ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 డిసెంబర్ 11వ తేదీన మహారాష్ట్ర, గోవాల్లో పర్యటించనున్నారు.
ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి నాగపూర్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. 10 గంటల సమయంలో ప్రధానమంత్రి ఫ్రీడమ్ పార్క్ మెట్రో స్టేషన్ నుంచి ఖప్రి మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించి అక్కడ “నాగపూర్ మెట్రో తొలి దశ” ను జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆయన “నాగపూర్ మెట్రో రెండో దశ” కు కూడా శంకుస్థాపన చేస్తారు. 10.45 గంటలకు ప్రధానమంత్రి నాగపూర్-షిర్డీలను అనుసంధానం చేసే సమృద్ధి మహామార్గ్ తొలి దశను ప్రారంభించి హైవేపై ప్రయాణిస్తారు. 11.15 గంటలకు నాగపూర్ ఎయిమ్స్ ను జాతికి అంకితం చేస్తారు.
11.30కి జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి రూ.1500 కోట్లు పైగా విలువ గల రైలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, కొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్ (ఎన్ఐఓ); నాగ్ నది కాలుష్య నియంత్రణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇదే కార్యక్రమంలో భాగంగా “సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (సిపెడ్)”, చంద్రాపూర్ ను జాతికి అంకితం చేయడంతో పాటు “సెంటర్ ఫర్ రీసెర్చ్, మేనేజ్ మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హెమోగ్లోబినాపతీస్”, చంద్రాపూర్ ను ప్రారంభిస్తారు.
గోవాలో మధ్యాహ్నం 3.15 సమయంలో 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ముగింపు సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడు జాతీయ ఆయుష్ ఇన్ స్టిట్యూట్లను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.15 సమయంలో మోపా ఇంటర్నేషనల్ విమానాశ్రయం, గోవాను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
నాగపూర్ సమృద్ధి మహామార్గ్ వద్ద ప్రధానమంత్రి
నాగపూర్-షిర్డీలను అనుసంధానం చేసే 520 కిలోమీటర్ల నిడివి గల సమృద్ధి మహామార్గ్ తొలి దశను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.
దేశంలో మెరుగైన కనెక్టివిటీ, మౌలిక వసతులు అందించాలన్న ప్రధానమంత్రి విజన్ సాకారం చేయడంలో పెద్ద అడుగు సమృద్ధి మహామార్గ్ లేదా నాగపూర్-ముంబై సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు. రూ.55,000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 701 కిలోమీటర్ల నిడివి గల ఈ ఎక్స్ ప్రెస్ వే దేశంలో పొడవైన ఎక్స్ ప్రెస్ వేలలో ఒకటి. మహారాష్ట్రలోని 10 జిల్లాలు; అమరావతి, ఔరంగాబాద్, నాసిక్ వంటి ప్రముఖ నగర ప్రాంతాల మీదుగా ఈ ఎక్స్ ప్రెస్ వే సాగుతుంది. సమీపంలోని మరో 14 జిల్లాలకు కూడా ఈ ఎక్స్ ప్రెస్ వే కనెక్టివిటీని పెంచడంతో పాటు విదర్భ, మరఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ప్రాంతాలు సహా 24 జిల్లాల అభివృద్ధికి సహాయకారి అవుతుంది.
పిఎం గతిశక్తి పథకం కింద మౌలిక వసతుల ప్రాజెక్టుల సమగ్ర ప్రణాళిక, సమన్వయం అవసరమన్న ప్రధానమంత్రి విజన్ కు దీటుగా ఢిల్లీ-ముంబై ఎక్స్ ప్రెస్ వే, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, అజంతా-ఎల్లోరా గుహలు, షిర్డీ, వెరుల్, లోనార్ వంటి పర్యాటక కేంద్రాలను ఈ సమృద్ధి మహామార్గ్ అనుసంధానం చేస్తుంది. మహారాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ఉత్తేజితం చేయడంలో సమృద్ధి మహామార్గ్ ఒక ప్రధానశక్తిగా నిలుస్తుంది.
నాగపూర్ మెట్రో
పట్టణ రవాణా విప్లవాత్మకంగా మెరుగుపరచడంలో మరో పెద్ద అడుగు నాగపూర్ మెట్రో తొలి దశను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఖప్రి నుంచి ఆటోమోటివ్ స్క్వేర్ (ఆరంజ్ లైన్), ప్రజాపతినగర్ నుంచి లోకమాన్య నగర్ (ఆక్వా లైన్) మధ్య రెండు మెట్రో సర్వీసులను కూడా ఖప్రి మెట్రో స్టేషన్ వద్ద ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. నాగపూర్ మెట్రో తొలి దశను రూ.8650 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేశారు. నాగపూర్ మెట్రో రెండో దశకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.6700 కోట్ల పెట్టుబడితో దాన్ని అభివృద్ధి చేయనున్నారు.
