ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిబ్రవరి 18వ,19వ తేదీలలో మహారాష్ట్రలో మరియు కర్నాటక లో పర్యటించనున్నారు.
ప్రధాన మంత్రి ఫిబ్రవరి 18 వ తేదీ నాడు మధ్యాహ్నానికల్లా ముంబయి కి చేరుకొంటారు. ఆయన నవీ ముంబయిలో ఒక కార్యక్రమానికి హాజరవుతారు. అదే నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు శంకు స్థాపన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగానే, జెఎన్ పిటి లోని నాలుగో కంటేనర్ టర్మినల్ ను ప్రధాన మంత్రి దేశ ప్రజలకు అంకితం చేస్తారు.
‘‘మేగ్నెటిక్ మహారాష్ట్ర: కన్వర్జెన్స్ 2018’’ పేరుతో ఏర్పాటయ్యే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు. ప్రధాన మంత్రి యూనివర్సిటీ ఆఫ్ ముంబయి లో వాధ్ వానీ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిశియల్ ఇంటెలిజెన్స్ ను ప్రారంభిస్తారు.
అనంతరం ప్రధాన మంత్రి కర్నాటక లోని మైసూరుకు బయలుదేరి వెళ్తారు. ఫిబ్రవరి 19వ తేదీ నాడు ప్రధాన మంత్రి హైదరాబాద్‌లో జరుగుతున్న వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు.
ఆయన బాహుబలి మహామస్తకాభిషేక మహోత్సవంలో పాలుపంచుకోవడం కోసం శ్రావణబెళగోళ కు చేరుకొంటారు. మైసూరు రైల్వే స్టేషన్‌లో జరిగే ఒక కార్యక్రమంలో, మైసూరు- బెంగళూరు మధ్య విద్యుదీకరించిన రైల్వే లైన్ ను దేశ ప్రజలకు ప్రధాన మంత్రి అంకితం చేస్తారు. మైసూరు, ఉదయ్‌పుర్ ల మధ్య రాకపోకలు జరిపే ప్యాలెస్ క్వీన్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ కు జెండా ను చూపించి ఆ రైలును ఆయన ప్రారంభిస్తారు. మైసూరులో ఓ జన సభలో సైతం ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.