ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 14న తమిళ నాడు, కేరళ రాష్ట్రాల ను సందర్శించనున్నారు. పగటి పూట 11 గంటల 15 నిముషాల కు చెన్నై లో ప్రధాన మంత్రి అనేక కీలకమైన ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం/శంకు స్థాపన చేస్తారు. అర్జున్ ప్రధాన యుద్ధ ట్యాంకు (ఎమ్‌కె-1ఎ)ని సైన్యాని కి అప్పగిస్తారు. సాయంత్రం 3 గంటల 30 నిముషాల కు కొచ్చి లో వివిధ ప్రాజెక్టుల ను దేశానికి అంకితం చేయడంతో పాటు, కొన్ని పథకాల కు శంకు స్థాపన కూడా చేస్తారు. ఈ ప్రాజెక్టులు ఆయా రాష్ట్రాల వృద్ధి గతికి కీలకమైన వేగాన్ని జత పరచడమే కాకుండా, పూర్తి స్థాయి అభివృద్ధి సామర్ధ్యాన్ని సంతరించుకోవడానికి తోడ్పడుతాయి.
తమిళ నాడు లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి చెన్నై మెట్రో రైల్ ఒకటో దశ విస్తరణ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం 3770 కోట్ల రూపాయల వ్యయం తో పూర్తి అయింది. అలాగే, ప్రధాన మంత్రి వాషర్ మన్ పేట్ నుంచి విమ్‌కో నగర్ కు ప్రయాణికుల సేవల ను ప్రారంభిస్తారు. 9.05 కి.మీ పొడవైన ఈ విస్తరణ మార్గం ఉత్తర చెన్నై ని విమానాశ్రయం తోను, సెంట్రల్ రైల్వే స్టేషన్ తోను కలుపుతుంది.
ప్రధాన మంత్రి చెన్నై బీచ్ కు, అత్తిపట్టు కు మధ్య నాలుగో రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. 22.1 కి.మీ నిడివి ఉన్న ఈ సెక్షన్ ను 293.40 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మించడమైంది. ఇది చెన్నై నుంచి తిరువళ్ళూర్ జిల్లా లలో సాగుతూ చెన్నై పోర్ట్ నుంచి ట్రాఫిక్ సజావుగా సాగేటట్లు దోహదం చేస్తుంది. ఈ సెక్షన్ చెన్నై పోర్టును, ఎణ్ణూరు పోర్టును కలుపుతుంది. ఇది మార్గమధ్యం లో ప్రధానమైన యార్డుల గుండా వెళ్తూ, రైళ్ళ రాకపోకల సౌలభ్యాన్ని ప్రసాదిస్తుంది.
ప్రధాన మంత్రి విల్లుపురం-కడలూరు-మైలాదుతురై-తంజావూరు లతో పాటు, మైలాదుతురై-తిరువారూర్ లో సింగిల్ లైన్ సెక్షన్ తాలూకు రైల్వే విద్యుదీకరణ ను ప్రారంభిస్తారు. 423 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేసిన ఈ విద్యుదీకరణయుత మార్గం 228 కి.మీ మేర సాగుతూ చెన్నై, ఎగ్మూరు, కన్యాకుమారి మధ్య రాకపోకలకు మార్గం మారవలసిన అవసరం లేకుండా సాఫీగా ట్రాఫిక్ సాగిపోయేందుకు వీలును కల్పిస్తుంది. ఇది ఇంధనం ఖర్చు పద్దులో ఒక్కో రోజుకు 14.61 లక్షల రూపాయల ఆదాకు ఆస్కారాన్ని కల్పిస్తుంది.
ఇదే కార్యక్రమం లో భాగంగా ప్రధాన మంత్రి అత్యాధునికమైన అర్జున్ ప్రధాన యుద్ద ట్యాంకు (ఎమ్‌కె-1ఎ)ని భారతీయ సైన్యాని కి అప్పగించనున్నారు. ఈ యుద్ధ ట్యాంకు ను 15 విద్యా సంస్థలు, 8 ప్రయోగశాలలు, అనేక ఎమ్ఎస్ఎమ్ఇ లతో పాటు, సివిఆర్‌డిఇ, డిఆర్‌డిఒ లు పూర్తిగా దేశం లోనే రూపొందించి, మెరుగులు దిద్ది తయారు చేశాయి.
