తీసుకువచ్చే లక్ష్యంతో పాత నోట్ల మార్పిడికి కాల వ్యవధిని 7 రోజుల నుండి 10 రోజులకు, 10 రోజుల నుండి 15 రోజులకు పెంచుకుంటూ పోయాం. పెట్రోలు బంకులు, ఔషధ దుకాణాలు, రైల్వే స్టేషన్ లలో కూడా పాత నోట్ల చెలామణిని అనుమతించాం. ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మేం విజయం సాధించాం. ఒక అధ్యయనం ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చే అవకాశమే లేదన్న 3 లక్షల కోట్ల రూపాయల సొమ్మును పెద్ద నోట్ల రద్దు అనంతరం వ్యవస్థలోకి తీసుకురాగలిగాం.
బ్యాంకులలో డిపాజిట్ అయిన 1.75 లక్షల కోట్ల రూపాయల సొమ్ముపై దుర్భిణీ వేసి పరిశీలిస్తున్నాం. ఈ చర్య వల్ల 2 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. వారందరినీ అందుకు బాధ్యత వహించేలా వ్యవస్థ ఒత్తిడి తీసుకువస్తోంది. నల్లధన ప్రవాహాన్ని కూడా నిలువరించగలిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ మధ్య కాలంలో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 56 లక్షలు. గత ఏడాది ఇదే కాలంలో దాఖలైన రిటర్నులు 22 లక్షలతో పోల్చితే ఇది రెట్టింపు అయింది. నల్లధనం పై మా పోరాటం ఫలితం అది.
ప్రకటిత ఆదాయాన్ని మించిపోయిన ఆదాయం గల 18 లక్షల మందికి పైగా వ్యక్తులను గుర్తించాం. వారందరూ దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సుమారు 4.5 లక్షల మందికి పైగా ముందుకు వచ్చి తమ తప్పిదాలు ఆమోదించి సరైన బాటలో పయనించేందుకు సంసిద్ధత ప్రకటించారు. ఆదాయపు పన్నును గురించి కనీసం వినని లేదా ఒక్క పైసా ఆదాయపు పన్ను కూడా చెల్లించని లక్ష మంది ఇప్పుడు తప్పనిసరిగా పన్ను చెల్లించే పరిస్థితి వచ్చింది.
సోదర, సోదరీమణులారా,
కంపెనీల మూసివేత అనంతరం వాటిపై చర్చలు, గోష్ఠులు నిర్వహించడం ఈ దేశంలో పరిపాటి. ఆర్థిక వ్యవస్థ కరిగిపోయిందని, ఇతరత్రా ఊహాగానాలు కూడా ప్రజలు ప్రారంభిస్తారు.
నల్లధన ఆసాములే డొల్ల కంపెనీలకు యజమానులుగా ఉన్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన సమాచారరాశి విశ్లేషణలో 3 లక్షలకు పైగా డొల్ల కంపెనీలు హవాలా లావాదేవీలు నిర్వహించాయని బట్టబయలు అయింది. దీనిని ఎవరైనా ఊహించగలరా ! ఈ 3 లక్షల డొల్ల కంపెనీలలోను 1.75 లక్షల కంపెనీల లైసెన్సులను రద్దు చేయడం జరిగింది.
భారత్‌లో 5 కంపెనీలను మూసివేస్తేనే పెద్ద ఎత్తున ప్రజాందోళన చెలరేగుతుంది. కానీ, మేము 1.75 లక్‌ొల కంపెనీలను మూసివేయించాం. జాతి సంపదను దోచుకున్న వారు దీనికి సమాధానం చెప్పి తీరాలి.
ఒకే చిరునామా నుండి పని చేస్తున్న ఒకటికి మించిన డొల్ల కంపెనీలు కూడా ఉన్నాయంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. 400 కు పైగా కంపెనీలు ఇలా ఒకే చిరునామా నుండి పని చేస్తున్నాయని తేలింది. వారిని ప్రశ్నించే వారే లేకపోయారు. ఇదంతా పూర్తి కుమ్మక్కుతో జరిగిన చర్య.
అందుకే, సోదర, సోదరీమణులారా, అవినీతి నల్లధనం నేను అతి పెద్ద పోరాటం ప్రారంభించాను. భారతదేశ ఉజ్జ్వల భవిష్యత్తు, ప్రజల సంక్షేమం లక్ష్యంగానే మేం అవినీతిపై పోరాటం సాగిస్తున్నాం.
