భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు కావొస్తున్నా ఇప్పటికీ దేశంలో 18,000 గ్రామాలకు విద్యుత్ శక్తి అందడం లేదు. ఈ 18,000 గ్రామాలకు విద్యుత్ ను అందించాలనే బృహత్తరమైన లక్ష్యాన్ని భారతదేశం నిర్దేశించుకున్నది. దేశంలో కరెంటు లేని గ్రామాలన్నిటికీ రాబోయే వేయి రోజుల్లో కరెంటు అందజేస్తామని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో స్పష్టం చేశారు. దేశంలో గ్రామీణ విద్యుదీకరణ చాలా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ఎన్నడూ లేనంతగా పారదర్శకమైన పద్ధతిలో జరుగుతోంది. ఏ ఏ గ్రామాలకు విద్యుత్ సౌకర్యాన్ని అందివ్వాల్సి ఉందో ఆ గ్రామాల వివరాలను మొబైల్ యాప్ , వెబ్ డ్యాష్ బోర్డు ద్వారా తెలుసుకోవచ్చు. కరెంటు లేని గ్రామాలకు కరెంటు సౌకర్యం కల్పించగానే ఆ పల్లెల్ని విద్యుత్ పొందుతున్న పల్లెలుగానే చూడకూడదు. కరెంటు సౌకర్యం కల్పించడమనేది అంతకంటే ఎక్కువ. కరెంటు సౌకర్యాన్ని కలిగిన గ్రామాల ప్రజల కలలు, ఆకాంక్షలు, జీవితంలో సాధించే ప్రగతి ఇందులో ప్రతిఫలిస్తుందనే విషయం మరిచిపోరాదు.
From the ramparts of the Red Fort last year, I had called for the electrification of all remaining villages in 1000 days (18,452 villages).
— Narendra Modi (@narendramodi) February 11, 2016
Happy to share that Team India has done exceedingly well. Within about 6 months only (around 200 days), we have crossed the 5000 mark.
— Narendra Modi (@narendramodi) February 11, 2016
Already 5279 villages have been electrified. Excellent work has been done by the Power Ministry in Bihar, UP, Odisha, Assam & Jharkhand.
— Narendra Modi (@narendramodi) February 11, 2016
Power Ministry shares real time updates on rural electrification. Their dashboard is worth a look. https://t.co/5BoqVm7hJA @PiyushGoyal
— Narendra Modi (@narendramodi) February 11, 2016
భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా 2012 జులై నెలలో భారీ స్థాయిలో కరెంటు సరఫరాకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఆ సమయంలో 62 కోట్ల మంది చీకట్లో కొట్టుమిట్టాడారు. 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అవకాశమున్నప్పటికీ దేశంలో చీకట్లు అలుముకున్నాయి. కారణం బొగ్గు, గ్యాస్ కొరత. ఆ సమయంలో మొత్తం విద్యుత్ రంగమే విషవలయంలో చిక్కుకుపోయి విధానపరమైన లోపాలతో కష్టాల్లో కూరుకుపోయింది. విద్యుత్ ఉత్పత్తిలో మిగులు సాధించడానికి అవకాశమున్నప్పటికీ, పెట్టుబడులు భారీగా పేరుకుపోయినప్పటికీ విద్యుత్ రంగం చేష్టలుడిగినట్టుగా తయారైంది. మరో వైపు భారీ కరెంటు కోతలతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. 2014లో ఎన్ డీ ఏ ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టే నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాల్లో మూడింట రెండువంతులు (కేంద్ర విద్యుత్ అధికార సంస్థ ప్రకారం వంద కర్మాగారాలకుగాను 66 ) బొగ్గు కొరతను ఎదుర్కొన్నాయి. ఆ సమయానికి వాటి దగ్గర ఏడు రోజులకు సరిపోయే బొగ్గు మాత్రమే స్టాకులో ఉంది. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి ఈ కర్మాగారాలు బైటపడ్డాయి. దేశంలో ఏ కర్మాగారం దగ్గర ఇప్పుడు బొగ్గు కొరత అనే సమస్య లేదు.
