అక్టోబర్ 17 న జరిగే అంతర్జాతీయ అభిధామ్ దివస్ ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొంటారు. ఈ వేడుకలు న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో పాళీ భాషను శాస్త్రీయ భాషగా గుర్తించే కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తారు.
అభిధామ్ ని బోధించిన అనంతరం స్వర్గం నుంచి బుద్ధుడు తిరిగి వచ్చిన రోజుని అభిధామ్ దివస్‌గా జరుపుకొంటారు. ఇటీవల నాలుగు ఇతర భాషలతో పాటు పాళీకి శాస్త్రీయ భాషగా గుర్తింపు ఇవ్వడం ఈ ఏడాది అభిధామ్ దివస్ ప్రాముఖ్యాన్ని పెంచుతోంది. అభిధామ్ పై బుద్ధ భగవానుని బోధనలు పాళీ భాషలో ఉన్నాయి.
భారత ప్రభుత్వం, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ అభిధామ్ వేడుకల్లో 14 దేశాలకు చెందిన విద్యావేత్తలు, సన్యాసులు పాల్గొంటారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన బౌద్ధ ధర్మంపై ప్రావీణ్యం ఉన్న యువ నిపుణులు సైతం పాల్గొంటారు.