ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వియత్నాం లోని కువాన్ సూ పగోడా ను సందర్శించారు.
ఆయన అక్కడి పరమపవిత్ర స్థానంలో ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా భిక్షువులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
భిక్షువులతో సంభాషించిన ప్రధాన మంత్రి దేవాలయాన్ని సందర్శించినందుకు తాను ఎంతో అదృష్టవంతుడినన్నారు. భారతదేశ ప్రప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ పగోడా ను సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తుతెచ్చుకొన్నారు.
భారతదేశానికి, వియత్నాం కు మధ్య 2000 సంవత్సరాల క్రితం నుండి సంబంధాలు ఉన్నాయన్న ప్రధాన మంత్రి, కొంత మంది యుద్ధం చేయడానికి వచ్చారని, అయితే భారతదేశం శాంతి సందేశాన్ని, బుద్ధుని సందేశాన్ని తీసుకొని వచ్చిందని, అది ఈనాటికీ నిలచి ఉందన్నారు.
ప్రపంచం శాంతి మార్గంలో నడవాలని, అదే సంతోషాన్ని, సమృద్ధిని ప్రసాదిస్తుందని ఆయన అన్నారు. బౌద్ధం భారతదేశం నుండి సముద్ర మార్గం గుండా వియత్నాం కు వచ్చిందని, ఈ విధంగా బౌద్ధం యొక్క శుద్ధతమ స్వరూపాన్ని వియత్నాం పొందిందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశాన్ని సందర్శించిన భిక్షువుల ముఖాలలో ఒక వెలుగును, అలాగే భారతదేశానికి వెళ్లాలని కోరుకొనే వారి ముఖాలలో ఎంతో తెలుసుకోవాలనే ఆరాటాన్ని తాను చూసినట్లు ప్రధాన మంత్రి తెలిపారు.
బుద్ధుని భూమిని, మరీ ముఖ్యంగా వారణాసి ని సందర్శించవలసిందిగా భిక్షువులను ప్రధాన మంత్రి ఆహ్వానించారు. భారతదేశ పార్లమెంట్ లో వారణాసి నియోజకవర్గానికి శ్రీ మోదీ ప్రతినిధిగా ఉన్నారు.