అందరికీ విద్యుత్ ను అందించాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వచ్ఛమైన ఇంధన శక్తికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. 175 గిగావాట్ల శక్తిని పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ఒక బృహత్తరమైన లక్ష్యంతో పనిచేస్తోంది. వంద గిగావాట్ల సౌరశక్తితో కలుపుకొని ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది.
విద్యుత్ రంగంలో దీర్ఘకాలిక వ్యవస్థీకృత ప్రగతిని ఆకాంక్షిస్తూ కొత్త ప్రభుత్వం ఒక సమగ్రమైన విధానంతో వారంలో ఏడు రోజులూ, రోజుకు 24 గంటలూ అందరికీ విద్యుత్ ను అందించాలనే లక్ష్యంతో ముందుకుపోతోంది. వృద్ధి సంఖ్యలను చూస్తే విద్యుత్ రంగం ఎంత ఆరోగ్యకరంగా ఉందో చెప్పవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) ప్రకారం విద్యుత్ ఉత్పత్తి అక్టోబర్ నెలలో 9 శాతం పెరిగింది. ఏప్రిల్ నుంచి నవంబర్ నెలల మధ్యలో కోల్ ఇండియా లిమిటెడ్ సాధించిన ఉత్పత్తి 9 శాతం పెరిగింది. 2014-15లో కోల్ ఇండియా సాధించిన బొగ్గు ఉత్పత్తి అంతకు ముందు నాలుగు సంవత్సరాల్లో కలిపి సాధించిన ఉత్పత్తి కంటే ఎక్కువ. దాని ఫలితంగా గత సంవత్సరంతో పోలిస్తే నవంబర్ నెలలో బొగ్గు దిగుమతులు 49 శాతానికి పడిపోయాయి. 2014-15లో దేశంలోని బొగ్గు కేంద్రాల్లో ఉత్పత్తి ఏ సంవత్సరమూ లేని విధంగా 12.12 శాతం పెరిగింది. సుప్రీంకోర్టు 214 బొగ్గు బ్లాకుల అనుమతిని రద్దు చేయడంతో, ఈ రంగంలో ఏర్పడ్డ సంక్షోభాన్ని కేంద్రం ఒక సదవకాశంగా భావించి చర్యలు చేపట్టంది. పారదర్శకమైన ఎలక్ట్రానిక్ వేలాల ద్వారా బొగ్గు బ్లాకులను కేటాయించింది. తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా రాష్ట్రాలకు అందిస్తున్నారు. ముఖ్యంగా తూర్పు భారతదేశంలో వెనుకబడిన రాష్ట్రాలకు ఈ ఆదాయం అందుతోంది.
గతం సంవత్సరం 22,566 మెగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా చేర్చి ఈ రంగంలో ఇదివరకు ఎన్నడూ సాధించని విజయాన్ని అందుకోవడం జరిగింది. ప్రధాన సమయాల్లో ఎదుర్కొనే కొరత 2008-09లో 11.9 శాతం ఉంటే దాన్ని ఇప్పుడు 3.2 శాతానికి తగ్గించడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో విద్యుత్ కొరతను 2.3 శాతానికి తగ్గించగలిగాం. ఈ కొరత 2008-09లో 11.1 శాతంగా ఉండేది. ఈ తగ్గింపు అనేది భారతదేశ చరిత్రలోనే అతి తక్కువ తగ్గింపు.
ఇక విద్యుత్ సరఫరా విషయానికి వస్తే మిగులు రాష్ట్రాలనుంచి విద్యుత్ ను కొరత రాష్ట్రాలకు సరఫరా చేయడంలో అనేక ఇబ్బందులుండేవి. వీటిని తొలగించడానికి కేంద్రం అనేక చర్యలు చేపట్టడం జరిగింది. ఒకే జాతి, ఒకే గ్రిడ్, ఒక ఫ్రీక్వెన్సీ నినాదానికి అనుగుణంగా దక్షిణాది గ్రిడ్ ను వేగంగా సింక్రనైజ్ చేయడం జరిగింది. 2013-14లో అందుబాటులోని సరఫరా సామర్థ్యం 3, 450 మెగావాట్లు. దీన్ని 5,900 మెగావాట్లకు అంటే 71 శాతానికి ఈ నెలలో పెంచడం జరిగింది.
