గోవాలో 2016 అక్టోబర్ 15వ, 16వ తేదీలలో జరగనున్న 8వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం, ఇంకా ప్రప్రథమ బ్రిక్స్- బిమ్స్ టెక్ అవుట్ రీచ్ సమిట్ లలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాలకు హాజరు కావలసిందిగా బ్రిక్స్ మరియు బిమ్స్ టెక్ దేశాల నాయకులను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.
ఫేస్ బుక్ అకౌంట్ లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఈ కింది విధంగా రాశారు:
“గోవాలో 2016 అక్టోబర్ 15వ, 16వ తేదీలలో జరుగనున్న 8వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి, మొట్టమొదటి బ్రిక్స్- బిమ్స్ టెక్ అవుట్ రీచ్ సమిట్ కు ఆతిథ్యం ఇవ్వనుండడం భారతదేశానికి ఎంతో సంతోషంగా ఉంది. బ్రిక్స్ మరియు బిమ్స్ టెక్ సభ్యత్వ దేశాల నాయకులకు సాదర స్వాగతం పలికేందుకు నేను ఎదురుచూస్తున్నారు. గోవాలో జరిగే భారతదేశం- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ కు, ద్వైపాక్షిక పర్యటనకుగాను విచ్చేస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ మైకల్ టేమర్ కు స్వాగతం పలికే గౌరవం కూడా నాకు లభించనుంది.
అధ్యక్షుడు శ్రీ పుతిన్ పర్యటన, రష్యాతో కాల పరీక్షకు తట్టుకొని నిలచిన విశిష్ట మైత్రిని, భాగస్వామ్యాన్ని సుదృఢపరచుకోవడానికి మాకు ఒక అవకాశాన్ని కల్పించనుంది. అధ్యక్షుడు శ్రీ టేమర్ పర్యటన వ్యూహాత్మకంగా ముఖ్యమైన భాగస్వామ్యదేశమైన బ్రెజిల్ తో సహకారానికి నూతన అవకాశాలను అందించబోతోంది.
చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ , రష్యాల నుండి వచ్చే నా సాటి నాయకులతో మా లక్ష్యాలకు అడ్డుగా నిలుస్తున్న అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సవాళ్లను పరిష్కరించుకోవడంపై చక్కని ప్రయోజనకరం కాగల సంభాషణలు జరపాలని నేను వేచి ఉన్నాను.
ఈ సంవత్సరం బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారతదేశం వ్యాపారం, క్రీడలు, విద్య, చలనచిత్రాలు, స్కాలర్ షిప్ లు, ఇంకా పర్యటన వంటి విభిన్న రంగాలలో ప్రజలకు- ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందించడానికి అగ్ర ప్రాధాన్యాన్ని ఇవ్వనుంది.
సమష్టి, సమ్మిళిత మరియు ప్రతిస్పందన పూర్వక పరిష్కార మార్గాలను కనుగొనేందుకు మనం చేసే ప్రయత్నాలలో మన ప్రజలు ప్రధాన పాత్రలు పోషిస్తారని విశ్వసిస్తున్నాను. బ్రిక్స్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు, ది కంటిజంట్ రిజర్వ్ అరెంజ్ మెంట్ ల వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయగలగడంతో పాటు మనం గోవాలో కొన్ని కొత్త కార్యక్రమాలను కూడా ప్రారంభించబోతున్నాము.
బ్రిక్స్ సభ్యత్వ దేశాల మధ్య సహకారాన్ని బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం పటిష్ట పర్చడమే కాకుండా, అభివృద్ధి, శాంతి, సుస్థిరత్వం, సంస్కరణలతో కూడిన మన ఉమ్మడి కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లగలదన్న ఆశాభావంతో నేను ఉన్నాను.
బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయ్ లాండ్ ల కు చెందిన బిమ్స్ టెక్ నాయకులతో ఒక అవుట్ రీచ్ సమిట్ కు భారతదేశం సారథ్యం వహిస్తుండడం నాకు ఆనందాన్నిస్తోంది.
మానవ జాతిలో సుమారు మూడింట రెండు వంతుల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న మనం, ఈ శక్తిని పరస్పర సహకారం కోసం వినియోగించుకోగలమని, ఈ ప్రయత్నం అనేక లాభాలను అందించగలదని మనం ఆశిద్దాం.
సుదీర్ఘ కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న మన సమస్యలకు పరిష్కారాలను అన్వేషించడంలో ఉమ్మడి సంకల్పాన్ని, నూతన భాగస్వామ్యాలను ఏర్పరచడానికి సేతువులను నిర్మించడం కోసం భారతదేశం సన్నద్ధంగా ఉంది."