సోదర, సోదరీమణులారా,
మేం ఎన్నో చర్యలు తీసుకున్నాం. జిఎస్‌టి అనంతరం పారదర్శకత మరింతగా పెరుగుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. జిఎస్‌టి ని ప్రవేశపెట్టిన అనంతరం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చేస్తున్న ప్రయాణంలో ఒక ట్రక్కు డ్రైవర్ ప్రయాణ కాలంలో 30 శాతం వరకు తగ్గిపోయింది. చెక్ పోస్టుల తొలగింపుతో వందలాది కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. దీనివల్ల సామర్థ్యాలు 30 శాతం పెరిగాయి. భారతదేశ రవాణా రంగంలో 30 శాతం అధిక సామర్థ్యం వచ్చిందంటే, దాని ప్రభావం ఎంతో మీరెవరైనా ఊహించగలరా !. ఈ విప్లవాత్మక మార్పును జిఎస్‌టి తీసుకురాగలిగింది.
ఈ రోజు పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకుల వద్ద నగదు చాలినంత ఉంది. బ్యాంకులు వాటి వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. సామాన్యుడు కూడా ముద్రా యోజన ద్వారా నిధులు పొందగలుగుతున్నాడు. తన స్వంత కాళ్లమీద తాను నిలబడడానికి అవకాశాలు పొందుతున్నాడు. మధ్యతరగతి, అణగారిన వర్గాల వారు, స్వంత ఇంటి కల కలవారు తక్కువ వడ్డీకి బ్యాంకుల ద్వారా రుణాలు పొందగలుగుతున్నారు. ఇలాంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి ఊతం ఇస్తున్నాయి.
ప్రియమైన నా దేశవాసులారా,
కాలం మారింది. మనం 21 వ శతాబ్దంలో ఉన్నాం. ప్రపంచంలోనే యువజనులు ఎక్కువగా ఉన్న దేశం మనది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో, డిజిటల్ ప్రపంచంలో భారతదేశపు శక్తి ఏమిటో ప్రపంచానికి తెలుసు. మరి అలాంటపుడు మనం ఇంకా పాత ఆలోచనా ధోరణిలోనే ఉండాలా ? వెనుకటికి ఎప్పుడో తోలు కరెన్సీ చెలామణిలో ఉండేది. ఆ తరువాత అవి క్రమంగా కనుమరుగయ్యాయి. ఈరోజు మనం పేపర్ కరెన్సీ వాడుతున్నాం. క్రమంగా ఈ పేపర్ కరెన్సీ స్థానాన్ని డిజిటల్ కరెన్సీ ఆక్రమిస్తుంది. మనం డిజిటల్ లావాదేవీల దిశగా ముందడుగు వేయాలి. మనం డిజిటల్ లావాదేవీలకు ‘భీమ్ యాప్’ను ఉపయోగించాలి. దీనిని మన ఆర్థిక లావాదేవీలలో భాగం చేయాలి. మనం ప్రీపెయిడ్ వ్యవస్థల ద్వారా కూడా పనిచేయాలి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండడం నాకు సంతోషం కలిగిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే డిజిటల్ లావాదేవీలలో 34 శాతం పెరిగాయి. ప్రీ పెయిడ్ లావాదేవీలలో పెరుగుదల గత ఏడాదితో పోలిస్తే 44 శాతం ఉంది. మనం తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ దిశగా ముందుకు సాగాలి.
ప్రియమైన నా దేశవాసులారా, కొన్ని ప్రభుత్వ పథకాలు సామాన్యుడికి పొదుపు చేసేవి. మీరు ఎల్ ఇ డి బల్బులు వాడినట్టయితే మీరు ఏడాదికి రెండు వేల రూపాయల నుండి అయిదు వేల రూపాయల వరకు పొదుపు చేయవచ్చు. మనం స్వచ్ఛ భారత్‌లో విజయం సాధిస్తే పేదలు ఏడు వేల రూపాయల వరకు మందుల ఖర్చు లేకుండా చూసుకోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం వల్ల ప్రజలు డబ్బు పొదుపు చేసుకోవడానికి ఒక రకంగా వీలు కలిగింది.
