ఢిల్లీ మెట్రో నిర్మించిన నూతన మెజెంటా మెట్రో రైల్ లైనును ఈ నెల 25న ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ కొత్త లైను నోయిడాలోని బొటానికల్ ఉద్యానవనాన్ని, ఢిల్లీలోని కల్కాజీ మందిర్ తో కలుపుతుంది. ఈ లైను కారణంగా నోయిడా, దక్షిణ ఢిల్లీల మధ్యన గల దూరం గణనీయంగా తగ్గనుంది. ఈ సందర్భంగా నోయిడాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.
దేశంలో నగర ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను ఆధునీకరించాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఈ నూతన మెట్రో రైలును నిర్మించడం జరిగింది. సాంకేతికతకు పెద్ద పీట వేస్తూ, పర్యావరణ హిత నగర రవాణా వ్యవస్థలను నెలకొల్పడానికి అనుగుణంగా కేంద్రం చేపట్టిన కార్యక్రమమిది.
ఈ ఏడాది ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతున్న మూడోమెట్రో లైను ఇది. ఈ సంవత్సరం జూన్ నెలలో ఆయన కొచ్చి మెట్రో ను జాతికి అంకితం చేశారు. నవంబర్ నెలలో హైదరాబాద్ మెట్రోను ప్రారంభించారు. ఈ రెండు ప్రారంభోత్సవాల సమయంలో చేసినట్టుగానే ఈ సారి కూడా ప్రధాని ఈ నూతన మెట్రో రైలు లైనులో ప్రయాణం చేసి ఆ తర్వాత బహిరంగసభను ఉద్దేశించి మాట్లాడతారు.
రాజధాని ప్రాంతంలో పలు కార్యక్రమాలకు హాజరు కావడానికిగాను ప్రధాని శ్రీ నరేంద్రమోదీ తరచూ మెట్రో రైలులో ప్రయాణం చేస్తున్నారు. 2016 జనవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఫ్రాంకోయిస్ హొలాండే తో కలిసి ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఢిల్లీనుంచి గురగావ్ వరకూ ప్రయాణం చేశారు. ఆ తర్వాత వారు అక్కడ అంతర్జాతీయ సౌర వేదిక ప్రధాన కార్యాలయంకోసం శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రధాని శ్రీ మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ మాల్కమ్ టర్న్ బుల్ తో కలిసి అక్షర ధామ్ దేవాలయంవరకూ మెట్రోలో ప్రయాణం చేశారు.
వేగంగా ప్రయాణం చేయడానికి వీలుగా వుండే రవాణా వ్యవస్థలద్వారా కనెక్టివిటీని పెంచాలనే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం గత మూడున్న సంవత్సరాలలో తొమ్మిది మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించింది. దాదాపుగా 165 కిలోమీటర్ల దూరం వుండే మెట్రో ప్రాజెక్టులివి.. 140 కిలోమీటర్ల దూరంగల ఐదు నూతన మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. 250 కిలోమీటర్ల దూరంగల మెట్రో లైన్లను రాబోయే రెండు సంవత్సరాలలో చేపట్టాలని ప్రతిపాదించడం జరిగింది.