ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘స్వచ్ఛతా హీ సేవ’ ఉద్యమాన్ని సెప్టెంబర్ 15వ తేదీన ప్రారంభించనున్నారు.
15 రోజుల పాటు జరిగే ఈ ఉద్యమం లో భాగంగా దేశ వ్యాప్తంగా 18 ప్రాంతాలకు చెందిన విభిన్న వర్గాల ప్రజానీకం తో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషిస్తారు. ప్రధాన మంత్రి మాట్లాడే వర్గాల లో బడి పిల్లలు, జవానులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, పాల సహకార సంఘాల సభ్యులు, వ్యవసాయ సహకార సంఘాల సభ్యులు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు, స్థానిక ప్రభుత్వ ప్రతినిధులు, రైల్వే ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛాగ్రహులు, ఇంకా ఇతరులు ఉంటారు.
స్వచ్ఛత దిశ గా మరింత ఎక్కువ మంది ప్రజలు పాలుపంచుకొనేటట్లు చేయడం ‘స్వచ్ఛతా హీ సేవ ఉద్యమం’ యొక్క ధ్యేయం. 2018వ సంవత్సరం అక్టోబరు 2వ తేదీన ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ నాలుగో వార్షికోత్సవాన్ని జరుపుకోనుండగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. 2018వ సంవత్సరం అక్టోబరు 2వ తేదీ నాడు మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలు కూడా మొదలవనున్నాయి.
అంతకుముందు, ప్రజలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ఒక వీడియో సందేశం లో మాట్లాడుతూ ‘‘ఈ ఉద్యమం బాపు జీ కి నివాళులు అర్పించేందుకు ఒక గొప్ప విధానం’’ అంటూ అభివర్ణించారు. ఈ ఉద్యమం లో భాగం పంచుకొని ఒక ‘స్వచ్ఛ భారత్’ ను ఆవిష్కరించే ప్రయత్నాలను బలపరచండంటూ ప్రజలకు ఆయన ఉద్బోధించారు.