‘సతర్క్ భారత్, సమృద్ధ్ భారత్’ ఇతివృత్తం తో సాగే నిఘా, అవినీతి నిరోధం అంశాలపై ఏర్పాటైన జాతీయ సమ్మేళనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సంవత్సరం అక్టోబర్ 27 న సాయంత్రం 4:45 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.
సమ్మేళనం ప్రారంభ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని https://pmindiawebcast.nic.in/ లింకు ద్వారా చూడవచ్చు.
పూర్వరంగం:
ప్రతి ఏటా అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 తేదీల మధ్య భారతదేశం లో ‘నిఘా చైతన్య వారోత్సవం’ కాలంలో ఈ జాతీయ సమ్మేళనాన్ని కేంద్ర దర్యాప్తు బ్యూరో నిర్వహిస్తూ వస్తోంది. ఈ సమ్మేళనం లో భాగంగా చేపట్టే కార్యకలాపాలపై నిఘా కు సంబంధించిన అంశాల మీద దృష్ఠి ని కేంద్రీకరించడం జరుగుతుంది. పౌరుల ప్రాతినిధ్యం ద్వారా ప్రజా జీవనంలో సమగ్రతను, నిజాయితీని ప్రోత్సహించడంలో భారతదేశ నిబద్ధత ను పునరుద్ఘాటించడం, తత్సంబంధిత జాగృతిని పెంపొందించడం ధ్యేయాలుగా ఈ కార్యకలాపాలు సాగుతాయి.
మూడు రోజుల పాటు కొనసాగే ఈ సమ్మేళనం లో భాగంగా- విదేశీ అధికార పరిధుల లో దర్యాప్తు క్రమం లో ఎదురయ్యే సవాళ్లు; అవినీతి ని అడ్డుకోవడానికి వ్యవస్థ పరంగా ఉన్న కట్టడి రూపం లో ప్రివెంటివ్ విజిలెన్స్ ను ఉపయోగించడం; వృద్ధి ని ముందుకు తీసుకుపోయేందుకు లెక్కల తనిఖీ (ఆడిట్) ని ప్రభావశీలమైన పద్ధతిలో ఉపయోగించడం; అవినీతి పై పోరాటం లో ఉత్తేజాన్ని ఇచ్చేందుకు అవినీతి నివారక చట్టం లో తాజాగా చేసిన సవరణ లు; సామర్థ్యం పెంపుదల- సిబ్బందికి శిక్షణ; త్వరిత గతి న, అధిక ప్రభావాన్ని కనబరచే దర్యాప్తు నకు తోడ్పడేటట్లుగా బహుళ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని నెలకొల్పడం; ఆర్థిక నేరాలలో కొత్త ధోరణులను, సైబర్ క్రైమ్స్ ను, దేశాల మధ్య చోటుచేసుకొంటున్న సంఘటిత నేరాలను నివారించే చర్యలు; నేర పరిశోధక సంస్థ ల మధ్య ఉత్తమ అభ్యాసాలను ఇచ్చి పుచ్చుకోవడం- వంటి అంశాలు చర్చ కు రానున్నాయి.
ఈ సమ్మేళనం విధాన రూపకర్తలను, విధానాల అమలు కు బాధ్యత వహించే వారిని ఒకే వేదిక మీదకు తీసుకురానుంది. అలాగే ఈ సమ్మేళనం వ్యవస్థాగత మెరుగుదల చర్యలు, నివారక సంబంధ నిఘా చర్యలను సూచించడం ద్వారా అవినీతిపై పోరాటానికి దోహదపడనుంది. అలా దోహదపడటం ద్వారా సుపరిపానలకు, బాధ్యతాయుత పాలన యంత్రాంగానికి బాట పరచనుంది. ఇది భారతదేశంలో వ్యాపారం చేయడంలో సౌలభ్యానికి తన వంతుగా చెప్పుకోదగిన తోడ్పాటును అందించే కారకం కానుంది.
ఈ సమ్మేళనం ప్రారంభ సమావేశం లో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధాన మంత్రి కార్యాలయం లో సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్ లు, అణు శక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింహ్ కూడా ప్రసంగించనున్నారు.
ఈ సమ్మేళనం లో పాలుపంచుకొనే వారిలో అవినీతి నిరోధక బ్యూరోలు, నిఘా బ్యూరో ల అధిపతులు, రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన ఆర్థిక నేరాల విభాగాలు/సిఐడి; సివిఒ లు, సిబిఐ అధికారులు, వివిధ కేంద్రీయ ఏజెన్సీల ప్రతినిధులు ఉంటారు. ప్రారంభ సమావేశానికి రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు, డిజిఎస్ పి లు కూడా హాజరు కానున్నారు.