ఎయిమ్స్ నాగపూర్
నాగపూర్ లోని ఎయిమ్స్ ను జాతికి అంకితం చేయడం ద్వారా దేశంలో ఆరోగ్య మౌలిక వసతులు బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి కట్టుబాటు మరింత సుదృఢం అవుతుంది. 2017లో ప్రధానమంత్రి స్వయంగా ఈ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి స్వాస్త్య సురక్ష యోజన కింద ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు.
రూ.1575 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఎయిమ్స్ నాగపూర్ లో ఒపిడి, ఐపిడి, డయాగ్నస్టిక్ సర్వీసులు, ఆపరేషన్ థియేటర్లు, వైద్య శాస్త్రంలోని అన్ని ప్రధాన స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలతో 18 డిపార్ట్ మెంట్లు సహా ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి ఈ ఆస్పత్రి ఆధునిక వైద్య వసతులు అందిస్తుంది. సమీపంలోని గడ్చిరోలి, గోండియా, మెల్ఘాట్ వంటి గిరిజన ప్రాంతాలకు కూడా అది వరంగా నిలుస్తుంది.
రైల్ ప్రాజెక్టులు
నాగపూర్ రైల్వే స్టేషన్ లో ప్రధానమంత్రి నాగపూర్-బిలాస్ పూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తారు.
నాగపూర్ లో జరిగే బహిరంరగ సభలో నాగపూర్ రైల్వే స్టేషన్, అజ్ని రైల్వే స్టేషన్ రీ డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ రెండు ప్రాజెక్టులు రూ.590 కోట్లు, రూ.360 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. అలాగే అజ్నిలో (నాగపూర్) నెలకొల్పిన ప్రభుత్వ మెయింటెనెన్స్ డిపో, నాగపూర్-ఇటార్సి మూడో లైన్ ప్రాజెక్టులో కోహ్లి-నర్ఖేర్ సెక్షన్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఈ రెండు ప్రాజెక్టులను రూ.110 కోట్లు, రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించారు.
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్, నాగపూర్
దేశంలో “వన్ హెల్త్” విధానం కింద సామర్థ్యాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన చేయాలన్న ప్రధానమంత్రి కట్టుబాటుకు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వన్ హెల్త్, నాగపూర్ నకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం నిదర్శనం. మానవాళి ఆరోగ్యం జంతువుల ఆరోగ్యం, పర్యావరణంతో అనుసంధానమై ఉంటుందన్నదే “వన్ హెల్త్” అనుసరించే వైఖరి. ప్రకృతిలో మానవులకు పలు వ్యాధులు జంతువుల నుంచే సంక్రమిస్తాయన్నది ఈ విధానం సిద్ధాంతం. రూ.110 కోట్ల పైబడిన వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఇన్ స్టిట్యూట్ సంబంధిత భాగస్వాములందరితోనూ సమన్వయపూర్వకంగా వ్యవహరిస్తూ సహాయ సహకారాలు అందుకుంటుంది. దేశవ్యాప్తంగా “వన్ హెల్త్” విభాగంలో పరిశోధన, సామర్థ్యాల నిర్మాణాన్ని మెరుగుపరచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
ఇతర ప్రాజెక్టులు
నాగపూర్‌లో నాగ్ నది కాలుష్య నియంత్రణ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. జాతీయ నదుల సంరక్షణ ప్రణాళిక (ఎన్ఆర్ సిపి) కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.1925 కోట్లు.
విదర్భ ప్రాంతంలో ప్రత్యేకించి గిరిజన జనాభాలో సికిల్ సెల్ వ్యాధి ప్రబలంగా ఉంది. తలసేమియా, హెచ్‌బిఇ వంటి హేమోగ్లోబినోపతీస్ సహా సికిల్ సెల్ వ్యాధి దేశంపై వ్యాధుల భారాన్ని పెంచుతోంది. ఈ సమస్యను పరిష్కరిండం లక్ష్యంగా “సెంటర్ ఫర్ రీసెర్చ్, మేనేజ్ మెంట్ అండ్ కంట్రోల్ ఆఫ్ హేమోగ్లోబినోపతీస్, చంద్రాపూర్”కు ప్రధానమంత్రి 2019ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆ సెంటర్ ను జాతికి అంకితం చేస్తారు. దేశంలో హేమినోగ్లోబినోపతీస్ విభాగంలో ఇన్నోవేటివ్ పరిశోధన, టెక్నాలజీ అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధికి ఇది ఒక సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ గా ఉపయోగపడాలని కూడా భావిస్తున్నారు.
అలాగే ప్రధానమంత్రి సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, చంద్రాపూర్ ను (సిపెట్) కూడా జాతికి అంకితం చేస్తారు. పాలిమర్, అనుబంధ పరిశ్రమల్లో నిపుణులైన మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తుంది.
