ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు గువాహాటీ, ఈటానగర్ మరియు అగర్తలా లను సందర్శించనున్నారు. ఆయన ఈటానగర్ లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కు, సిలా సొరంగాని కి మరియు నార్త్ ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ కు శంకుస్థాపన చేస్తారు. ఆయన డిడి అరుణ్ ప్రభ ఛానల్ ను మరియు గార్జీ – బెలోనియా రైలు మార్గాన్ని ప్రారంభిస్తారు. అంతేకాకుండా, మూడు రాష్ట్రాల లో అనేక ఇతర అభివృద్ధి పథకాల ను కూడా దేశ ప్రజల కు అంకితం చేస్తారు.
అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి రేపు ఉదయం గువాహాటీ నుండి ఈటానగర్ కు చేరుకొంటారు. ఆయన ఈటానగర్ లోని ఐజి పార్కు లో పలు అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు.
హోలోంగీ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మాణాని కి ప్రధాన మంత్రి శంకు స్థాపన చేస్తారు. ప్రస్తుతం ఈటానగర్ కు అత్యంత దగ్గర గా ఉన్న విమానాశ్రయం 80 కిలో మీటర్ల దూరం లో అసమ్ లోని లీలాబారీ లో ఉంది. హోలోంగి లో విమానాశ్రయం ఏర్పాటైతే ఈ దూరం నాలుగో వంతు కు తగ్గిపోతుంది. అంతేకాకుండా, ఈ ప్రాంతాని కి మెరుగైన సంధానం సమకూరుతుంది. విమానాశ్రయం రాష్ట్రం లోని పర్యటక రంగ సత్తా ను వెలికి తీస్తుంది. ఈ విమానాశ్రయం ఈ ప్రాంతం లో ఆర్థిక వృద్ధి కి ఊతం గా నిలుస్తుంది. దేశాని కి వ్యూహాత్మకంగా ప్రాముఖ్యాన్ని సంతరిస్తుంది. విమానాశ్రయాన్ని చేరే రహదారి వెంబడి హరిత హారం ధ్వని నిరోధకం గా పని చేస్తుంది. దీనితో పాటు వాన నీటి నిల్వ ఏర్పాట్లు, వినియోగానికి అనువైన శక్తి ఉపకరణాల వంటి విభిన్న ప్రత్యేకతలు కూడా ఉంటాయి.
ప్రధాన మంత్రి అరుణాచల్ లో సిలా సొరంగం పనుల కు పునాదిరాయి ని వేస్తారు. ఇది తవాంగ్ లోయ కు అన్ని రుతువుల లో సామాన్యుల రాకపోక లు సాధ్యం కావడంతో పాటు ఏడాది పొడవునా భద్రత దళాల రాక పోక లు కూడా సాధ్యపడనున్నాయి. ఈ సొరంగం పూర్తి అయిన అనంతరం తవాంగ్ లోయ కు వెళ్లే ప్రయాణ కాలం లో ఒక గంట తగ్గిపోతుంది. అలాగే ఈ ప్రాంతం లో పర్యటన రంగాని కి ఉత్తేజం లభిస్తుంది. సంబంధిత ఆర్థిక కార్యకలాపాలు సైతం జోరందుకోగలవు.
ప్రధాన మంత్రి అరుణాచల్ ప్రదేశ్ కు సమర్పితమైన నూతన దూరదర్శన్ ఛానల్ డిడి అరుణ్ ప్రభ ను రేపు ఈటానగర్ లో ప్రారంభిస్తారు. ఈ ఛానల్ దూరదర్శన్ నిర్వహణ లోని 24 వ ఛానల్ కానుంది. ప్రధాన మంత్రి అరుణాచల్ ప్రదేశ్ లో 110 మెగావాట్ సామర్ధ్యం కలిగినటువంటి పారే జల విద్యుత్తు ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఎన్ఇఇపిసిఒ నిర్మించిన ఈ ప్రాజెక్టు బ్రహ్మపుత్ర నది కి ఉప నది అయిన దీక్‌రోంగ్ నది యొక్క సంభావ్య జల శక్తి ని వినియోగం లోకి తీసుకు రానుంది. దీని ద్వారా ఈశాన్య రాష్ట్రాల కు చౌక గా జల విద్యుత్తు సమకూరనుంది. దీనితో ఈ ప్రాంతం లో విద్యుత్తు లభ్యత మెరుగుపడగలదు.
ప్రధాన మంత్రి రేపు అరుణాచల్ ప్రదేశ్ లోని జోట్ లో భారతీయ ఫిలిమ్ ఎండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌టిఐఐ) యొక్క శాశ్వత ప్రాంగణం నిర్మాణాని కి శంకుస్థాపన చేస్తారు. ఇది చలన చిత్ర విద్యార్థుల అవసరాలను, ప్రత్యేకించి ఈశాన్య రాష్ట్రాల వారి అవసరాల ను నెరవేర్చుతుంది. ఉన్నతీకరించిన తేజు విమానాశ్రయాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ విమానాశ్రయం యుడిఎఎన్ (‘ఉడాన్’) పథకం లో భాగం గా వాణిజ్య సరళి కార్యకలాపాల కు పనికి వచ్చేటట్లుగా తగిన సదుపాయాల తో మరియు ఒక కొత్త టర్మినల్ తో నిర్మించబడింది.