ప్రధాన మంత్రి గ్రాండ్ ఆనికట్ కెనాల్ సిస్టమ్ విస్తరణ, పునర్ నవీకరణ, ఆధునీకరణ లకు శంకు స్థాపన చేస్తారు. ఈ కాలవ డెల్టా జిల్లాల లో సేద్యపు నీటి పారుదల కు కీలకమైంది. ఈ కాలవ ను ఆధునీకరించడం కోసం 2,640 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. ఇది కాలవల నీటి చేరవేత సామర్ధ్యాన్ని మెరుగు పరచేందుకు తోడ్పడుతుంది.
ప్రధాన మంత్రి ఐఐటి మద్రాసు లో డిస్కవరీ కేంపస్ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఈ కేంపస్ ను ఒకటో దశలో 2 లక్షల చ.మీ విస్తీర్ణంలో 1000 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో చెన్నై సమీపం లోని తాయూర్ లో నిర్మించడం జరుగుతుంది.
ఈ సందర్భం లో తమిళ నాడు గవర్నరు, తమిళ నాడు ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు
కేరళ లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి బిపిసిఎల్ కు చెందిన ప్రొకిలీన్ డిరివేటివ్ పెట్రో కెమికల్ ప్రాజెక్టు (పిడిపిపి)ని దేశాని కి అంకితం చేయనున్నారు. ఈ కాంప్లెక్స్ అక్రిలేట్స్ ను, అక్రిలిక్ యాసిడ్ ను ఆక్సో-అల్కహాల్ ను ఉత్పత్తి చేస్తుంది. వీటిని ప్రస్తుతం చాలా వరకు దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్కో సంవత్సరానికి సుమారుగా 3700 కోట్లు మొదలుకొని 4000 కోట్ల రూపాయల వరకు ఆదా సాధ్యపడవచ్చని ఒక అంచనా ఉంది. సుమారు 6000 కోట్ల రూపాయల మూలధన వ్యయం తో నిర్మించిన పిడిపిపి కాంప్లెక్స్ ను రిఫైనరీకి దగ్గరగా ఏర్పాటు చేసినందువల్ల ఫీడ్ స్టాక్ సప్లయ్, యుటిలిటీలు, ఆఫ్-సైట్స్ తదితర సదుపాయాల ఏకీకరణ కు వీలు కలుగుతుంది. ఇది డౌన్ స్ట్రీమ్ సెక్టర్ కు భారీ వ్యయాల ను ఆదా చేసుకోవడం లో సహాయకారి అవుతుంది. దీని ద్వారా ఫీడ్ స్టాక్ సిద్ధంగా లభించడమే కాకుండా, సరఫరా వ్యవస్థ నిర్వహణ పరంగా అధిక వెసులుబాటు కలుగుతుంది. దీనిని ప్రారంభించడం తో కొచ్చి రిఫైనరీ భారతదేశం లో ప్రత్యేకమైన తరహాకు చెందిన పెట్రోకెమికల్స్ ను ఉత్పత్తి చేసే తొలి రిఫైనరీ గా మారింది.
