ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇండోనేశియా, మలేశియా మరియు సింగపూర్ లకు బయలుదేరి వెళ్ళే ముందు విడుదల చేసిన ప్రకటన పాఠం ఈ కింది విధంగా ఉంది.
‘‘నేను 2018 మే నెల 29 నుండి జూన్ నెల 2వ తేదీ మధ్య కాలంలో ఇండోనేశియా, మలేశియా, ఇంకా సింగపూర్ లలో పర్యటించనున్నాను. ఈ మూడు దేశాలతో భారతదేశం ఒక బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగివుంది.
ఇండోనేశియా అధ్యక్షులు శ్రీ జోకో విడోడో ఆహ్వానించిన మీదట నేను మే నెల 29వ తేదీ నాడు జకార్తా ను సందర్శించనున్నాను. ప్రధాన మంత్రి గా ఇది ఇండోనేశియా లో నా ఒకటో పర్యటన. మే 30వ తేదీ నాడు అధ్యక్షులు శ్రీ విడోడో తో నేను జరపబోయే చర్చలతో పాటు ఇండియా-ఇండోనేశియా సిఇఓస్ ఫోరమ్ తో సంయుక్త సమావేశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇండోనేశియా లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి నేను ప్రసంగించనున్నాను.
భారతదేశం మరియు ఇండోనేశియా లు పటిష్టమైన మరియు మైత్రీ పూర్వకమైన సంబంధాలను కలిగివున్నాయి. గాఢతరమైనటువంటి చారిత్రక మరియు నాగరక సంబంధిత బంధాలను కూడా పెనవేసుకొన్నాయి. ఇరు దేశాలు బహుళ జాతులతో, బహుళ మతాలతో కూడిన బహుత్వవాద సంబంధి, స్వేచ్ఛాయుతమైనటువంటి సమాజాలు కూడాను. ఇండోనేశియా లో నా పర్యటన ఆసియా లోకెల్లా అతి పెద్దవైన రెండు ప్రజాస్వామ్య వ్యవస్థల మధ్య మరింత సమన్వయానికి బాటను పరచడమే కాకుండా ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నతీకరించగలదని కూడా నేను విశ్వసిస్తున్నాను.
మే నెల 31వ తేదీ నాడు సింగపూర్ కు వెళుతూ, మార్గమధ్యంలో కొద్దిసేపు మలేశియా లో ఆగి, మలేశియా లోని నూతన నాయకత్వానికి నా అభినందనలను తెలియజేస్తాను; ప్రధాని డాక్టర్ మహాతిర్ మొహమద్ తో భేటీ కావడం కోసం నేను నిరీక్షిస్తున్నాను.
సింగపూర్ లో నైపుణ్యాల అభివృద్ధి, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన ప్రణాళిక రచన, ఫిన్‌టెక్ మరియు ఆర్టిఫీశియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో భారతదేశం- సింగపూర్ భాగస్వామ్యాన్ని ఇనుమడింపజేసుకోవడం పట్ల నేను శ్రద్ధ ను వహిస్తాను. పట్టణాభివృద్ధి, ప్రణాళిక రచన, స్మార్ట్ సిటీస్ ఇంకా అవస్థాపన అభివృద్ధి వంటి రంగాలలో సింగపూర్ కు చెందిన సంస్థలు భారతదేశానికి పెద్ద భాగస్వాములుగా మారాయి. సింగపూర్ లో నేను జరిపే పర్యటన ఉభయ దేశాలు మరింత ముందుకు సాగిపోవడానికి ఒక అవకాశాన్ని అందించగలదు.
మే నెల 31వ తేదీ నాడు నేను ఇండియా-సింగపూర్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇనవేశన్ ఎగ్జిబిశన్ ను సందర్శిస్తాను. వ్యాపార అవకాశాలు మరియు పెట్టుబడి అవకాశాల పై సింగపూర్ కు చెందిన ఎంపిక చేసిన అగ్రగామి సిఇఒ లతో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పాలుపంచుకొన్న అనంతరం నేను వ్యాపార ప్రముఖుల కార్యక్రమం లో మరియు సాముదాయిక కార్యక్రమం లో ప్రసంగిస్తాను.
జూన్ నెల 1వ తేదీ నాడు నేను మాన్యురాలైన సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకబ్ గారితో భేటీ అవుతాను. నేను సింగపూర్ ప్రధాని శ్రీ లీ తో ప్రతినిధివర్గ స్థాయి చర్చలలో కూడా పాలుపంచుకొంటాను. అలాగే, నాన్‌యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ సందర్శనకై వేచి వుంటాను. అక్కడి యువ విద్యార్థులతో నేను మమేకం అవుతాను.
ఆ రోజు సాయంత్రం పూట, నేను శాంగ్రి-లా డైలాగ్ కార్యక్రమంలో ప్రధానోపన్యాసం చేస్తాను. ఒక భారతీయ ప్రధాన మంత్రి ఈ ప్రసంగాన్ని ఇవ్వడం ఇదే తొలి సారి కానుంది. ప్రాంతీయ భద్రత అంశాలు మరియు ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల పరిరక్షణ తాలూకు భారతదేశం యొక్క దృష్టి కోణాన్ని వివరించేందుకు ఇది ఒక అవకాశం.
జూన్ నెల 2వ తేదీ నాడు నేను క్లిఫర్డ్ పియర్ లో ఒక ఫలకాన్ని ఆవిష్కరిస్తాను. గాంధీ మహాత్ముని అస్థికలను 1948 మార్చి నెల 27వ తేదీ నాడు సముద్రం లో నిమజ్జనం చేసిన ప్రదేశం ఇదే. నేను భారతదేశంతో నాగరకతపరమైన అనుబంధం ఉన్నటువంటి కొన్ని ప్రార్థన స్థలాలను కూడా సందర్శిస్తాను.
నా పర్యటన కార్యక్రమంలో కడపటి అంశం సింగపూర్ లోని చాంగీ నౌకాదళ స్థావరాన్ని సందర్శించడం. అక్కడ నేను భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సాత్‌పురా ను సందర్శిస్తాను. భారతీయ నౌకాదళం మరియు రాయల్ సింగపూర్ నేవీ కి చెందిన అధికారులతోను, నావికులతోను నేను సంభాషించనున్నాను.
ఇండోనేశియా, మలేశియా మరియు సింగపూర్ లలో నేను జరిపే పర్యటన మన యొక్క ‘యాక్ట్ ఈస్ట్ పోలిసి’ కి మరింత ఉత్తేజాన్ని అందజేయడంతో పాటు ఈ మూడు దేశాలతో మన సంబంధాలను మరింత పెంపొందించగలదని కూడా నేను నమ్ముతున్నాను.’’