అరుణాచల్ ప్రదేశ్ లో 50 హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ లను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. సార్వజనిక ఆరోగ్య రక్షణ కు పూచీ పడుతున్న ఆయుష్మాన్ భారత్ యొక్క కీలకమైన అంగాల లో హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ కూడా ఒకటి గా ఉంది. సౌభాగ్య పథకం లో భాగం గా అరుణాచల్ ప్రదేశ్ లో వంద శాతం గృహాల విద్యుదీకరణ లక్ష్యం నెరవేరినట్లు ప్రధాన మంత్రి ప్రకటించనున్నారు.
అసమ్ లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి ఈటానగర్ నుండి గువాహాటీ కి తిరిగి వస్తారు. ఇక్కడ ఆయన నార్త్ ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ కు శంకుస్థాపన చేస్తారు. ఇది ఈ ప్రాంతం లో సహజ వాయువు నిరంతరాయ లభ్యత కు పూచీ పడటమే కాకుండా ఈ ప్రాంతం లో పారిశ్రామిక వృద్ధి కి దన్ను గా కూడా నిలుస్తుంది. యావత్తు ఈశాన్య ప్రాంతాని కి తక్కువ ఖర్చు తో నాణ్యత కలిగిన గ్యాస్ ను అందించాలనే ప్రభుత్వ ప్రణాళిక లో ఈ గ్రిడ్ ఒక భాగం గా ఉంది. కామరూప్, సచెర్, హేలాకండీ & కరీంగంజ్ జిల్లా లలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ నెట్ వర్క్ కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇళ్ళ కు, ఇండస్ట్రియల్ యూనిట్ ల కు మరియు వాణిజ్య విభాగాల కు శుభ్రమైన ఇంధనం (పిఎన్‌జి) సరఫరా అయ్యేందుకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ బాధ్యత తీసుకొంటుంది.
అసమ్ లోని తిన్‌సుకియా లో హోలోంగ్ మాడ్యూలర్ గ్యాస్ ప్రోసెసింగ్ ప్లాంటు ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఇది ప్రారంభమైన తరువాత అసమ్ లో ఉత్పత్తి అయ్యే మొత్తం గ్యాస్ లో 15 శాతం గ్యాస్ ను ఈ ప్లాంటే అందిస్తుంది. ప్రధాన మంత్రి గువాహాటీ ఉత్తర ప్రాంతం లో ఎల్‌పిజి కెపాసిటీ ఆగ్‌మెంటేశన్ ఆఫ్ మౌంటెడ్ స్టోరేజ్ వెసెల్ ను కూడా ప్రారంభిస్తారు. ఈ సందర్భం గా నుమాలీగఢ్ లో ఎన్ఆర్ఎల్ బయో రిఫైనరీ కి మరియు బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిమ్, ఇంకా అసమ్ ల మీదుగా బరౌనీ నుండి గువాహాటీ వరకు 729 కి.మీ. గ్యాస్ గొట్టపు మార్గాని కి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు.
త్రిపుర లో ప్రధాన మంత్రి
ప్రధాన మంత్రి తన పర్యటన ఆఖరి దశ లో భాగం గా అగర్తలా కు చేరుకొంటారు. ఇక్కడ స్వామి వివేకానంద స్టేడియమ్ లో ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించడం ద్వారా గార్జీ-బెలోనియా రైలు మార్గాన్ని దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. ఈ రైలు మార్గం త్రిపుర ను దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా ల ముఖ ద్వారం గా మార్చుతుంది. ప్రధాన మంత్రి నర్సింగ్ గఢ్ లో త్రిపుర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నూతన భవన సముదాయాన్ని కూడా ప్రారంభించనున్నారు.
మహారాజా బీర్ బిక్రమ్ కిశోర్ మాణిక్య బహదూర్ విగ్రహాన్ని అగర్తలా లో మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం లో ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. ఆధునిక త్రిపుర సృష్టి కర్త గా మహారాజా బీర్ బిక్రమ్ కిశోర్ మాణిక్య బహదూర్ కీర్తింపబడుతున్నారు. అగర్తలా నగర ప్రణాళిక రచన ఖ్యాతి కూడా ఆయన కు దక్కింది. ఈయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జాతి నిర్మాణాని కి గొప్ప గా కృషి చేసి, భారతదేశం లో తెర మరుగైనటువంటి వీరుల ను సత్కరించాలన్న కేంద్ర ప్రభుత్వ విధానాని కి అనుగుణం గా ఉంది.