ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, 2021 జనవరి, 16వ తేదీ సాయంత్రం 5 గంటలకు అంకురసంస్థలతో సంభాషించడంతో పాటు, "ప్రారంభ్ : స్టార్టప్-ఇండియా అంతర్జాతీయ సదస్సు" నుద్దేశించి, దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ సంయుక్తంగా ఈ సదస్సును, 2021 జనవరి, 15, 16 తేదీలలో నిర్వహిస్తున్నాయి. బిమ్-స్టెక్ అంకురసంస్థల సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం కట్టుబడి ఉందని - 2018 ఆగష్టు లో ఖాట్మండులో జరిగిన నాల్గవ బిం-స్టెక్ సదస్సులో ప్రధాని చేసిన ప్రకటనను అనుసరించి ఈ రెండు రోజుల సదస్సును నిర్వహిస్తున్నారు.
2016 జనవరి, 16వ తేదీన ప్రధానమంత్రి ప్రారంభించిన "స్టార్టప్-ఇండియా" ఐదవ వార్షికోత్సవం సందర్భంగా, ఈ సదస్సు ఏర్పాటు చేయడం విశేషం. 25 కి పైగా దేశాలకు చెందిన 200 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు ప్రసంగించనున్న ఈ సదస్సు - "స్టార్టప్ ఇండియా" ప్రారంభించినప్పటి నుండి భారత ప్రభుత్వం నిర్వహించిన అతిపెద్ద అంకురసంస్థల సమ్మేళనం కానుంది. అంకురసంస్థల పర్యావరణ వ్యవస్థలను సమిష్టిగా అభివృద్ధి చేయడానికీ, బలోపేతం చేయడానికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో బహుపాక్షిక సహకారంతో పాటు కలిసి పనిచేయడంపై దృష్టి సారించే, వివిధ అంశాలపై, ఈ సదస్సులో, 24 సమావేశాలు జరుగనున్నాయి.