ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత ప్రభుత్వ కార్యదర్శులు అందరి తో లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ రాజ్‌నాథ్ సింహ్, శ్రీ అమిత్ శాహ్, శ్రీమతి నిర్మలా సీతారమణ్ లతో పాటు డాక్టర్ జితేంద్ర సింహ్ కూడా పాల్గొన్నారు.
మంత్రిమండలి కార్యదర్శి శ్రీ పి.కె. సిన్హా సంభాషణ ను మొదలు పెడుతూ, ప్రభుత్వ ఇదివరకటి పదవీకాలం లో డైరెక్టర్/డిప్యూటీ సెక్రెటరీ స్థాయి కలిగిన అధికారులు అందరి తో ప్రధాన మంత్రి ఏ విధం గా నేరు గా సంభాషించిందీ గుర్తు కు తెచ్చారు.
రంగాల వారీ కార్యదర్శుల బృందాల ఎదుట రెండు ముఖ్యమైన కార్యభారాల ను ఉంచనున్నట్లు మంత్రిమండలి కార్యదర్శి ఈ సందర్భం గా వెల్లడించారు. ఈ రెండు పనుల లో.. (అ) ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ కు విస్పష్టం గా నిర్దేశించిన లక్ష్యాల తో, చేరుకోవలసిన మైలు రాళ్ళ తో కూడినటువంటి ఒక అయిదు సంవత్సరాల ప్రణాళిక పత్రం; (ఆ) ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ కు సంబంధించి గణనీయ ప్రభావాన్ని ప్రసరించగల ఒక నిర్ణయం- ఆ నిర్ణయానికై 100 రోజుల లోపల ఆమోదాలను తీసుకోవడం.. అనేవి భాగం గా ఉన్నాయి.
ఈ సంభాషణ క్రమం లో పాలనాపరమైన నిర్ణయాలను తీసుకోవడం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఐటి కార్యక్రమాలు, విద్యాసంబంధ సంస్కరణ, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక విధానం, ఆర్థిక వృద్ధి, నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాల పై వివిధ కార్యదర్శులు వారి వారి ఆలోచనల ను మరియు దార్శనికత ను గురించి వెల్లడించారు.
ప్రధాన మంత్రి మాట్లాడుతూ, 2014వ సంవత్సరం జూన్ లో ఇదే మాదిరి గా కార్యదర్శుల తో తాను జరిపిన తొలి ముఖాముఖి ని గుర్తు కు తెచ్చారు. ఇటీవలి సాధారణ ఎన్నికలు ప్రభుత్వ అనుకూలత కు గుర్తు గా నిలచాయని, దీని కి గాను ఖ్యాతి అంతా అధికారుల జట్టు కు చెంది తీరాలని ఆయన అన్నారు. గడచిన అయిదు సంవత్సరాల కాలం లో పథకాల కు రూపకల్పన చేసి, క్షేత్ర స్థాయి లో చక్కని ఫలితాలు వచ్చేటట్టు కష్టించిందీ అధికారుల యావత్తు బృందం అని ఆయన వివరించారు. ఈ సారి జరిగిన ఎన్నికల లో ఒక సానుకూల వోటు కనిపించిందంటూ, ఇది సగటు మనిషి పెట్టుకున్నటువంటి విశ్వాసం నుండి, అతడికి నిత్య జీవనం లో ఎదురైన అనుభవాల నుండి వచ్చినట్లు ప్రధాన మంత్రి వివరించారు.
భారతీయ వోటరు రానున్న అయిదు సంవత్సరాల కాలానికి గాను ఒక దార్శనికత ను రూపొందించాడని, మరి ఇది ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి ఒక అవకాశం అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజలు పెట్టుకున్న భారీ అంచనాల ను ఒక సవాలు గా భావించకూడదు, వాటి ని ఒక అవకాశం గా చూడాలని ఆయన చెప్పారు. జనాదేశం యథా తథ స్థితి ని మార్చాలన్న ప్రజల సంకల్పాన్ని మరియు వారి ఆకాంక్షల ను, అలాగే ప్రజలు వారికంటూ ఒక మెరుగైన జీవనాన్ని కోరుకొంటున్నారని సూచిస్తోందని ఆయన అన్నారు.
జనాభా యొక్క వయస్సు పరం గా ఉన్న అనుకూలత ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఈ విధమైన సానుకూలత ను సమర్ధం గా వినియోగించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దడం లో కేంద్ర ప్రభుత్వం లోని ప్రతి ఒక్క విభాగానికి, అలాగే ప్రతి రాష్ట్రం లోని ప్రతి ఒక్క జిల్లాకు ఒక భూమిక అంటూ ఉంది అని ఆయన వివరించారు. ‘‘మేక్ ఇన్ ఇండియా’’ కార్యక్రమాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఈ దిశ గా కంటి కి కనపడేటటువంటి పురోగతి ని సాధించవలసిన ఆవశ్యకత ఉందన్నారు.
‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’’లో భారతదేశం యొక్క పురోగతి చిన్న వ్యాపారాల కు మరియు నవ పారిశ్రామికుల కు మరింత వెసులుబాటు ను ప్రతిబింబించాలని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రభుత్వం లోని ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ ‘‘ఈజ్ ఆఫ్ లివింగ్’’పై శ్రద్ధ తీసుకోవాలి అని ఆయన అన్నారు.
జలం, మత్స్య పరిశ్రమ, ఇంకా పశు పోషణ లు కూడా ప్రభుత్వాని కి ముఖ్యమైన రంగాలు గా ఉంటాయని ప్రధాన మంత్రి చెప్పారు.
ఈ నాటి సంభాషణ కొనసాగిన క్రమం లో తాను కార్యదర్శుల దార్శనికత ను, వచన బద్ధత ను, మరి అలాగే, దేశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వారి లో ఉన్న శక్తి ని తాను గమనించినట్లు ఆయన వివరించారు. ఈ జట్టు ను చూసుకొని తాను గర్విస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫలితాల ను మెరుగు పరచుకోవడం కోసం, అలాగే ప్రతి ఒక్క విభాగం లో దక్షత కు సాన పెట్టుకోవడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
త్వరలో భారతదేశ స్వాతంత్య్రం 75 సంవత్సరాల మైలురాయి ని చేరుకోబోతున్న తరుణం లో, ఆ ఘట్టం దేశ అభ్యున్నతి కి తమ వంతు తోడ్పాటు ను అందించే విధంగా ప్రజల కు ప్రేరణ ను ఇవ్వగలుగుతుందని, మరి ఈ అవకాశాన్ని అన్ని విభాగాలు దృష్టి లో పెట్టుకొని ముందుకు పోవాలని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం ప్రతి ఒక్కరూ వారి శక్తి మేరకు కృషి చేయాలని ఆయన కోరారు.