ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22వ మరియు 23వ తేదీలలో తన పార్లమెంటరీ నియోజకవర్గం వారాణసీ ని సందర్శించనున్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి పాలుపంచుకొనే కార్యక్రమాలలో మౌలిక సదుపాయాలు, రైల్వేలు, జౌళి, అందరికీ ఆర్థిక సేవలు, పర్యావరణం- పారిశుధ్యం, పశు సంవర్ధకం, సంస్కృతి మరియు ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విభిన్న కార్యక్రమాలు చోటు చేసుకోనున్నాయి.
బడా లాల్‌పుర్ లో హస్త కళల వర్తక సమన్వయ కేంద్రం ‘దీన్ దయాళ్ హస్తకళ సన్‌కుల్’ ను దేశ ప్రజలకు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. అక్కడ ఏర్పాటైన సదుపాయాలను ఆయన కొద్దిసేపు పరిశీలిస్తారు. ఒక వీడియో లింక్ ద్వారా ‘మహామనా ఎక్స్‌ప్రెస్’ రైలు ప్రారంభ సూచకంగా జెండాను ఊపుతారు. ఈ రైలు వారాణసీ ని గుజరాత్ లోని సూరత్ మరియు వడోదరా లతో కలుపుతుంది.
అదే సభా స్థలిలో నగరంలోని వేరు వేరు అభివృద్ధి పనులకు పునాది రాయి వేసే లేదా ఆయా పథకాలను ప్రజలకు అంకితమిచ్చేందుకు ఉద్దేశించిన కొన్ని శిలాఫలకాలను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. ఉత్కర్ష్ బ్యాంకు యొక్క బ్యాంకింగ్ సేవలను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆ బ్యాంకు ప్రధాన కేంద్ర నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన సూచకంగా ఒక ఫలకాన్ని కూడా ఆయన ఆవిష్కరిస్తారు. ఉత్కర్ష్ బ్యాంకు ప్రధానంగా సూక్ష్మ ఆర్థిక సేవలను అందిస్తోంది.
ప్రధాన మంత్రి మరొక వీడియో లింక్ ద్వారా జల్ అంబులెన్స్ సేవను, జల్ శవ వాహన సేవను వారాణసీ ప్రజలకు అంకితం చేస్తారు.
సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం పూట ప్రధాన మంత్రి వారాణసీ లోని చరిత్రాత్మక తులసీ మానస్ దేవాలయాన్ని సందర్శిస్తారు. ‘రామాయణం’ పై ఒక తపాలా బిళ్ళను ఆయన విడుదల చేస్తారు. నగరంలో దుర్గా మాత దేవాలయాన్ని ఆయన ఆ తరువాత సందర్శిస్తారు.
సెప్టెంబర్ 23వ తేదీ నాడు ప్రధాన మంత్రి శహన్‌శాహ్‌పుర్ గ్రామంలో పారిశుధ్య సంబంధిత కార్యక్రమంలో కాసేపు పాలుపంచుకొంటారు. తదనంతరం పశుధన్ ఆరోగ్య మేళాను ఆయన సందర్శిస్తారు. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ (గ్రామీణ మరియు పట్టణ) లబ్దిదారులకు సర్టిఫికెట్లను ప్రధాన మంత్రి ప్రదానం చేస్తారు; సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.