రెండు రోజుల పర్యటనలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించనున్న ప్రధాని
జామ్ నగర్లో సౌరాష్ట్ర నర్మద అవతరణ్ నీటిపారుదల ప్రాజెక్టు (సౌని–SAUNI) యోజన ఆవిష్కారం; అహమ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ మొదటి దశ ప్రారంభం; వస్త్రాల్ లో మార్చి 5న ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజనకు ప్రధానిచే ప్రారంభోత్సవం
మార్చి 4, 5 తేదీలలో ప్రధాని గుజరాత్ పర్యటన సందర్భంగా మొదటి రోజు జామ్ నగర్, జస్పూర్, అహమ్మదాబాద్ , రెండవరోజు 5వ తేదీన అదాలాజ్, వస్త్రాల్ లలో పర్యటిస్తారు.
మార్చి నాల్గవ తేదీన జామ్ నగర్ లో ప్రధాని మెడికల్ కాలేజీ క్యాంపస్ సందర్శించి పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. అవి –
- గురుగోవింద సింగ్ ఆసుపత్రిలో నిర్మించిన 750 పడకల కొత్త విభాగాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. అసుపత్రిలో కొత్తగా నిర్మించిన పి జి హాస్టల్ భవనాన్ని కూడా ఆయనప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని విభాగాలను సందర్శించి విద్యార్ధులు, అధ్యాపకులతో మాట్లాడుతారు.
- సౌని ప్రాజెక్టుల ఆవిష్కరణ: వేదికపైనుంచి మీట నొక్కడం ద్వారా ప్రధాని సౌని ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. సౌని ప్రాజెక్టులు ఉంద్ – 1 నుంచి రంజిత్ సాగర్ ఎత్తిపోతల పథకం మరియు మంచు -1 నుంచి న్యారి ఎత్తిపోతల పథకం జాతికి అంకితం చేస్తారు. వాటితో పాటు జోడియా లవణహరణ ప్లాంటుకు మరియు ఉంద్ -3 నుంచి వేణు -2 ఎత్తిపోతల పథకానికి శంకు స్థాపన చేస్తారు.
- బాంద్రా – జామ్ నగర్ హంసఫర్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. వీడియో లింక్ ద్వారా బాంద్రా – జామ్ నగర్ హంసఫర్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం జరుగుతుంది.
*ఇతర ప్రాజెక్టులు
శీలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రధాని 51 కిలోమీటర్ల ఆజి-3 నుంచి కిజాడియా పైపులైన్ జాతికి అంకితం చేస్తారు. రాజకోట్ – కనాలుస్ రైలు మార్గాన్ని రెండు లైన్లుగా మార్చే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
జామ్ నగర్ నగర పాలక సంస్థ నిర్మించిన 448 ఇళ్ళు, జామ్ నగర్ ప్రాంత అభివృద్ధి సంస్థ నిర్మించిన 1008 ఫ్లాట్ల తాళాలు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇవ్వడం ద్వారా వాటిని అంకితం చేస్తారు.
వేదిక వద్ద ఆయన సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
జస్పూర్ లో
విశ్వ ఉమియాధం కాంప్లెక్స్ శంకుస్థాపన జరిపేందుకు ప్రధానమంత్రి గుజరాత్ లోని జస్పూర్ సందర్శిస్తారు. తరువాత వేదికవద్ద సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
అహమ్మదాబాద్ లోని వస్త్రాల్ గాం మెట్రో స్టేషన్ వద్ద
వస్త్రాల్ గాం మెట్రో స్టేషన్ వద్ద ప్రధానమంత్రి అహమ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభిస్తారు. ఆయన మెట్రో రెండవ దశకు పునాది రాయి కూడా వేస్తారు.
అహమ్మదాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం రూపొందించిన “కామన్ మొబిలిటీ కార్డు” ను ప్రధాని ఆవిష్కరిస్తారు.
ఆ తరువాత ప్రధాని మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. వస్త్రాల్ గాం స్టేషన్ నుంచి మెట్రో రైలులో ప్రయాణిస్తారు.
అహమ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండవ దశకు కేంద్ర మంత్రిమండలి 2019 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. రెండవ దశలో మొత్తం 28.252 కిలోమీటర్ల పొడవైన రెండు కారిడార్లు ఉంటాయి. ఇది అహమ్మదాబాద్, గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన ప్రజా రవాణా వ్యవస్థను సమకూరుస్తుంది.
అహమ్మదాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు మొత్తం పొడవు 40.03 కిలోమీటర్లు. దానిలో6.5 కిలోమీటర్ల దూరం భూగర్భంలో , మిగిలింది ఎత్తులో ఉంటుంది.
