ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016 సెప్టెంబరు 2వ తేదీ నుండి 2016 సెప్టెంబరు 3వ తేదీ వరకు వియత్ నామ్ ను సందర్శించనున్నారు. ప్రధాన మంత్రి 2016 సెప్టెంబరు 3వ తేదీ నుండి సెప్టెంబరు 5వ తేదీ వరకు చైనా లోని హాంగ్ ఝోవు లో జి-20 నాయకుల వార్షిక సమావేశానికి కూడా హాజరు కానున్నారు.
ప్రధాన మంత్రి తన ఫేస్ బుక్ అకౌంట్ లో వరుసగా నమోదు చేసిన పోస్టు లలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
“వియత్ నామ్ ప్రలకు వారి జాతీయ దిన శుభాకాంక్షలు. వియత్ నామ్ మాకు ఒక మిత్ర దేశం. ఆ దేశ వాసులతో మేము మా సంబంధాలను ఆదరంతో కాపాడుకొంటాము.
ఈ రోజు సాయంత్రం నేను వియత్ నామ్ లోని హనోయి కి చేరుకొంటాను. ఇది భారతదేశం, వియత్ నామ్ ల మధ్య సన్నిహిత సంబంధాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో ఒక ముఖ్యమైన సందర్శనకు నాంది పలుకుతుంది. వియత్ నామ్ తో మన ద్వైపాక్షిక సంబంధాలకు నా ప్రభుత్వం అత్యున్నత ప్రాముఖ్యాన్ని జతపరుస్తోంది. భారతదేశం-వియత్ నామ్ భాగస్వామ్యం ఆసియా తో పాటు ప్రపంచంలోని మిగతా దేశాలకూ ప్రయోజనం కలిగించేదే.
ఈ సందర్శనలో భాగంగా, నేను ప్రధాని శ్రీ గుయెన్ శువాన్ ఫుక్ తో విస్తృతమైన చర్చలలో పాల్గొంటాను. మేము మన ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్ర సమీక్ష ను చేపట్టనున్నాము.
నేను వియత్ నామ్ అధ్యక్షుడు శ్రీ త్రాన్ దాయీ కువాంగ్ ను, వియత్ నామ్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గుయెన్ ఫు త్రోంగ్ ను, ఇంకా వియత్ నామ్ నేషనల్ అసెంబ్లీ చైర్ పర్సన్ గుయెన్ థీ కిమ్ నగాన్ గారిని కూడా కలుసుకొంటాను.
మేము వియత్ నామ్ తో దృఢమైన ఆర్థిక బంధాన్ని ఏర్పరచుకోవాలని ఆశిస్తున్నాము. ఈ బంధం మన రెండు దేశాల పౌరులకు పరస్పర ప్రయోజనకారి అవ్వాలని కోరుకొంటున్నాము. ప్రజలకు, ప్రజలకు మధ్య సంబంధాలను పటిష్టపరచడం అనేది కూడా వియత్ నామ్ సందర్శనలో నా ప్రయత్నంగా ఉండబోతున్నది.
వియత్ నామ్ లో 20వ శతాబ్దపు అగ్ర నాయకులలో ఒకరైన శ్రీ హొ చి మిన్ కు నివాళి అర్పించే భాగ్యం నాకు దక్కనున్నది. నేను ద మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ హీరోస్ అండ్ మార్టర్స్ వద్ద పూల మాలను ఉంచి, కువాన్ సు పగోడా ను కూడా సందర్శించనున్నాను.
జి-20 నాయకుల వార్షిక సమావేశానికి హాజరు కావడం కోసం 2016 సెప్టెంబరు 3వ తేదీ నుండి సెప్టెంబరు 5వ తేదీల మధ్య చైనా లోని హాంగ్ ఝోవు నగరాన్ని సందర్శించనున్నాను. వియత్ నామ్ లో ముఖ్యమైన ద్వైపాక్షిక పర్యటనను ముగించుకొన్న తరువాత అక్కడి నుండి హాంగ్ ఝోవు కు చేరుకొంటాను.
జి-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా, అంతర్జాతీయంగా ప్రధానమైన అంశాలు మరియు సవాళ్లను గురించి ఇతర ప్రపంచ నాయకులతో సంభాషించే అవకాశం నాకు లభించనుంది. మేము ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరమైన వృద్ధితో కొనసాగేటట్లు గాడిలో పడేలా చేయడం తో పాటు వేళ్లూనుకొన్న, కొత్తగా తలెత్తే సామాజిక, భద్రతాపరమైన, ఆర్థికపరమైన సవాళ్లకు ప్రతిస్పందించడంపై చర్చిస్తాము.
మన ముందున్న అన్ని అంశాలపై నిర్మాణాత్మకమైన అంశాలను గురించి చర్చించి పరిష్కారమార్గాలను అన్వేషించడంలోను, ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన వారి సాంఘిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచే విధంగా ఒక బలమైన, సంఘటితమైన, కొనసాగగలిగే అంతర్జాతీయ ఆర్థిక క్రమ వ్యవస్థ కోసం చేపట్టవలసిన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంలోను భారతదేశం పాలుపంచుకొంటుంది.
శిఖరాగ్ర సమావేశం నిర్మాణాత్మకమైన, చక్కని ఫలితాలను చూపగలదని నేను ఎదురుచూస్తున్నాను” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
My Vietnam visit starting today will further cement the close bond between India & Vietnam. https://t.co/7ifSW5PUS5
— Narendra Modi (@narendramodi) September 2, 2016
Will be in Hangzhou, China for G20 Summit, where I will interact with world leaders on key global issues. https://t.co/QrhwmYwTRw
— Narendra Modi (@narendramodi) September 2, 2016