ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 9న మధ్యాహ్నం 12:30 గంటలకు వికసిత భారతం సంకల్ప యాత్ర (వీబీఎస్‌వై ) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషిస్తారు. అనంతరం వారినుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వేలాదిగా ‘వీబీఎస్‌వై’ లబ్ధిదారులు వాస్తవిక సాదృశ మాధ్యమం ద్వారా పాల్గొంటారు. అలాగే యాత్రలో భాగమైన 2 వేలకుపైగా ‘వీబీఎస్‌వై’ వాహనాలు, వేలాది వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు (కేవీకే), సార్వత్రిక సేవా కేంద్రాలు (సీఎస్‌సీ) కూడా దీనితో అనుసంధానించబడతాయి. కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
సంక్షేమ పథకాల ప్రయోజనాలను సకాలంలో లక్షిత లబ్ధిదారులకు అందించడం ద్వారా ప్రతిష్టాత్మక పథకాల అమలులో సంతృప్త స్థాయి సాధించే లక్ష్యంతో ప్రభుత్వం దేశవ్యాప్తంగా వికసిత భారతం సంకల్ప యాత్రను నిర్వహిస్తోంది.