‘సుభాష్ చంద్ర బోస్ మ్యూజియమ్’ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని ఎర్ర కోట లో 2019 వ సంవత్సరం జనవరి 23వ తేదీ న ప్రారంభించనున్నారు.
‘మ్యూజియమ్ ఆన్ సుభాష్ చంద్ర బోస్ అండ్ ఇండియన్ నేశనల్ ఆర్మీ’ ప్రారంభ సూచకం గా ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు. మ్యూజియమ్ ను ప్రధాన మంత్రి సందర్శిస్తారు కూడా.
జలియాన్ వాలా బాగ్ కు మరియు ఒకటో ప్రపంచ యుద్ధాని కి సంబంధించిన వస్తు ప్రదర్శన శాల అయినటువంటి ‘యాద్-ఎ-జలియాన్ మ్యూజియమ్’నూ ప్రధాన మంత్రి సందర్శించనున్నారు.
భారతదేశ ప్రథమ స్వాతంత్య్ర సమరం ఆరంభమైన 1857వ సంవత్సరాని కి సంబంధించిన మ్యూజియమ్ తో పాటు భారతీయ కళలు అనే అంశం పై న్యూ ఢిల్లీ లోని ఎర్ర కోట లో ఏర్పాటైన ‘దృశ్యకళ’ మ్యూజియమ్ ను సైతం ఆయన సందర్శించనున్నారు.
‘మ్యూజియమ్ ఆన్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఎండ్ ఇండియన్ నేశనల్ ఆర్మీ’ సుభాష్ చంద్ర బోస్ తాలూకు సమగ్ర వివరణ తో పాటు ఇండియన్ నేశనల్ ఆర్మీ (ఐఎన్ఎ) యొక్క చరిత్ర ను కళ్ళ కు కడుతుంది. ఇక్కడ సుభాష్ చంద్ర బోస్ కు మరియు ఐఎన్ఎ కు సంబంధించిన వివిధ వస్తువుల ను చూడవచ్చు. వీటి లో నేతాజీ ఉపయోగించిన ఒక చెక్క కుర్చీ మరియు కత్తి, ఐఎన్ఎ కు సంబంధిన పతకాలు, బాడ్జి లు, యూనిఫాంలు తదితర సామగ్రి ఉన్నాయి. ప్రధాన మంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన చేసిన ప్రధాన నిర్మాణాల ను ప్రారంభించే సంప్రదాయమే దీనికి కూడా వర్తిస్తోంది. మ్యూజియమ్ నిర్మాణ పనుల కు 2018వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ నాడు ప్రధాన మంత్రి పునాది రాయి ని వేశారు. ఇది నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ప్రభుత్వ 75వ వార్షికోత్సవాల ను సూచిస్తోంది. ఈ సందర్భాని కి గుర్తు గా స్వాతంత్య్ర విలువల ను సమున్నతం గా చాటుతూ జాతీయ పతాకాన్ని ఎర్ర కోట లో ప్రధాన మంత్రి ఎగురవేశారు.
వైపరీత్యాల వేళ చేపట్టిన సహాయక కార్యకలాపాల లో పాలుపంచుకొన్న వారి ని గౌరవించడం కోసం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పేరిట ఒక అవార్డు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. అది 2018వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ నాడు జాతీయ పోలీసు స్మారకాన్ని దేశ ప్రజల కు అంకితమిచ్చిన సందర్భం.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క మరియు ఐఎన్ఎ యొక్క విలువల ను, ఇంకా ఆదర్శాల ను ప్రధాన మంత్రి అండమాన్ & నికోబార్ దీవుల లో 2018వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ నాడు మరొక్క మారు గుర్తు కు తెచ్చారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ భారతీయ భూభాగం పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 75 సంవత్సరాలు అయినందుకు సూచకం గా ఒక స్మారక తపాలా బిళ్ళ ను, నాణేన్ని మరియు ఫస్ట్ డే కవర్ ను ప్రధాన మంత్రి విడుదల చేశారు. నేతాజీ ఇచ్చిన పిలుపు ను అండమాన్ కు చెందిన అనేక మంది యువజనులు అందుకొని భారతదేశాని కి స్వాతంత్య్రాన్ని సాధించడం కోసం తమ ను తాము అంకితం చేసుకొన్నారన్న సంగతి ని ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చారు. 150 అడుగుల ఎత్తు న అలంకరించిన ఈ జెండా 1943వ సంవత్సరం లో నేతాజీ మువ్వన్నెల జెండా ను ఎగురవేసిన రోజు తాలూకు జ్ఞాపకాన్ని పరిరక్షించేందుకు జరిగినటువంటి ఒక ప్రయత్నం. నేతాజీ కి గౌరవ సూచకం గా రాస్ దీవి కి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ద్వీపం అనే పేరు ను పెట్టడమైంది.
అంతక్రితం 2015వ సంవత్సరం అక్టోబరు లో, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కుటుంబ సభ్యులు ప్రధాన మంత్రి తో భేటీ అయ్యి నేతాజీ కి సంబంధించిన, ప్రభుత్వం వద్ద ఉన్న ఫైళ్ళ డీక్లాసిఫికేశన్ కై అభ్యర్ధించారు. నేతాజీ కి చెందిన 100 ఫైళ్ల డిజిటల్ ప్రతుల ను ప్రధాన మంత్రి 2018వ సంవత్సరం జనవరి లో నేశనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా లో బహిరంగపరచారు.
‘యాద్- ఎ- జలియాన్ మ్యూజియమ్’ 1919వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీ నాడు జరిగిన జలియన్‌వాలా బాగ్ సామూహిక హత్య ఘటన తాలూకు ఖచ్చితమైన వివరాల ను తెలియజేస్తుంది. ఒకటో ప్రపంచ యుద్ధం కాలం లో భారతీయ జవానుల యొక్క వీరత్వం మరియు వారు చేసిన త్యాగాలను కూడా ఈ వస్తు ప్రదర్శన శాల స్ఫురణ కు తెస్తుంది.
‘మ్యూజియమ్ ఆన్ 1857- ఇండియా స్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ ఆ సంవత్సరం లో జరిగిన భారతదేశ ప్రథమ స్వాతంత్య్ర సమరం తాలూకు చారిత్రక కథనం తో పాటు ఆ కాలం లో భారతీయుల శౌర్యాన్ని మరియు త్యాగాల ను గురించి తెలియజెప్తుంది.
‘దృశ్యకళ – ఎగ్జిబిషన్ ఆన్ ఇండియన్ ఆర్ట్’ 16వ శతాబ్దం మొదలుకొని భారతదేశ స్వాతంత్య్రం దాకా రూపుదిద్దుకొన్న భారతీయ కళాకృతుల ను ప్రదర్శిస్తుంది.
గణతంత్ర దినోత్సవాని కన్నా ముందు ప్రధాన మంత్రి ఈ వస్తు ప్రదర్శన శాల లను సందర్శించటం దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సాహసిక స్వాతంత్య్ర యోధుల స్మృతి కి అర్పిస్తున్న శ్రద్ధాంజలి.