ప్రధాన మంత్రి కొచ్చిన్ లోని విల్లింగ్‌డన్ ఐలాండ్స్ లో రో-రో వెస్సల్స్ ను కూడా దేశానికి అంకితం చేస్తారు. నేశనల్ వాటర్ వే - 3 లో బోల్‌గాటీ, విల్లింగ్‌డన్ ఐలాండ్ మధ్య రెండు కొత్త రోల్ ఆన్ /రోల్ ఆఫ్ వెస్సల్స్ ను ఇంటర్ నేశనల్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా నియోగిస్తుంది. ఎమ్.వి. ఆదిశంకర్, ఎమ్.వి సివి రామన్ పేరులు కలిగి ఉండే రో-రో వెస్సల్స్ ఒక్కొక్కటి 20 అడుగుల ట్రక్కులు ఆరింటిని, 20 అడుగులు కలిగివుండే ట్రయలర్ ట్రక్కులు మూడింటిని, 40 అడుగుల తో వుండే ట్రయలర్ ట్రక్కులు మూడిటిని, 30 మంది ప్రయాణికుల ను చేరవేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ సర్వీసు వ్యాపారాని కి మేలు చేస్తుంది. ఫలితంగా రవాణా ఖర్చు, ప్రయాణ కాలం తగ్గడం తో పాటు, కొచ్చి రోడ్ల లో రద్దీ సైతం తగ్గడానికి వీలు ఏర్పడుతుంది.
ప్రధాన మంత్రి కొచ్చిన్ పోర్టులో ‘‘సాగరిక’’పేరుతో ఉన్న అంతర్జాతీయ క్రూజ్ టర్మినల్ ను ప్రారంభించనున్నారు. ఎర్నాకుళం వార్ఫ్ లో నెలకొన్న ఈ టర్మినల్ భారతదేశం లోని మొట్టమొదటి పూర్తి స్థాయి అంతర్జాతీయ క్రూజ్ టర్మినల్. దీనిలో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. దీనిని 25.72 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది. ఇది పర్యటన రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, అభివృద్ధికి దన్నుగా నిలుస్తుంది. ఇది ఉద్యోగ కల్పనకు, ఆదాయం, విదేశీ మారగక ద్రవ్యం ఆర్జనకు ఒక ప్రభావవంతమైన సాధనంగా కూడా పని చేస్తుంది.
ప్రధాన మంత్రి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లోని విజ్ఞాన సాగర్ లో మరీన్ ఇంజినీరింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ను కూడా ప్రారంభించనున్నారు. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన సముద్ర సంబంధిత జ్ఞాన కేంద్రం గా ఉంటుంది. అంతేకాదు, ఇది ఒక షిప్ యార్డ్ పరిసరాల లో పనిచేసే ఒకే ఒక సముద్ర సంబంధిత సంస్థ గా కూడా ఉంటుంది. ఇక్కడ శిక్షణార్థుల కు వివిధ రకాల నౌకల లో శిక్షణ సదుపాయాల ను సమకూర్చడం జరుగుతుంది. 27.5 కోట్ల రూపాయల మూలధన వ్యయం తో నిర్మించిన ఈ ఇన్‌స్టిట్యూట్ లో 114 మంది పట్టభద్రులను చేర్చుకొనేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ప్రతిభావంతులైన మరీన్ ఇంజినీర్స్ ను తీర్చిదిద్ది భారతదేశం లోను, విదేశీల లోను మేరిటైమ్ ఇండస్ట్రీ తాలూకు అవసరాల ను తీర్చడం లో తోడ్పడుతుంది.
ప్రధాన మంత్రి కొచ్చిన్ పోర్టు లో సౌత్ కోల్ బెర్త్ పునర్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారు. దీనిని ‘సాగర్ మాల’ పథకం లో భాగంగా 19.19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పునర్ నిర్మించడం జరుగుతుంది. ఇది పూర్తి అయిన తరువాత కొచ్చిన్ పోర్టులో కెమికల్ హ్యాండ్లింగ్ కు అచ్చంగా ఉపయోగించగలిగిన బెర్తు సదుపాయం అందుబాటులోకి రాగలదు. ఈ బెర్తును పునర్ నిర్మించిన తరువాత సరకుల రవాణాను ప్రభావవంతమైన విధంగా వేగంగా నిర్వహించడానికి, అలాగే లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించుకోవడానికి వీలు కలుగుతుంది.
ఈ సందర్భం లో కేరళ గవర్నరు, కేరళ ముఖ్యమంత్రి లతో పాటు, పెట్రోలియమ్, సహజవాయువు శాఖ కేంద్ర మంత్రి కూడా పాల్గొంటారు.