ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు గువాహాటీ లో జరిగే అడ్వాంటేజ్ అస్సాం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018 ప్రారంభ సదస్సు లో ప్రసంగించనున్నారు.
రెండు రోజుల పాటు సాగే ఈ శిఖర సమ్మేళనం అస్సాం ప్రభుత్వం చేపడుతున్న అతి పెద్ద పెట్టుబడుల ప్రోత్సాహక, సమన్వయ కార్యక్రమం. అస్సాం పెట్టుబడిదారులకు ఇవ్వజూపుతున్న భౌగోళిక, వ్యూహాత్మక ప్రయోజనాలను చాటిచెప్పడం ఈ సమిట్ ముఖ్యోద్దేశం. దక్షిణాసియా మరియు ఆగ్నేయ ఆసియా లలో వర్ధిల్లుతున్న ఆర్ధికవ్యవస్థలకు అస్సాం అందజేయగల ఎగుమతి ప్రధానమైన తయారీ మరియు సేవల రంగ అవకాశాలను ఈ కార్యక్రమం కళ్లకు కడుతుంది.
అస్సాం రాష్ట్రం శ్రద్ధ వహిస్తున్న విద్యుత్తు, వ్యవసాయం, ఫూడ్ ప్రాసెసింగ్, ఐటి & ఐటి ఆధారిత సేవలు, నదీ రవాణా & పోర్ట్ టౌన్ షిప్ లు, ప్లాస్టిక్స్ & పెట్రోకెమికల్స్, ఫార్మస్యూటికల్స్ & మెడికల్ ఎక్విప్ మెంట్, చేతిమగ్గాలు, వస్త్రాలు & హస్తకళలు, పర్యాటకం, హాస్పిటాలిటి & వెల్ నెస్, పౌర విమానయానం మరియు పెట్రోలియం – సహజ వాయువు రంగాలలో పెట్టుబడి అవకాశాలను ఈ శిఖర సమ్మేళనం వివరించనుంది.