ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 12వ తేదీన హర్యానా లోని కురుక్షేత్రం సందర్శిస్తున్నారు. ఆయన స్వచ్ఛశక్తి-2019 కార్యక్రమంలో పాల్గొంటారు. హర్యానాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు.
స్వచ్ఛ శక్తి-2019
ప్రధాన మంత్రి స్వచ్ఛ శక్తి-2019 కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ శక్తి-2019 అవార్డులు బహూకరిస్తారు. కురుక్షేత్రలో స్వచ్ఛ సుందర్ శౌచాలయ ప్రదర్శనను సందర్శించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
దేశవ్యాప్తంగా మహిళా పంచులు, సర్పంచులు పాల్గొనే జాతీయ స్థాయి కార్యక్రమం స్వచ్ఛశక్తి-2019. ఈ ఏడాది స్వచ్ఛ శక్తి కార్యక్రమంలో దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన 15 వేల మంది వరకు మహిళలు పాల్గొంటారని భావిస్తున్నారు. మహిళా సాధికారత ఈ కార్యక్రమం లక్ష్యం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్వచ్ఛ శక్తి తొలి ప్రదర్శన, సమావేశాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ శక్తి -2018 ఉత్తర ప్రదేశ్ లక్నోలో జరిగింది. కురుక్షేత్రలో జరుగుతున్నది మహిళా సాధికారతకు చేపట్టిన మూడో సమావేశం.
అభివృద్ధి ప్రాజెక్టులు:
భద్సా, జజ్జర్ లో జాతీయ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ జాతికి అంకితం
జజ్జర్ లోని ఎయిమ్స్ ప్రాంగణంలో అత్యాధునిక సదుపాయాలతో కేన్సర్ మూడోదశ పరీక్ష, పరిశోధన సంస్థను నిర్మించారు. 700 పడకల ఆస్పత్రిలో సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, అనస్తీషియా, పాలియాటివ్ కేర్, న్యూక్లియర్ మెడిసిన్ వంటి సదుపాయాలున్నాయి. డాక్టర్లు, కేన్సర్ వ్యాధిగ్రస్తులకు సహాయంగా వచ్చిన వారి కోసం హాస్టల్ గదులు కూడా ఉన్నాయి. దేశంలోని కేన్సర్ సంబంధిత కార్యకలాపాలన్నింటికీ ఇది కేంద్రస్థానంగా పని చేస్తుంది. ఈ ఎన్ సిఐ ప్రాంతీయ కేన్సర్ సెంటర్లు, ఇతర కేన్సర్ సంస్థలతో అనుసంధానం కలిగి ఉంటుంది. జజ్జర్ లోని ఈ ఎన్ సిఐ జాతీయ స్థాయిలో ప్రధాన సంస్థ కావడం వల్ల మౌలిక పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యతా రంగాలను గుర్తించి మాలిక్యులార్ బయాలజీ, జెనోమిక్స్, ప్రోటియోమిక్స్, కేన్సర్ ఎపిడెమియాలజీ,రేడియేషన్ బయాలజీ, కేన్సర్ వ్యాక్సిన్లు వంటి భిన్న అంశాలపై అప్లైడ్ రీసెర్చ్ కూడా నిర్వహిస్తారు.
ఫరీదాబాద్ లో ఇఎస్ఐసి మెడికల్ కాలేజి, హాస్పిటల్ ప్రారంభం
ఉత్తర భారతదేశంలో మొదటి ఇఎస్ఐసి వైద్యకళాశాల, ఆస్పత్రి ఇది. 510 పడకల ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇఎస్ఐసి బీమాదారులు, వారి లబ్ధిదారులకు ప్రత్యేకించి కార్మిక జనాభా, వారిపై ఆధారపడిన వారికి సామాజిక భద్రతను అందిస్తుంది.
పంచకులలో జాతీయ ఆయుర్వేద ఇన్ స్టిట్యూట్ కు శంకుస్థాపన
పంచకులలోని శ్రీ మాతా మానసాదేవి దేవాలయ సముదాయంలో జాతీయ ఆయుర్వేద ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆయుర్వేద చికిత్స, విద్య, పరిశోధనకు ఇది జాతీయ స్థాయి సంస్థగా ఉంటుంది. ఇది పూర్తయితే హర్యానా, సమీప ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
కురుక్షేత్రలో శ్రీకృష్ణా ఆయుష్ విశ్వవిద్యాలయం శంకుస్థాపన
ఇది భారతీయ వైద్యవిధానాల అధ్యయనం కోసం హర్యానాలోనే కాకుండా దేశంలోనే ఏర్పాటవుతున్నమొదటి విశ్వవిద్యాలయం.
పానిపట్ లో పాటిపట్టు యుద్ధాల మ్యూజియంకు శంకుస్థాపన
పానిపట్టు యుద్ధంలో వీరోచితంగా పోరాడిన వారందరినీ గౌరవించుకునేందుకు ఏర్పాటవుతున్నమ్యూజియం ఇది. జాతి నిర్మాణానికి విశిష్ట సేవలందించి ఎలాంటి గుర్తింపునకు నోచుకోని వారందరినీ గౌరవించాలన్న కేంద్రప్రభుత్వ చొరవకు అనుగుణంగానే ఈ మ్యూజియం నెలకొల్పుతున్నారు.
కర్నాల్ లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన
విద్య, ఆరోగ్యం, సాంస్కృతిక సదుపాయాలకు ఉత్తేజం కల్పించడం లక్ష్యంగా ప్రధానమంత్రి కర్నాల్ లో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆరోగ్య శాస్ర్తాల విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు.