ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
గవర్నర్లందరూ రాజ్యాంగం మాన్యతను పరిరక్షిస్తూనే సమాజంలో మార్పును తీసుకురాగల ఉత్ప్రేరక కారకాల పాత్రను కూడా పోషించగలరన్న అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి వ్యక్తంచేశారు. 2022 కల్లా ‘న్యూ ఇండియా’ ఆవిష్కరణ లక్ష్యాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రజలు పాలు పంచుకొనే ఒక ఉద్యమంగా తీర్చిదిద్దితేనే ఈ లక్ష్యాన్ని సాధించగలమని వివరించారు.
ఈ విషయంలో ఉపాధ్యాయులతో, విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించవలసిందిగా గవర్నర్లను ఆయన ప్రోత్సహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన హ్యాకథాన్ ను ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. (హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులు అనేక సమస్యలకు సాంకేతిక పరమైన పరిష్కార మార్గాలను సూచించారు.) విశ్వవిద్యాలయాలు నూతన ఆవిష్కారాలకు నిలయాలుగా తయారుకావాలని ప్రధాన మంత్రి చెప్పారు.
ప్రతి రాష్ట్రంలోని యువతీ యువకులు ఏదైనా ఒక క్రీడ విషయంలో శ్రద్ధ వహించి తీరాలని కూడా ప్రధాన మంత్రి కోరారు. స్వచ్ఛత విషయంలో గవర్నర్లు నాయకత్వ స్థానంలో ఉండి, దీనిని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి అన్నారు. 2019లో మహాత్మ గాంధీ 150వ జయంతిని జరుపుకోబోతున్నామంటూ, బహిరంగ మలమూత్ర విసర్జనకు తావు లేనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు పని చేస్తున్న మనకు ఆయనే స్ఫూర్తి మూర్తి అని ప్రధాన మంత్రి చెప్పారు. మార్పు కోసం చేస్తున్న అన్వేషణలో పండుగలు మరియు జయంతులు గొప్ప శక్తిని అందించే ప్రేరక సాధనాలుగా ఉంటాయని ప్రధాన మంత్రి అన్నారు. ఆదివాసీలకు, దళితలకు, ఇంకా మహిళలకు ‘ముద్రా’ రుణాలు ఇచ్చేటట్లు బ్యాంకులకు ప్రత్యేకించి రాజ్యాంగ దినమైన నవంబర్ 26 నుండి అంబేడ్కర్ మహాపరినిర్వాణ దివస్ గా జరుపుకొనే డిసెంబర్ 6వ తేదీ మధ్య కాలంలో ప్రేరణను గవర్నర్లు అందించవచ్చునని కూడా ఆయన అన్నారు.
సౌర శక్తి, డిబిటి లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలను కిరోసిన్ రహితంగా తీర్చిదిద్దడంలో అనుసరించిన ఉత్తమ పద్ధతులను కేంద్ర పాలిత ప్రాంతాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవాలని, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గవర్నర్లకు ప్రధాన మంత్రి సూచించారు. ఈ విధమైన విజయాలను శీఘ్ర గతిన కేంద్రపాలిత ప్రాంతాలన్నింటికీ విస్తరించాలని ఆయన స్పష్టం చేశారు.
.