జన ఔషధి ద్వారా చౌక ధరలకే మందులు అందించడం పేద ప్రజలకు ఒక వరం లాంటిది. శస్త్ర చికిత్సలు, స్టెంట్ లపై గతంలో ఎంతో ఖర్చు చేయాల్సి వచ్చేంది. మోకాలి శస్త్ర చికిత్సలతో సహా అన్నింటి ధరలు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నిస్తున్నాం. పేదలపై, మధ్యతరగతిపై ఖర్చుల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
గతంలో రాష్ట్రాల రాజధానులలో మాత్రమే డయాలసిస్ సదుపాయం ఉండేది. మేం ప్రస్తుతం జిల్లా కేంద్రాలలో డయాలిసిస్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించాం. ఇప్పటికే మేం 350 నుండి 400 జిల్లా కేంద్రాలలో ఇలాంటి సదుపాయాలు కల్పించాం. ఇక్కడ పేదలకు ఉచిత డయాలిసిస్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
ఎన్నో కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేసి ప్రపంచానికి చూపించాం. ఇది మనకు ఎంతో గర్వ కారణం. మనం జిపిఎస్ ద్వారా నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేయగలిగాం. సార్క్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి ఇరుగుపొరుగు దేశాలకు సహాయం చేశాం. తేజస్ విమానాన్ని ప్రవేశపెట్టి మన ప్రపంచంలో మన సత్తాను రుజువుచేసుకున్నాం. భీమ్ ఆధార్ యాప్ ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించింది. దేశంలో ఇప్పుడు కోట్లాది రూపే కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్డులన్నీ వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కార్డులున్నది ఇదే అవుతుంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
‘న్యూ ఇండియా’ కు సంబంధించిన ప్రతిజ్ఞను మరింత ముందుకు తీసుకుపోవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఒక పనిని మనం నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయకపోతే, దానికి తగిన ఫలితాన్ని మనం పొందలేం అని మన పవిత్ర గ్రంథాల్లో ఉంది. కనుక టీమ్ ఇండియా, 125 కోట్ల మంది భారతీయులు 2022 సంవత్సరం నాటికి చేరుకోవలసిన లక్ష్యాల సాధనకు సంబంధించి సంకల్పం చెప్పుకోవాలి. 2022లో మహత్తర భారతావనిని దర్శించేందుకు మనం నిబద్ధతతో సాగుదాం.
అలాగే మనం పేదలందరికీ పక్కా గృహాలు, విద్యుత్, మంచినీటి సదుపాయం ఉండే భారతదేశాన్ని నిర్మిద్దాం.
రైతులు ఎలాంటి చీకూ చింతా లేకుండా నిద్రించే పరిస్థితులు ఉండేటట్టు మనమందరం సమష్టిగా భారతదేశాన్ని నిర్మిద్దాం. వారు ఇవాళ సంపాదిస్తున్న దానికి రెట్టింపు మొత్తాన్ని 2022 నాటికి సంపాదించగలుగుతారు.
యువత, మహిళలు వారి కలలను సాకారం చేసుకునేందుకు మరిన్ని అవకాశాలు ఉండే భారతదేశాన్ని సమష్టిగా మనం నిర్మి ద్దాం.
ఉగ్రవాదం, మతతత్వం, కులతత్వాల తావు ఉండని భారతదేశాన్ని మనందరం కలిసి నిర్మిాద్దాం.
అవినీతి, బంధుప్రీతిని ఏమాత్రం సహించని, వీటితో ఎవ్వరూ ఏ విధమైన రాజీ పడని భారతదేశాన్ని మనందరం కలిసి నిర్మిద్దాం.
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ‘సు- రాజ్’ కలలను సాకారం చేసే భారతదేశాన్ని మనం కలసికట్టుగా నిర్మిద్దాం.
ప్రియమైన నా దేశ వాసులారా, అలా మనందరం కలిసి అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం.
70 వసంతాల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుని మరికొద్ది సంవత్‌ిరాలలో 75 వసంతాల స్వాతంత్ర్యం కోసం ఎదురు చూస్తున్న మహోన్నతమైన భారతదేశం, ఘనమైన భారతదేశం నిర్మాణ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు మనందరం కలిసి ముందుకు సాగుదాం.
నా మది లోని ఈ ఆలోచనలతో, మన దేశ స్వాతంత్ర్య సమర యోధులకు నేను మరొక్క సారి నా శిరస్సుసు వంచి నమస్కరిస్తున్నాను.
నూతన విశ్వాసంతో , వినూత్న ఆలోచనలతో ఉన్న 125 కోట్ల మంది నా దేశ ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఈ కొత్త ప్రతిజ్ఞతో టీమ్ ఇండియా ముందుకు సాగాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.
నా మది లోని ఈ ఆలోచనలతో మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
భారత్ మాతా కీ జయ్,
వందేమాతరమ్, జయ్ హింద్
జయ్ హింద్, జయ్ హింద్, జయ్ హింద్, జయ్ హింద్
భారత్ మాతా కీ జయ్, భారత్ మాతా కీ జయ్, భారత్ మాతా కీ జయ్
వందేమాతరమ్, వందే మాతరమ్, వందే మాతరమ్, వందే మాతరమ్.
అందరికీ ధన్యవాదాలు.