గోవాలో ప్రధానమంత్రి
మోపా అంతర్జాతీయ విమానాశ్రయం, గోవా
దేశవ్యాప్తంగా ప్రపంచశ్రేణి మౌలిక వసతులు, రవాణా వసతులు కల్పించడం ప్రధానమంత్రి నిరంతర ప్రయత్నం. ఈ ప్రయత్నంలోనే మరో అడుగుగా గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. 2016 నవంబర్ లో స్వయంగా ప్రధానమంత్రే ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.
రూ.2870 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయాన్ని సుస్థిర మౌలిక వసతులు థీమ్ తో నిర్మించారు. ఇందులో సోలార్ పవర్ ప్లాంట్, హరిత భవనాలు, రన్ వేపై ఎల్ఇడి లైట్లు, వాన నీటి సంరక్షణ వ్యవస్థ, రీసైక్లింగ్ సదుపాయాలతో అత్యాధునిక మురుగునీటి శుద్ధి ప్లాంట్ వంటి సదుపాయాలెన్నో ఉన్నాయి. 3-డి మోనోలిథిక్ ప్రీ కాస్ట్ భవనాలు, స్టెబిల్ రోడ్, రోమోమాటిక్ హాలో ప్రీకాస్ట్ గోడలు, 5జికి అనువైన ఐటి మౌలిక వసతులు వంటి అత్యాధునిక వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాన్ని కూడా హాండ్లింగ్ చేయగల రన్ వే, విమానాలు రాత్రి వేళ పార్కింగ్ చేయడానికి అవసరమైన సదుపాయాలు గల 14 పార్కింగ్ బేలు, సెల్ఫ్ బ్యాగేజి డ్రాప్ సదుపాయాలు, అత్యాధునిక మరియు స్వతంత్ర ఎయిర్ నావిగేషన్ మౌలికవసతులు కూడా ఉన్నాయి.
తొలి దశ విమానాశ్రయం ఏడాదికి 4.4 మిలియన్ ప్రయాణికులు రాకపోకలు సాగించగల సామర్థ్యం దీనికి ఉంది. తదుపరి దశలో ప్రయాణికుల సంఖ్యను 33 ఎంపిపిఏ వరకు విస్తరించుకోవచ్చు. ఈ విమానాశ్రయం రాష్ట్ర సామాజిక-ఆర్థికాభివృద్ధికి, టూరిజం పరిశ్రమ అవసరాలకు సహాయపడుతుంది. కీలక లాజిస్టిక్స్ హబ్ గాను; దేశీయ, అంతర్జాతీయ గమ్యాలకు విమాన సర్వీసులను నేరుగా అనుసంధానం చేయగల సామర్థ్యం దీనికి ఉంది. బహుళ కనెక్టివిటీ కల్పించే రీతిలో దీన్ని ప్లాన్ చేశారు.
ప్రపంచ శ్రేణి విమానాశ్రయం కావడంతో పాటు గోవా విమానాశ్రయం సందర్శకులకు కొత్త అనుభూతిని, అనుభవాన్ని అందిస్తుంది. గోవాలోనే తయారయ్యే అజులేజోస్ టైల్స్ ను ఇక్కడ వినియోగించారు. ఫుడ్ కోర్ట్ కూడా గోవా కేఫ్ కే ప్రత్యేకమైన రుచులను అందిస్తుంది. స్థానిక కళాకారులు, హస్త కళాకారులు తమ వస్తువులను ప్రదర్శించుకుని మార్కెట్ చేసుకునేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.
9 వ ప్రపంచ ఆయుర్వేదిక్ కాంగ్రెస్. జాతీయ ఆయుష్ ఇన్ స్టిట్యూట్స్
ప్రధానమంత్రి గోవా పర్యటనలో భాగంగా మూడు ఆయుష్ ఇన్స్ స్టిట్యూట్లు ప్రారంభించడంతో పాటు 9వ ప్రపంచ ఆయుర్వేదిక్ కాంగ్రెస్ ముగింపు కార్యకమంలో కూడా పాల్గొంటారు. మూడు ఇన్ స్టిట్యూట్లలో అల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ) గోవా; నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్ (ఎన్ఐయుఎం), ఘజియాబాద్; నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి (ఎన్ఐహెచ్), ఢిల్లీ ఉన్నాయి. ఇవి ఆయా విభాగాల్లో పరిశోధన, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు సరసమైన ధరల్లో ఆయుష్ సేవలు అందుబాటులో ఉంచుతాయి. రూ.970 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ మూడు సంస్థలు 400 మంది విద్యార్థులకు సీట్లు ఇవ్వడంతో పాటు అదనంగా 500 బెడ్లు కుడా అందుబాటులో ఉంచుతాయి.
ఈ 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ (డబ్ల్యూఎసి), ఆయోగ్య ఎక్స్ పోలో 50 దేశాలకు చెందిన 400 మందికి చెందిన ప్రతినిధులతో పాటు అంతర్జాతీయ విద్యార్థులు, ఆయుర్వేద రంగ భాగస్వాములు పాల్గొంటున్నారు. “ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్” ఈ 9 వ డబ్ల్యూఎసి థీమ్.