ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్ పో - 2022’ ను జూన్ 9వ తేదీ న ఉదయం 10:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో ఆయన ప్రసంగ కార్యక్రమం కూడా ఉంటుంది.
బయోటెక్ స్టార్ట్-అప్ ఎక్స్ పో - 2022’ అనేది జూన్ 9వ మరియు 10వ తేదీల లో జరుగనున్న రెండు రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని బయోటెక్నాలజీ విభాగం మరియు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్ఎసి) లు ఏర్పాటు చేస్తున్నాయి. బిఐఆర్ఎసి స్థాపించి పది సంవత్సరాలు పూర్తి అయినందుకు గుర్తు గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘బయోటెక్ స్టార్ట్-అప్ ఇనొవేశన్స్: టువార్డ్ స్ ఆత్మనిర్భర్ భారత్’ అనే అంశం ఈ ఎక్స్ పో యొక్క ఇతివృత్తం గా ఉంది.
ఈ ఎక్స్ పో నవ పారిశ్రామికవేత్తల ను, పెట్టుబడిదారుల ను, పరిశ్రమ జగతి లో ప్రముఖుల ను, శాస్త్రవేత్తల ను, పరిశోధకుల ను, బయో-ఇంక్యూబేటర్ స్ ను, తయారీదారు సంస్థల ను, నియంత్రణదారు సంస్థల ను, ప్రభుత్వ అధికారుల ను మొదలైన వర్గాల ను కలిపేందుకు ఒక ప్లాట్ ఫార్మ్ గా పని చేస్తుంది. ఈ ఎక్స్ పో లో దాదాపు గా 300 స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టాల్స్ ద్వారా ఆరోగ్య సంరక్షణ, జీనోమిక్స్, బయోఫార్మా, వ్యవసాయం, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, వ్యర్థాల నుంచి విలువ ను సృష్టించడం, స్వచ్ఛ శక్తి తదితర విభిన్న రంగాల లో బయోటెక్నాలజీ ఉపయోగాన్ని కళ్ళ కు కట్టినట్లు వివరించడం జరుగుతుంది.