ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 జనవరి 27న తమిళనాడులోని మదురై నగరంలో పర్యటిస్తారు. మదురైతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలకు కొత్త ఉత్తేజమిచ్చే దిశగా సాగనున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో భాగంగా మదురైలో అఖిలభారత వైద్యవిజ్ఞానశాస్త్ర సంస్థ (AIIMS) నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు అదే రోజున మదురైలోని రాజాజీ వైద్య కళాశాల, తంజావూరు వైద్య కళాశాల, తిరునల్వేలి వైద్య కళాశాలల స్థాయిపెంపు ప్రాజెక్టుల కింద కొత్త సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.
ఎయిమ్స్, మదురై
మదురైలో ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపనలో భాగంగా ప్రధానమంత్రి అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన 17.12.2018న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి- మదురై నగర పరిధిలోని తోపూర్లో ఎయిమ్స్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్ ప్రతిపాదనల సమర్పణ సందర్భంగా తమిళనాడులో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రూ.1264 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే నిర్మాణం, కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలన్నిటినీ కేంద్రమే నిర్వర్తిస్తుంది. దీన్ని 45 నెలల్లో- అంటే… 2022 సెప్టెంబరుకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.మొత్తం 750 పడకలతో మదురై ఎయిమ్స్ ఏర్పాటు కానుండగా అందులో 30 పడకలను అత్యవసర/ప్రమాద కేసులకు కేటాయిస్తారు. అలాగే ఐసీయూ-సంక్లిష్ట సంరక్షణ యూనిట్లో 75, సూపర్ స్పెషాలిటీలో 215, శస్త్ర/సాధారణ చికిత్స యూనిట్లుసహా స్పెషాలిటీ విభాగంలో 285 వంతున పడకలుంటాయి. వీటితోపాటు ఆయుష్, ప్రైవేట్ వార్డుల పరిధిలో 30 వంతున పడకలుంటాయి. వీటికి అదనంగా పరిపాలన భవనం, ఆడిటోరియం, రాత్రి బస, అతిథి గృహం, హాస్టళ్లు, నివాస సదుపాయాలు కూడా ఉంటాయి. వైద్యశాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు, ఉన్నత విద్య-పరిశోధనలపై దీర్ఘకాలిక దృష్టితో మదురై ఎయిమ్స్ ఏర్పాటవుతోంది. ఇక్కడ 100 ఎంబీబీఎస్, 60 బీఎస్సీ (నర్సింగ్) సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.
ఎయిమ్స్ ఏర్పాటుద్వారా ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, ఆరోగ్య విద్య-శిక్షణ తదితరాలు గణనీయ స్థాయిలో కొత్తరూపు సంతరించుకుంటాయి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ నిపుణుల కొరత సమస్యకూ పరిష్కారం లభిస్తుంది. కొత్త ఎయిమ్స్ ఏర్పాటువల్ల ఇక్కడి జనాభాకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి రావడమేగాక వైద్యులు, ఇతర ఆరోగ్యసేవా కార్యకర్తల సంఖ్య ఇనుమడిస్తుంది. జాతీయ ఆరోగ్య కార్యక్రమం (NHM)కింద కల్పించబోయే ప్రాథమిక, ద్వితీయ స్థాయి వైద్య సంస్థలు/సదుపాయాలలో సిబ్బంది నియామకానికి వీరు అందుబాటులో ఉంటారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాయిపెంపు ప్రాజెక్టులు
ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాయిపెంపు ప్రాజెక్టులలో భాగంగా మదురైలోని రాజాజీ వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ సహా తంజావూరు వైద్య కళాశాల, తిరునల్వేలి వైద్య కళాశాలల్లోనూ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లను శిలాఫలకాల ఆవిష్కరణద్వారా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ మూడు కళాశాలల్లో ఒక్కొక్క స్థాయిపెంపు ప్రాజెక్టుకు రూ.150 కోట్ల వంతున రూ.450 కోట్లు వ్యయంకాగా, కేంద్రం తన వాటాకింద రూ.125 కోట్ల వంతున, రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల వంతున సమకూర్చాయి.
రాజాజీ వైద్య కళాశాల, మదురై ప్రాజెక్టులో భాగంగా 320 (ఐసీయూలో 50సహా) పడకల సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఏర్పాటైంది. ఇందులో 7 విభాగాలు… న్యూరోసర్జరీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, మైక్రో వాస్కులర్-మెడికల్ అండ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఉన్నాయి.
తంజావూరు వైద్య కళాశాల, తంజావూరు ప్రాజెక్టులో భాగంగా 290 (ఐసీయూలో 90సహా) పడకల సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఏర్పాటైంది. ఇక్కడ 10 విభాగాలు… కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ (CTVS), న్యూరాలజీ, న్యూరోసర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, వాస్కులర్ సర్జరీసహా 5 ఆపరేషన్ థియేటర్లున్నాయి.
తిరునల్వేలి వైద్య కళాశాల, తిరునల్వేలి ప్రాజెక్టులో భాగంగా 330 (ఐసీయూలో 50సహా) పడకల సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఏర్పాటైంది. ఇక్కడ 8 విభాగాలు…కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ (CTVS), న్యూరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీసహా 7 ఆపరేషన్ థియేటర్లున్నాయి.
ఈ ప్రాజెక్టులన్నీ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజనలో భాగంగా ఉన్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా 20 ఎయిమ్స్ ఏర్పాటు లక్షం కాగా, ఇందులో ఇప్పటికే ఆరు పూర్తయ్యాయి. అలాగే దేశంలోని 73 వైద్య కళాశాలల స్థాయి పెంచాలన్నది కూడా ఈ పథకం లక్ష్యాల్లో ఒకటి. తమిళనాడులోని మూడు వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ బ్లాకుల నిర్మాణం, కొత్త ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపనలే ఆరోగ్య భారతం సాధనకు కేంద్ర ప్రభుత్వ కట్టుబాటును ప్రతిబింబిస్తున్నాయి. అలాగే మదురైసహా పరిసర ప్రాంతాల ప్రజల వైద్య, ఆరోగ్యసంరక్షణ అవసరాలను తీర్చడంలో ఇవి ప్రధాన పాత్ర పోషించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.