ఉప రాష్ట్రపతి శ్రీ హమీద్ అన్సారీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. రాజ్య సభ ఛైర్మన్ గా తన విధులను 10 సంవత్సరాల పాటు నిర్వర్తించాలంటే అన్ని సందర్భాలలోను ప్రశాంతంగా ఉండి తీరాలని, ఈ పనిని ఆయన (శ్రీ హమీద్ అన్సారీ) నెరవేర్చిన తీరులో ఆయన యొక్క ప్రావీణ్యం, ఓర్పు మరియు మేధాశక్తి ప్రతిబింబించాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
శ్రీ హమీద్ అన్సారీ కి వీడ్కోలు ఇచ్చేందుకు పార్లమెంటులో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాన మంత్రి పాల్గొని ప్రసంగిస్తూ, శ్రీ అన్సారీ యొక్క సుదీర్ఘమైన ప్రజా జీవనం ఎటువంటి వివాదం లేకుండా సాగిపోయిందని పేర్కొన్నారు.
శ్రీ అన్సారీ కుటుంబం తరాల తరబడి ప్రజా జీవనంలో గడిపినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. మరీ ముఖ్యంగా బ్రిగేడియర్ శ్రీ ఉస్మాన్ ను ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. 1948లో దేశ రక్షణ కోసం బ్రిగేడియర్ శ్రీ ఉస్మాన్ ప్రాణ సమర్పణం చేశారు.
రాజ్య సభను నడపడంలో బహుకాలిక అనుభవం ఉన్న శ్రీ అన్సారీ ఎగువ సభ పనితీరును మరింత కార్య సాధకంగా ఎలా మలచవచ్చో అనే అంశంపై తన ఆలోచనలను అక్షరీకరించాలని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా సూచించారు.