ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు - 2017 అక్టోబర్ 22వ తేదీన గుజరాత్ ను సందర్శించనున్నారు.
ఘోఘా లో ఓ బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొని, ఘోఘా మరియు దహేజ్ ల మధ్య రో రో (రోల్ ఆన్, రోల్ ఆఫ్) ఫెరి సర్వీస్ యొక్క ఒకటో దశను ప్రారంభిస్తారు. ఈ బల్లకట్టు సౌరాష్ట్ర లోని ఘోఘా కు మరియు దక్షిణ గుజరాత్ లోని దహేజ్ కు మధ్య ప్రయాణ కాలాన్ని సుమారు ఏడు ఎనిమిది గంటల నుండి కేవలం ఒక గంటకు పైగా కుదించివేస్తుంది. పూర్తి స్థాయి కార్యకలాపాలు మొదలైతే గనక, ఇది వాహనాల చేరవేతకు కూడా వీలు కల్పించగలుగుతుంది. ప్రయాణికుల రాక పోకలకు ఉద్దేశించిన ఒకటో దశను ప్రధాన మంత్రి ఆదివారం నాడు ప్రారంభిస్తారు. ఈ సర్వీసు లో ప్రధాన మంత్రి ఘోఘా నుండి దహేజ్ కు ప్రథమ యాత్ర చేస్తారు. యాత్రను ముగించుకొన్న తరువాత దహేజ్ లో జనసందోహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు కూడా.
ఘోఘా బహిరంగ సభ లో ప్రధాన మంత్రి పాల్గొని, శ్రీ భావ్ నగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ కు చెందిన సర్వోత్తమ్ కేటల్ ఫీడ్ ప్లాంటును ప్రారంభిస్తారు.
దహేజ్ నుండి ప్రధాన మంత్రి వడోదరాకు వెళ్తారు. అక్కడ జరిగే ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొని, వడోదరా సిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను, ద వహోడియా రీజనల్ వాటర్ సప్లయ్ స్కీమును మరియు వడోదరాలో నిర్మాణం జరిగిన బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన ప్రధాన కార్యాలయ భవనాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తారు.
‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ (పట్టణ మరియు గ్రామీణ) లో భాగంగా నిర్మించిన గృహాల తాళంచెవులను లబ్ధిదారులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందజేస్తారు. అనేక అవస్థాపన మరియు అభివృద్ధి పథకాలకు ఆయన పునాదిరాళ్లు వేస్తారు. వీటిలో భాగంగా ఓ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పోర్ట్ హబ్, ప్రాంతీయ నీటి సరఫరా పథకాలు, గృహ నిర్మాణ పథకాలు మరియు ఒక ఫ్లైఓవర్ లు ఉంటాయి. అలాగే, ముంద్రా- ఢిల్లీ పెట్రోలియమ్ పైప్ లైన్ సామర్థ్యం విస్తరణ తో పాటు వడోదరా లో హెచ్ పిసిఎల్ కు చెందిన ఒక గ్రీన్ ఫీల్డ్ మార్కెటింగ్ టర్మినల్ పనులకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
***