ఐసిటి ఆధారితమైన మల్టి- మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ప్రగతి) మాధ్యమం ద్వారా ఈ రోజు జరిగిన ఇరవై ఏడో ముఖాముఖి సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఇప్పటివరకు జరిగిన 26 ‘ప్రగతి’ సమావేశాలలో, మొత్తం 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి తో కూడిన పథకాలను సమీక్షించడం జరిగింది. పలు రంగాలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తీరును కూడా సమీక్షించడమైంది.
ఈ రోజు జరిగిన ఇరవై ఏడో సమావేశంలో రైల్వేలు, రహదారులు మరియు విద్యుత్తు రంగాల లోని ఎనిమిది అవస్థాపన పథకాల యొక్క పురోగతి ని ప్రధాన మంత్రి సమీక్షించారు. ఈ పథకాలు బిహార్, ఝార్ ఖండ్, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, చండీగఢ్, ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిమ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లతో సహా అనేక రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి.
ఇప్పటికే జిల్లా/రిఫరల్ ఆసుపత్రులకు అనుబంధించబడిన కొత్త వైద్య కళాశాలల స్థాపన తాలూకు పథకం యొక్క అమలులోని పురోగతిని ప్రధాన మంత్రి సమీక్షించారు. ఆరోగ్య రంగంలో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని ఆయన ప్రస్తావిస్తూ, ఆరోగ్య రంగంలో అవస్థాపన ను శీఘ్ర గతిన మెరుగుపరచాలంటూ పిలుపునిచ్చారు.
2018వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ నుండి మే నెల 5వ తేదీ వరకు జరిగినటువంటి ‘గ్రామ్ స్వరాజ్ అభియాన్’ ఒకటో దశ 16,000కు పైగా గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఏడు కీలక పథకాలు అమలు కావడంలో గొప్ప సాఫల్యాన్ని సాధించినట్లు ప్రధాన మంత్రి వివరించారు. ప్రస్తుతం ‘గ్రామ్ స్వరాజ్ అభియాన్’ తాలూకు రెండో దశ ఆకాంక్షాభరిత జిల్లాల్లో 40,000కు పైగా పల్లెలలో కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ కృషిలో పాలుపంచుకొంటున్న కేంద్ర ప్రభుత్వ అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు ఈ విషయంలో ఆగస్టు 15వ తేదీ కల్లా సాధ్యమైనంత ఉత్తమ ఫలితాలను నమోదు చేసే దిశగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
‘సౌభాగ్య యోజన’ లో భాగంగా ఇంతవరకు చోటుచేసుకొన్న పురోగతిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. నిర్దేశిత గడువు లోగా 4 కోట్ల కుటుంబాలకు విద్యుత్తు సదుపాయాన్ని సమకూర్చాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు సకల ప్రయత్నాలను చేసి తీరాలని ఆయన అన్నారు.