ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ని 2018, సెప్టెంబర్ 1వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లోని టాల్‌కటోరా స్టేడియమ్ లో ప్రారంభించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం యొక్క ధ్యేయాల లో ఒకటైన అందరికీ ఆర్థిక సేవల ధ్యేయాన్ని వేగం గా సాగించడం లో సహాయకారి గా ఉండేందుకు ఐపిపిబి ని ఉద్దేశించారు. ఇది సామాన్య మానవుడి కి తక్కువ ఖర్చు లో, అందుబాటు లో ఉండేటటువంటి విశ్వసనీయమైన బ్యాంకు. ఇది తపాలా విభాగానికి చెందిన విస్తృతమైన నెట్‌వర్క్ ను ఉపయోగించుకోనుంది. తపాలా విభానికి దేశం అంతటా 3,00,000 మందికి పైగా పోస్ట్ మెన్, ఇంకా గ్రామీణ డాక్ సేవక్ లు ఉన్నారు. ఈ కారణంగా భారతదేశం లో బ్యాంకింగ్ రంగం యొక్క వ్యాప్తి ని ఐపిపిబి గణనీయంగా పెంపొందించగలుగుతుంది.
ఐపిపిబి ప్రారంభం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం యొక్క ప్రయోజనాలను దేశం లోని సుదూర ప్రాంతాల కు సైతం అందించాలన్న కేంద్ర ప్రభుత్వ కృషి లో మరొక ముఖ్యమైన పరిణామం కానుంది.
ప్రారంభ దినం నాడే ఐపిపిబి దేశవ్యాప్తంగా 650 శాఖలతో పాటు 3250 యాక్సెస్ పాయింట్లు అందివస్తాయి. ఈ శాఖలను, యాక్సెస్ పాయింట్ల ను ఏక కాలం లో జరిగే కార్యక్రమాల్లో ప్రారంభించనున్నారు.
దేశం లోని 1.55 లక్షల తపాలా కార్యాలయాలన్నింటినీ 2018 డిసెంబర్ 31 కల్లా ఐపిపిబి వ్యవస్థ తో సంధానించనున్నారు.
పొదుపు ఖాతాలు, కరెంట్ అకౌంట్ లు, నగదు బదిలీ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ లు, బిల్లు చెల్లింపులు మరియు యుటిలిటీ పేమెంట్స్, ఇంకా ఎంటర్‌ప్రైజ్ పేమెంట్స్, ఇంకా మర్చెంట్ పేమెంట్స్ వంటి సేవ లను ఐపిపిబి అందించనుంది. ఈ సేవలతో పాటు సంబంధిత ఇతర సేవలను బ్యాంకు యొక్క అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ కౌంటర్ సర్వీసెస్, మైక్రో- ఎటిఎమ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఎస్ఎమ్ఎస్ మరియు ఐవిఆర్ తదితర బహుళ మార్గాలలో అందజేయనున్నారు.