ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం నాడు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 80 మందికిపైగా అదనపు, సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఇలాంటి ఐదు భేటీల నిర్వహణకు నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా మూడో అన్యోన్య సమావేశం పూర్తయింది. వ్యవసాయం, తాగునీరు, పౌర కేంద్రక పరిపాలన, ఆవిష్కరణ, పాలనలో సామూహిక కృషి, ప్రాజెక్టుల అమలు, విద్య, తయారీ రంగం, అంతర్గత భద్రత, సౌరశక్తి వంటి అంశాలపై ఈ సమావేశంలో తమ అనుభవాలను అధికారులు పరస్పరం పంచుకున్నారు.
ఆ తర్వాత ప్రధానమంత్రి స్పందిస్తూ- ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం తాను చేపట్టిన వినూత్న కార్యక్రమం "ప్రగతి" గురించి ప్రస్తావించారు. తయారీ రంగంపై మాట్లాడుతూ- దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థ ఇకపై వైద్య పరికరాల తయారీపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి సూచించారు.
ప్రభుత్వం ఒక "సజీవ వ్యవస్థ"గా రూపొందాలంటే పాలనలో సానుకూల పని వాతావరణం నిర్వహించాల్సిన ప్రాముఖ్యాన్ని ప్రధాని నొక్కిచెప్పారు.
కొత్త చట్టాలు చేసినందువల్ల పాత చట్టాలను సమీక్షించి అనవసరమని భావిస్తే రద్దు చేయాలని ఆయన చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా భారత్‌పై సానుకూల వాతావరణం నెలకొనడాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- 2022నాటికల్లా నవ భారత రూపకల్పనకు తగిన సుస్పష్ట లక్ష్యాలతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
దేశంలో అత్యంత వెనుకబడిన 100 జిల్లాలపై నిశితంగా దృష్టి సారించాలని, తద్వారా వివిధ అభివృద్ధి పారామితుల మేరకు వాటి ప్రగతిని జాతీయ సగటు స్థాయికి చేర్చాలని కోరారు