ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2018వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నాడు రాజ్‌ఘాట్ లో మహాత్మ గాంధీ కి పుష్పాంజలి ని సమర్పించనున్నారు. ఆ రోజు నాటి నుండి మహాత్ముని 150 వ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే, పూర్వ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి గారి జయంతి ని పురస్కరించుకొని ఆయన కు పుష్పాంజలి ని సమర్పించేందుకు ప్రధాన మంత్రి విజయ్ ఘాట్ ను కూడా సందర్శించనున్నారు.
ప్రధాన మంత్రి రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరిగే మహాత్మ గాంధీ ఇంటర్ నేశనల్ శానిటేషన్ కన్‌వెన్శన్ (ఎమ్‌జిఐఎస్‌సి) ముగింపు సమావేశానికి హాజరవుతారు. ప్రపంచం నలుమూలల నుండి పారిశుధ్య మంత్రులు మరియు జలం, పారిశుధ్యం, ఇంకా ఆరోగ్య రక్షణ (డబ్ల్యుఎఎస్‌హెచ్) రంగాలకు చెందిన ఇతర నేతల ను ఒక చోటుకు చేర్చే, నాలుగు రోజుల అంతర్జాతీయ సమావేశమే ఎమ్‌జిఐఎస్‌సి. ఇదే కార్యక్రమం లో ఏర్పాటు చేసే ఒక మినీ డిజిటల్ ఎగ్జిబిశన్ ను ప్రధాన మంత్రి సందర్శిస్తారు. ఆయన వెంట ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ శ్రీ ఎంటోనియో గుటేరేజ్ ఉంటారు. మాననీయ వ్యక్తులు కార్యక్రమ వేదిక మీద నుండి మహాత్మ గాంధీ స్మారక తపాలా బిళ్ళ లను, మహాత్మ గాంధీ కి ఎంతో ఇష్టమైన ‘‘వైష్ణవ జన్ తో’’ ఆధారంగా రూపొందించిన ఒక సిడి ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ్ భారత్ అవార్డు లను కూడా ప్రదానం చేస్తారు. సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు.
ఆ తరువాత విజ్ఞాన్ భవన్ లో జరిగే ఇంటర్ నేశనల్ సోలార్ అలయన్స్ ఒకటో సభ ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఇదే కార్యక్రమం రెండో ఐఒఆర్ఎ రిన్యూవబుల్ ఎనర్జీ మినిస్టీరియల్ మీట్ & రెండో గ్లోబల్ రీ-ఇన్వెస్ట్ (రిన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్‌పో) కార్యక్రమాలకు సైతం ప్రారంభవేదికగా ఉంటుంది. ఈ సందర్భంగా ఐక్య రాజ్య సమితి సెక్రటరి జనరల్ శ్రీ ఎంటోనియో గుటేరేజ్ కూడా పాలుపంచుకోనున్నారు. ప్రధాన మంత్రి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.