ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము & కశ్మీర్ లో 2018 మే 19వ తేదీ నాడు పర్యటించనున్నారు.
లే లో కుశోక్ బకుల రిన్‌పోచె యొక్క 19 వ జన్మ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రధాన మంత్రి హాజరవుతారు. అదే కార్యక్రమంలో, జోజిలా సొరంగ మార్గం నిర్మాణ పనుల ప్రారంభ సూచకంగా ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు.
14 కిలో మీటర్ల పొడవైన జోజిలా సొరంగం భారతదేశంలో కెల్లా అతి పొడవైన రహదారి సొరంగ మార్గం. అంతేకాదు, ఆసియా లో కెల్లా సుదీర్ఘమైనటువంటి రెండు దోవల సొరంగ మార్గం కూడాను. ఎన్‌హెచ్-1ఎ యొక్క శ్రీ నగర్ – లే సెక్షన్ లో గల బల్‌టాల్ మరియు మీనామార్గ్ ల మధ్య ఈ సొరంగాన్ని మొత్తం 6800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం, నిర్వహించడం ఇంకా మరమ్మతులు చేయడానికి సంబంధించి ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఈ సంవత్సరం మొదట్లోనే ఆమోదం తెలిపింది. శ్రీ నగర్, కార్గిల్ మరియు లే ల మధ్య అన్ని రకాల వాతావరణ పరిస్థితులలోనూ సంధానాన్ని ఈ సొరంగ మార్గ నిర్మాణం సమకూర్చగలుగుతుంది. ఇది జోజిలా కనుమ దారి ని దాటి పోయేందుకు ప్రస్తుతం పడుతున్న మూడున్నర గంటల వ్యవధి ని కేవలం 15 నిమిషాలకు తగ్గించనుంది. ఇది ఈ ప్రాంతాల సర్వతోముఖ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ఏకీకరణ కు బాటను పరచగలుగుతుంది. దీనికి వ్యూహాత్మకంగా గొప్ప ప్రాముఖ్యం కూడా ఉంది.
శ్రీ నగర్ లోని శేర్-ఎ- కశ్మీర్ ఇంటర్‌నేశనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కెఐసిసి) లో 330 ఎమ్‌డబ్ల్యు సామర్ధ్యంతో కూడిన కిశన్ గంగ జల విద్యుత్తు కేంద్రాన్ని దేశ ప్రజలకు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. శ్రీ నగర్ రింగు రోడ్డు కు పునాది రాయి ని కూడా ఆయన వేయనున్నారు.
పాకుల్ డూల్ పవర్ ప్రోజెక్టు కు మరియు జమ్ము రింగు రోడ్డుకు ప్రధాన మంత్రి జమ్ము లోని జనరల్ జోరావర్ సింగ్ ఆడిటోరియమ్ లో శంకు స్థాపన చేస్తారు. ఆయన తారాకోట్ మార్గ్ ను మరియు శ్రీ మాతా వైష్ణో దేవి శ్రైన్ బోర్డు కు చెందిన మెటీరియల్ రోప్ వే ను కూడా ప్రారంభిస్తారు. ఈ దైవ మందిరాన్ని సందర్శించే యాత్రికులకు తారాకోట్ మార్గం సహాయకారిగా ఉండగలదు.
శ్రీ నగర్ ఇంకా జమ్ము రింగు రోడ్డు లు ఆయా నగరాలలో వాహనాల రాకపోకల రద్దీని తగ్గించడానికి లక్షించినవి. అంతేకాదు, రహదారి మార్గ ప్రయాణాన్ని ఈ రింగ్ రోడ్డులు సురక్షితంగా, వేగవంతంగా, మరింత సౌకర్యవంతంగా, ఇంకా పర్యావరణ పరంగా అనుకూలమైందిగా కూడా మార్చగలుగుతాయి కూడాను.
జమ్ము లోని శేర్-ఎ- కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ & టెక్నాలజీ స్నాతకోత్సవానికి కూడా ప్రధాన మంత్రి హాజరు కానున్నారు.