పవర్ వాల్యూ చెయిన్ (విద్యుత్ విలువ గొలుసు)లోని బలహీనమైన లింకును బలోపేతం చేయడానికి ఉదయ్ (ఉజ్వల్ డిస్కమ్ అస్యూరెన్స్ యోజన) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా ఈ రంగంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. కిందినుంచి పైదాకా ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి వీలుగా ఉదయ్ కార్యక్రమాన్ని అభివృద్ధి పరచటం జరిగింది. ఇందుకుగాను ఆయా రాష్ట్రాలకు చెందిన ఉన్నతస్థాయివారందరితోను (ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, డిస్కమ్ ఎండీలు మొదలైనవారు), బ్యాంకర్లతోను, రెగ్యులేటర్లు మొదలైనవారందరితోను చర్చలు చేయడం జరిగింది. డిస్కంలను రుణ ఊబినుంచి బైటకు పడేస్తూనే అవి సుస్థిరమైన కార్యాచరణ ప్రగతిని సాధించేలా ఉదయ్ కార్యక్రమం ఒక స్పష్టమైన మార్గాన్ని తయారు చేసింది. విద్యుత్ వ్యయాన్ని తగ్గించడానికి మరోవైపు ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. వీటి ఫలితంగా 2018-19నాటికి డిస్కంలు లాభాలబాట పడతాయని భావిస్తున్నారు. ఉదయ్ కార్యక్రమం కింద చేపట్టిన చర్యలు డిస్కంల సమస్యలకు శాశ్వత పరిష్కాలను చూపిస్తాయి. అందరూ కలిసికట్టుగా కృషి చేయడం, సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంపైన ఫోకస్, విద్యుత్ వ్యయాన్ని తగ్గించడం తదితర చర్యలవల్ల ఉదయ్ కార్యక్రమం ఒక విశిష్టమైన కార్యక్రమంగా గుర్తింపు పొందుతుంది. గతంలో విద్యుత్ రంగంలో చేపట్టిన చర్యలకంటే ఇది మేలైనదిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
విద్యుత్ ను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో గణనీయమైన ప్రగతి సాధించడం జరిగింది. తక్కువ కరెంటుతో ఎక్కువ వెలుగునిచ్చే ఎల్ఈడీ బల్బుల ధరలో 75శాతం తగ్గుదలవల్ల, ఆ బల్బులను 4 కోట్ల దాకా ఒక సంవత్సరంలోనే పంపిణీ చేయడంవల్ల ఈ ప్రగతి సాధించడం జరిగింది. ఇప్పుడు వినియోగిస్తున్న ప్రతి సాధారణ బల్బు స్థానంలో ఎల్ఈడీ బల్బును 2018లోపు అమర్చడానికిగాను 77 కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇళ్లలోను, వీధుల్లోను ఎల్ఈడీ బల్బుల వినియోగ కార్యక్రమాలవల్ల విద్యుత్ అధిక వినియోగ సమయాల్లో వచ్చే డిమాండ్ ను 22 గిగావాట్లకు తగ్గించడానికి అవకాశముంది. దీనివల్ల ప్రతి సంవత్సరం 11, 400 కోట్ల ఎలక్టిసిటీ యూనిట్లను ఆదా చేయవచ్చు. తద్వారా 8.5 కోట్ల టన్నుల బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డయాక్సైడ్) ఉద్గారాలను ఆపగలుగుతాం. 22 గిగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా సాధించడం ఒక గొప్ప విజయమే కావచ్చుగానీ పర్యావరణ సంరక్షణకుగాను ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలవల్ల అంతకు మించి మానవాళికి మేలు జరుగుతుంది.