ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న అనగా 2019 వ సంవత్సరం మార్చి 9వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయెడా ను సందర్శించనున్నారు. గ్రేటర్ నోయెడా లో గల పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజి లో వివిధ అభివృద్ధి పథకాల ను ఆయన ప్రారంభించనున్నారు.
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజి ప్రారంభ సూచకం గా ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. సంస్థ ఆవరణ లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. ఆర్కియలోజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) లో భాగం అయిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కియాలజీ గ్రేటర్ నోయెడా లో ఉన్న నాలెడ్జ్ పార్క్-II లో ఏర్పాటయింది.
మెట్రో లో భాగమైన నోయెడా సిటీ సెంటర్- నోయెడా ఇలెక్ట్రానిక్ సిటీ స్టేశన్ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. నోయెడా నివాసుల కు సౌకర్యం గా ఉండేటటువంటి మరియు వేగవంతం గా ఉండేటటువంటి రవాణా సాధనాన్ని ఈ కొత్త సెక్షన్ ప్రసాదిస్తుంది. ఇది రహదారుల పై రద్దీ ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, పర్యావరణ మైత్రీపూర్వకమైనటువంటి రవాణా సాధనం గా కూడా ఉంటుంది. 6.6 కిలోమీటర్ల మేర సాగే ఈ సెక్షన్ ఢిల్లీ మెట్రో యొక్క బ్లూ లైన్ కు ఒక విస్తరణ గా ఉంది.
రెండు థర్మల్ పవర్ ప్లాంటు లకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వాటిలో ఒకటోది 1320 మెగావాట్ సామర్ధ్యం తో ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ శహర్ జిల్లా లో గల ఖుర్జా లో ఏర్పాటవుతున్న సూపర్ థర్మల్ పవర్ ప్లాంటు. ఒక్కొక్కటి 660 ఎండబ్ల్యు సామర్ధ్యం తో ఉండే రెండు యూనిట్లు గా ఇది ఏర్పాటు కానుంది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సహాయం తో ఈ పథకం పని చేస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం అత్యంత అధునాతనమైన ఉద్గార నియంత్రణ సంబంధ సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి జత చేయనున్నారు. విద్యుత్తు ను ఉత్పత్తి చేయడం కోసం తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకొంటూ, అధిక సామర్ధ్యం తో ఇది పని చేస్తుంది. ఖుర్జా ప్లాంటు ఉత్తర ప్రాంతం లో, మరీ ముఖ్యం గా ఉత్తర్ ప్రదేశ్ లో విద్యుత్తు కొరత పరిస్థితి ని మార్చివేయ గలుగుతుంది. అలాగే, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఇంకా ఢిల్లీ వంటి రాష్ట్రాల కు లబ్ధి ని చేకూర్చుతుంది. ఈ పథకం బులంద్ శహర్ జిల్లా తో పాటు ఉత్తర్ ప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంత జిల్లా లలో చెప్పుకోదగిన స్థాయి లో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి ని కల్పించడమే కాకుండా ఆయా ప్రాంతాల సర్వతోముఖ అభివృద్ధి కి సైతం బాట పరుస్తుందని ఆశిస్తున్నారు.
ఇక రెండో ప్లాంటు ను బిహార్ లోని బక్సర్ లో నెలకొల్పుతున్నారు. ఈ థర్మల్ పవర్ ప్లాంటు కు 1320 మెగా వాట్ల సామర్ధ్యం ఉంటుంది. వీడియో లింక్ ద్వారా బక్సర్ థర్మల్ పవర్ ప్లాంటు ను ప్రారంభించనున్నారు. ఈ ప్లాంటు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పై ఆధారపడి పని చేస్తుంది. ఇందులో ఒక్కొక్కటి 660 ఎండబ్ల్యు సామర్ధ్యం తో కూడిన రెండు యూనిట్లు ఉంటాయి. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మరియున అధిక సామర్థ్యం కోసం అత్యంత అధునాతనమైన ఉద్గార నియంత్రణ సంబంధ సాంకేతిక పరిజ్ఞానాన్ని దీనికి జత చేయనున్నారు. బిహార్ లో మరియు తూర్పు ప్రాంతం లో విద్యుత్తు లోటు స్థితి ని బక్సర్ ప్లాంటు మార్చివేయ గలుగుతుంది.
ప్రధాన మంత్రి ఆ తరువాత జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.