ఈ మెట్రో ప్రాజెక్టుల వల్ల సంధాయకత పెరగడమే కాక ప్రయాణ కాలం తగ్గుతుంది మరియు పట్టణ ప్రాంతాలలో జీవనం సౌఖ్యంగా మారుతుంది.
అహమ్మదాబాదులో బి జె మెడికల్ కాలేజీ వద్ద
ఆరోగ్యం, రైల్వేలకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రధానమంత్రి బి జె మెడికల్ కాలేజీ మైదానం వద్ద ప్రారంభిస్తారు.
ఆరోగ్యం
అహమ్మదాబాదు ప్రాంతంలో నిర్మించిన వివిధ ఆసుపత్రులను ప్రధానమంత్రి ప్రజలకు అంకితమిస్తారు. అవి: మహిళా శిశు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కాన్సర్ ఆసుపత్రి, కంటి ఆసుపత్రి మరియు దంతాల ఆసుపత్రి.
ఈ ఆసుపత్రుల ప్రారంభం అహమ్మదాబాదులో ఆరోగ్య సంరక్షణ రంగం అభివ్రుద్హికి ఎంతో దోహదకారి అవుతుంది. అహమ్మదాబాద్, ఆ సమీప ప్రాంతాలవారికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందడం నిశ్చయం అవుతుంది.
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రదామంత్రి గోల్డెన్ కార్డులను పంపిణీ చేస్తారు.
రైల్వేలు
పటాన్ – బింది రైల్వేలైనుకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేస్తారు. ఆధునీకరించిన దాహోడ్ రైల్వే వర్క్ షాప్ ను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ వర్క్ షాప్ నెలకు 150 వ్యాగన్ల మరమ్మతు సామర్ధ్యం గలది. అదే విధంగా ప్రధాని ఆనంద్ – గోద్రా రైలు మార్గం రెండు లైన్లుగా మార్చే ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తారు.
ఆ తరువాత ప్రధాని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఆ తరువాత ప్రధాని న్యూ సిటి హాస్పిటల్ కూడా సందర్శించి 1200 పడకల ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేస్తారు. ఆయన అహమ్మదాబాదులో న్యూ క్యాన్సర్ హాస్పిటల్ మరియు కంటి ఆసుపత్రిని సందర్శిస్తారు.
5 మార్చి 2019
గాంధీనగర్ లోని అదాలాజ్ వద్ద
మార్చి ఐదవ తేదీన ప్రధానమంత్రి అదాలాజ్, గాంధీనగర్ లోని అన్నపూర్ణా ధాం ట్రస్ట్ సందర్శించి శిక్షా భవన్ మరియు విద్యార్ధి భవన్ లకు శంకుస్థాపన చేస్తారు. తరువాత సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ – ధన్ యోజన (పి ఎం- ఎస్ వై ఎం)కు ప్రారంభోత్సవం
వస్త్రాల్ వద్ద ప్రధాని ఆన్ లైనులో లబ్ధిదారులకు నిధుల బదిలీచేసి అవ్యవస్థీకృత రంగానికి చెందిన కార్మికుల పించను పథకం ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ – ధన్ ప్రారంభిస్తారు.
ఎంపిక చేసిన లబ్ధిదారులకు పి ఎం- ఎస్ వై ఎం పించను కార్డులు పంపిణీ చేస్తారు.
పి ఎం- ఎస్ వై ఎం గురించి
నెలకు రూ. 15,000 కన్నా తక్కువ వేతనం పొందుతున్న అవ్యవస్థీకృత రంగానికి చెందిన కార్మికుల కోసం ఈ పథకాన్ని 2019-20 తాత్కాలిక బడ్జెట్లో ప్రకటించారు. ఇది స్వచ్ఛంద పథకం. కార్మికులు ప్రతినెలా సభ్యత్వం చెల్లించినట్లయితే వారికి 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత నెలకు రూ. 3000 చొప్పున పించను లభిస్తుంది. వారి వాటాకు సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటా చెల్లిస్తుంది. వచ్చే అయిదేళ్ళలో అవ్యవస్థీకృత రంగానికి చెందిన కనీసం 10 కోట్ల మంది కార్మికులు ఈ పథకాన్ని వినియోగించుకోగలరని అంచనా. అవ్యవస్థీకృత రంగంలో దాదాపు 40 కోట్ల మంది పని చేస్తున్నారు. పించను పథకంతో పాటు ఆరోగ్య బీమా, జీవిత బీమా వంటి పథకాల ద్వారా అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో సామాజిక భద్రత లభిస్తుంది.