ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాదక ద్రవ్యరహిత భారత దేశ ప్రచారాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి వీడియో సందేశమిచ్చారు. హిస్సార్‌లోని గురు జంభేశ్వర విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి సందేశాన్ని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సందేశమిస్తూ ప్రధానమంత్రి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, శ్రీశ్రీ రవిశంకర్‌లు దేశంలో మాదక ద్రవ్యాల బెడదను ఎదుర్కొనేందుకు చేస్తున్న కృషిని అభినందించారు.
మాదకద్రవ్యాలు సమాజానికి తీవ్ర బెడద అని అంటూ ప్రధానమంత్రి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ) అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల మందికి పైగా ప్రజలు మాదకద్రవ్యాలకు బానిసలుగా ఉన్నారని అన్నారు.
ఎంతోమంది యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతుండడం చూసి ఆందోళన కలుగుతున్నదని అన్నారు. డ్రగ్స్ మామూలు విషయం కాదు. డ్రగ్స్ అనేది స్టైల్ స్టేట్‌మెంట్ అనుకోవడం అపోహ అని ప్రధానమంత్రి అన్నారు.
మాదకద్రవ్యాలకు బానిసలు కావడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తడమే కాక, కుటుంబాలు ద్వంసమౌతాయని, మాదకద్రవ్యాలు వ్యాపారం మాత్రమే కాదని దాని వల్ల దేశ రక్షణ, భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదుల రాబడికి ప్రధానవనరు మాదకద్రవ్యాల వ్యాపారమేనని ప్రధానమంత్రి తెలిపారు.జాతి వ్యతిరేక శక్తులు, వీరు మాదక ద్రవ్యాల వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బును దేశాన్ని అస్థిరపరిచేందుకు వాడుతాయని అన్నారు.
ఆరోగ్యకరమైన జీవనం, సంతోషకరమైన కుటుంబ జీవనం , ఉజ్వల భవిష్యత్తు కోసం , దేశ భద్రత రక్షణ కోసం యువతరం మాదక ద్రవ్యాలకు నో చెప్పాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆత్మవిశ్వాసం, తమపై తమకు విశ్వాసం ఉన్నవారు మాదక ద్రవ్యాల వినియోగపు ఉచ్చులో పడరని ప్రధాని చెప్పారు.మాదక ద్రవ్యాల బానిసత్వం నుంచి బారినుంచి బయటపడే వారికి యువతరం అండగా ఉండాలని కూడా ప్రధాని చెప్పారు. బాధితులతో మాట్లాడడం, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, వారిపట్ల ప్రేమ చూపడం, వారికి మద్దతునివ్వడం వంటి వాటి ద్వారా మాదక ద్రవ్యాల ప్రభావంలో ఉన్నవారిని తిరిగి పునరావాస మార్గంలోకి మళ్లించవచ్చని ప్రధాని అన్నారు.
మాదక ద్రవ్యాల బెడదను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
ఈ నేపథ్యంలో, నేషనల్ యాక్షన్ ప్లాన్‌ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. 2018లో దీనిని చేపట్టారు. ఇది మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన కల్పించడం, సామర్ధ్యాల నిర్మాణం, పునరావాసం, 2023 నాటికి డ్రగ్ డిమాండ్‌ను తగ్గించడానికి వీలుగా తీవ్రమైన అంశాలలో తగిన జోక్యానికి వీలు కల్పిస్తుంది.
ప్రధానమంత్రి ప్రసంగాన్ని,దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్దులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విన్నారు.