ప్రియమైన నా తోటి పౌరులారా,

ఈ రోజంతా నేను పంజాబ్‌ లో ఉన్నాను.  ఢిల్లీ కి తిరిగివచ్చిన త‌రువాత నా మ‌నోభావాల ను  మీ అంద‌రి కి వెల్లడిస్తే బాగుంటుంది అనిపించింది.  అనేక సంవ‌త్స‌రాల చ‌రిత్ర‌ గ‌ల ఒక ముఖ్య‌మైన అంశం పై నేడు గౌర‌వ‌నీయ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం త‌న తీర్పు ను ప్ర‌క‌టించింది.  ఈ అంశం పై న్యాయ‌స్థానం లో రోజువారీ విచార‌ణ జ‌ర‌గాల‌ని దేశం మొత్తం ఆకాంక్షించింది.  అందుకు అనుగుణం గా విచార‌ణ పూర్త‌ి అయిన ఫ‌లితమే నేటి తీర్పు.  మొత్తంమీద ద‌శాబ్దాల త‌ర‌బ‌డి సాగిన న్యాయ‌ప్ర‌క్రియ నేటి తో ముగిసింది.

మిత్రులారా,

భార‌తదేశం అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌ం అన్నది ప్ర‌పంచ‌ం అంత‌టి కి తెలిసిన వాస్త‌వం కాగా, మ‌న ప్ర‌జాస్వామ్యం ఎంత బ‌ల‌మైందో, మ‌రెంతటి చైత‌న్య‌వంత‌మైందో ఇవాళ ప్ర‌పంచాని కి బ‌హు బాగా తెలియ‌వ‌చ్చింది.  ఈ రోజు న తీర్పు వెలువ‌డిన అనంతరం స‌మాజం లోని ప్రతి వ‌ర్గాని కి, ప్ర‌తి సముదాయాని కి, ప్ర‌తి మ‌తం తో పాటు యావత్తు దేశ ప్ర‌జానీకం ఈ తీర్పు ను స‌హ‌ర్షం గా స్వాగ‌తించింది.  అనాది గా భార‌త‌దేశం అనుస‌రిస్తున్న విలువ‌లు, సంస్కృతి, సంప్ర‌దాయాలు స‌హా అనూచానం గా వ‌స్తున్న‌ స‌ర్వ‌ మాన‌వ సౌభ్రాతృత్వ స్ఫూర్తి కి ఇది అద్దం ప‌ట్టింది.

సోదరీమణులు మరియు సోదరులారా,

వివిధత్వం లో ఏక‌త్వాని కి ప్ర‌తీక‌ గా పేరెన్నిక‌గ‌న్న‌ది భార‌త‌దేశం.   ఈ స్ఫూర్తి ఇవాళ ఎల్లెడ‌లా ప్ర‌స్ఫుట‌మైంది.  వేలాది సంవత్సరాల త‌రువాతనైనా భార‌తీయ నైతిక నిష్ట ను తెలుసుకోవాల‌ని భావిస్తే ఈ రోజు ను అందుకు ఒక మహాద్భుత ఉదాహరణ గా ప్రస్తావించవచ్చు.

మిత్రులారా,

భార‌తదేశం యొక్క న్యాయ‌ వ్య‌వ‌స్థ చ‌రిత్ర‌ లో కూడా ఇది సువ‌ర్ణాక్ష‌రాల‌ తో లిఖించ‌ద‌గిన రోజు.  

(అయోధ్య కేసు పై) విచార‌ణ సంద‌ర్భం గా గౌర‌వ‌నీయ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అంద‌రి వాద‌న‌ల‌ ను ఎంతో ఓపిక గా విని అనంతరం న్యాయస్థఆనం ఏకీభావం గల తీర్పు ను ప్ర‌క‌టించింది.  

ఇది అతి సాధారణమైనటువంటి విషయం ఏమీ కాదు.

ఈ రోజు చరిత్రాత్మకమైనటువంటి రోజు.  ఇది దేశ న్యాయ వ్యవస్థ లో ఒక స్వర్ణ యుగాని కి ఆరంభం.  ఈ తీర్పు ఏకగ్రీవ తీర్పే కాకుండా సాహసోపేతమైనటువంటి తీర్పు కూడాను.  సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ను ఇవ్వడం లో దృఢ నిశ్చయాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించింది.  మన న్యాయ వ్యవస్థ కు ప్రత్యేక ప్రశంస లభించవలసిన అవసరం ఉంది.

మిత్రులారా,

ఈ రోజు న‌వంబ‌రు 9వ తేదీ. 

ఈ రోజుననే బెర్లిన్ గోడ కూలింది. 

రెండు భిన్న భావ స్రవంతులు కలసి, ఒక క్రొత్త ప్ర‌తిన‌ ను పూనాయి.

ఈ రోజు న, నవంబ‌రు 9వ తేదీ నాడు, క‌ర్ తార్‌ పుర్ కారిడర్‌ లో రాక‌ పోక‌ లు మొదలయ్యాయి. 

