మధ్య ప్రదేశ్ లోని టేకన్‌పుర్ బిఎస్ఎఫ్ అకాడమీ లో జనవరి 7వ మరియు 8వ తేదీలలో డిజిపి లు మరియు ఐజిపి ల వార్షిక సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు కానున్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాల నుండి పోలీసు ఉన్నతాధికారులు ప్రతి సంవత్సరం ఒక చోటులో గుమికూడి భద్రతకు సంబంధించిన అంశాల పైన చర్చలు జరిపే కార్యక్రమమే ఈ డిజిపి ల యొక్క సమావేశం. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంతకు ముందు 2014వ సంవత్సరంలో అసమ్ లోని గువాహాటీ లోను, 2015లో గుజరాత్ లోని రణ్ ఆఫ్ కచ్ఛ్ లోను మరియు 2016వ సంవత్సరంలో హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమీ లోను జరిగినటువంటి ఈ తరహా సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
గత సమావేశం సందర్భంగా, సీమాంత ఉగ్రవాదంతో పాటు సమూల సంస్కరణ వాదం వంటి అంశాలపై క్షుణ్నంగా చర్చించారు. నాయకత్వం, నైపుణ్యం ఇంకా సామూహిక శిక్షణ అంశాల యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. సాంకేతిక విజ్ఞానానికి మరియు హ్యూమన్ ఇంటర్ ఫేస్ కు పోలీసు బలగాలు పెద్ద పీట వేయవలసిన అవసరాన్ని గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
డిజిపి ల వార్షిక సమావేశాన్ని దేశ రాజధాని నగరం ఢిల్లీకి వెలుపల నిర్వహించడం- ఆ తరహా సమావేశాలను ఒక్క ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయకుండా దేశంలోని అన్ని మూలలా నిర్వహించాలన్న ప్రధాన మంత్రి దార్శనికతకు అనుగుణంగా- ఉంది.