ఈ మార్గం రూపొంద‌డం లో భార‌త‌దేశం, పాకిస్తాన్ లు సమన్వయం తో కృషి సలిపాయి.

ఇవాళ నవంబరు 9వ తేదీ న, సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పు ద్వారా మ‌న‌మంతా కలసికట్టు గా సహజీవనం చేయాలన్న సందేశాన్ని ఇచ్చింది.  ఈ సందర్భం గా ఎవ‌రి మ‌ది లో వైమనస్యం ఉండకూడదు.  

ఎవరిలోనైనా ఏ కాస్త అసహ‌నం ఉన్నప్పటికీ, దాని కి వీడ్కోలు ప‌లుకవలసిన త‌రుణ‌ం ఇది.  

న్యూ ఇండియా లో, భ‌యం, అస‌హ‌నం, ప్ర‌తికూల భావ‌న‌ల‌ కు తావు లేదు.

మిత్రులారా,

అత్యంత జ‌టిల‌ స‌మ‌స్య‌నైనా మ‌న రాజ్యాంగ చ‌ట్రం ప‌రిధి లో చ‌ట్టాల స్ఫూర్తి తో ప‌రిష్క‌రించుకోగ‌ల‌మ‌ని గౌర‌వ‌నీయ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఇవాళ్టి త‌న తీర్పుద్వారా స్ప‌ష్ట‌మైన సందేశాన్ని ఇచ్చింది.

ఎంతో కొంత ఆల‌స్య‌ం అయినప్ప‌టికి, మనం సహనం తో ఉండాలి అని ఈ తీర్పు ద్వారా మనం నేర్చుకోవాలి. ఇది ప్ర‌తి ఒక్క‌రి మేలు కే. 

ప్రతి ఒక్క ప‌రిస్థితి లోను, భార‌త రాజ్యాంగం పట్ల, భార‌త న్యాయ‌వ్య‌వ‌స్థ‌ పట్ల మ‌న‌ విశ్వాసం అచంచలం గా ఉండాలి.  ఇది చాలా ముఖ్యం.

మిత్రులారా,

గౌర‌వ‌నీయమైనటువంటి స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తీర్పు న‌వోద‌యాని కి నాంది ప‌లికింది.  

అయోధ్య వివాదం అనేక త‌రాల‌ పై ప్ర‌భావాన్ని ప్రసరించింది.  అయితే, నేటి తీర్పు తరువాత, రాబోయే త‌రాలు తాజా స్ఫూర్తి తో న్యూ ఇండియా నిర్మాణాని కి తమను తాము అంకిత‌ం చేసుకొనేటట్టు చూస్తాం అంటూ మ‌న‌ం అందరమూ శ‌ప‌థం చేయాలి.

రండి.. మ‌న‌మంతా ఒక కొత్త అధ్యాయాన్ని ఆరంభిద్దాము.

రండి.. మ‌న‌మంతా ఒక న్యూ ఇండియా ను నిర్మిద్దాము.

మ‌నం బ‌లోపేతం కావాలి.  మన ప్రగతి అనేది ఏ ఒక్క‌రూ వెనుకబడిపోకూడదనే ఆధారాంశాని కి తుల తూగాలి.  

మనం ప్రతి ఒక్కరి ని వెంట తీసుకుపోవాలి, ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం మనం కృషి చేయాలి, మనం ప్రతి ఒక్కరి నమ్మకాన్ని పొందుతూ ముందుకు సాగాలి.

మిత్రులారా,

రామ మందిర నిర్మాణం పై సర్వోన్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించింది. 

ఈ నిర్ణయం దేశ నిర్మాణం లో పౌరులందరి భుజస్కంధాల పై గల బాధ్యత ను  మరింత పెంచింది. 

అలాగే, ఈ దేశ పౌరులు గా మ‌న చ‌ట్టాల‌ ను, ఈ దేశ నియమ‌ నిబంధ‌న‌ల‌ ను అనుస‌రించవలసినటువంటి క‌ర్త‌వ్యం మ‌నంద‌రి పైన ఉంది.

అలాగే, ఒక సమాజం గా, భార‌తదేశం లోని ప్రతి ఒక్కరం మన విధుల కు మరియు బాధ్య‌త‌ల‌ కు ప్రాధాన్య‌ాన్ని ఇచ్చుకొంటూ పనిచేయాలి.

మన మధ్య శాంతి, ఏకత, మైత్రి, సోదరీసోదర భావం, సద్భావన అనేవి నెల‌కొన‌డం దేశ ప్ర‌గ‌తి కి చాలా ముఖ్యం. 

భార‌తీయులు గా మ‌న‌ం ఏక‌తాటి పై ముందుకు సాగినప్పుడే, మ‌నం మన ఉద్దేశ్యాల ను మరియు లక్ష్యాల‌ ను సాధించకోగలుగుతాము.

జయ్ హింద్‌.

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'

Media Coverage

'India Delivers': UN Climate Chief Simon Stiell Hails India As A 'Solar Superpower'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 16ఫెబ్రవరి 2025
February 16, 2025

Appreciation for PM Modi’s Steps for Transformative Governance and Administrative Simplification