ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు (20019 జూన్ 15)న న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో జరిగిన నీతి ఆయోగ్ ఐదవ పాలక మండలి సమావేశం లో ప్రారంభోపన్యాసం చేశారు.
జమ్ము & కశ్మీర్ గవర్నర్ కు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కు, అండమాన్ ఎండ్ నికోబార్ దీవుల లెఫ్టెనంట్ గవర్నర్ కు, ఇతర ప్రతినిధుల కు ప్రధాన మంత్రి స్వాగతం పలుకుతూ, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే మంత్రాన్ని కార్యరూపం లోకి తీసుకు రావడం లో నీతి ఆయోగ్ కీలక పాత్ర వహించవలసివుందన్నారు.
ఇటీవల దేశం లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ను ప్రపంచం లోని అతి పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియ గా అభివర్ణించిన ప్రధాన మంత్రి , ఇక ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధి కి కృషిచేయాల్సిన సమయం ఇది అన్నారు. పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింస తదితరాలపై ఉమ్మడి పోరు సాగించాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
ఈ వేదిక మీద ఉన్నవారందరి కి ఒక ఉమ్మడి లక్ష్యం ..2022వ సంవత్సరం కల్లా న్యూ ఇండియా లక్ష్యాన్ని సాధించడం.. అనేది ఉన్నదని ప్రధాన మంత్రి అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ల వంటివి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సాధించగలిగిన వాటికి ఉదాహరణలు గా నిలుస్తాయని కూడా ప్రధాన మంత్రి అన్నారు.
ప్రతి భారతీయుడి కి సాధికారిత ను, సులభతర జీవనాన్ని కల్పించవలసివుందని ప్రధాన మంత్రి చెప్పారు. మహాత్మ గాంధీ 150వ జయంతి ని పురస్కరించుకుని నిర్దేశించుకున్న లక్ష్యాల ను అక్టోబర్ 2వ తేదీ కల్లా సాధించాలని, అలాగే 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవమైన 2022వ సంవత్సరం కల్లా సాధించవలసిన లక్ష్యాల దిశ గా గట్టి గా కృషి చేయాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల సాధన కు సమష్టి బాధ్యత పై దృష్టి సారించవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి పలికారు.
2024 సంవత్సరం నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దడం సవాలు తో కూడుకున్నదని, అయితే దీని ని తప్పకుండా సాధించగలమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రాలు వాటికి గల కీలక శక్తి సామ ర్థ్యాల ను గుర్తించి , జిల్లా స్థాయి నుండే జిడిపి లక్ష్యాల పెంపుదల దిశ గా పని చేయాలని ప్రధాన మంత్రి సూచించారు.
వర్ధమాన దేశాల ప్రగతి లో ఎగుమతుల రంగం కీలక పాత్ర ను పోషిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొంటూ, తలసరి ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎగుమతులను పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల తో సహా చాలా రాష్ట్రాల లో ఎగుమతుల పెంపుదల కు అవకాశాలు ఉండి కూడా ఉపయోగించని సందర్భాలు ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రాల స్థాయి లో ఎగుమతుల పెంపు పై పెట్టే ప్రత్యక దృష్టి అటు ఆదాయం పెంపుదల కు, ఉపాధి అవకాశాల పెరుగుదల కు దోహదపడతాయని ప్రధాన మంత్రి చెప్పారు.
జీవనాని కి జలం ఎంతో కీలకం అని ప్రధాన మంత్రి చెప్తూ, నీటి సంరక్షణ కృషి తగినంతగా జరగక పోతే దాని వల్ల పేదలు ఇబ్బందులు పడతారన్నారు. కొత్త గా ఏర్పాటు చేసిన జల శక్తి మంత్రిత్వశాఖ జలం విషయం లో సమీకృత విధానాని కి దోహదపడుతుందని ప్రధాన మంత్రి చెప్పారు. జల సంరక్షణ, నీటి యాజమాన్యం ల వంటి వాటి విషయం లో రాష్ట్రాలు వాటి కృషి ని సమీకృతం చేయాలని ప్రధాన మంత్రి కోరారు. అందుబాటు లోని నీటి సక్రమ నిర్వహణ అత్యావశక్యమని ఆయన అన్నారు. 2024 నాటి కి గ్రామీణ ప్రాంతాల లోని ప్రతి ఇంటి కి గొట్టాల ద్వారా మంచినీటి ని సరఫరా చేయడం తమ లక్ష్యమని చెప్పారు. నీటి సంరక్షణ, భూ గర్భ నీటి మట్టాల పెంపు పై దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి సూచించారు. జల సంరక్షణ, నీటి యాజమాన్యం ల విషయం లో వివిధ రాష్ట్రాలు సాగిస్తున్న కృషిని ప్రధాన మంత్రి అభినందించారు. జల సంరక్షణ, నీటి నిర్వహణ లకు సంబంధించి నమూనా భవన నిర్మాణ నిబంధన ల వంటి నియమ నిబంధనల అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన లో భాగం గా జిల్లా నీటిపారుదల పథకాల ను జాగ్రత్త గా అమలు చేయాలని ప్రధాన మంత్రి సూచించారు.
కరవు పరిస్థితుల ను ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ప్రతి చుక్క నీటి కి మరింత పంట విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
2022వ సంవత్సరాని కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి వుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, ఇందుకు మత్స్య రంగం, పశు సంవర్ధకం, పండ్ల తోటల పెంపకం, కూరగాయల సాగు లపై దృష్టి పెట్టాలన్నారు. పిఎం కిసాన్, కిసాన్ సమ్మాన్ నిధి, ఇంకా రైతు కేంద్రం గా గల ఇతర పథకాలు సకాలం లో సంబంధిత రైతుల కు అందేటట్టు చూడాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగం లో మౌలిక సంస్కరణల అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ కార్పొరేట్ పెట్టుబడులు పెరగాలని, సదుపాయాలు బలోపేతం కావాలని, తగినంత గా మార్కెట్ మద్దతు ఉండాలని చెప్పారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే ఫూడ్ ప్రాసెసింగ్ రంగం వేగం గా అభివృద్ధి సాధించాలన్నారు.
ఆకాంక్షభరిత జిల్లాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, సుపరిపాలన పై దృష్టి పెట్టాలన్నారు. పలు ఆకాంక్షభరిత జిల్లాల లో పాలన లో మెరుగుదల గణనీయమైన ప్రగతి కి దోహదపడిందని ప్రధాన మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రధాన మంత్రి పలు ఉదాహరణలు ఇస్తూ, మూస పద్ధతి కి భిన్నమైన ఆలోచనలు, వినూత్న పద్ధతి లో సేవలు అందుబాటు లోకి తేవడం వంటి చర్యల ద్వారా కొన్ని ఆకాంక్షభరిత జిల్లాలు అద్భుతమైన ఫలితాలు సాధించాయని చెప్పారు. పలు ఆకాంక్షభరిత జిల్లాలు నక్సలైట్ల హింస వల్ల ప్రభావితమయ్యాయని ఆయన అన్నారు. నక్సలైట్ల హింస కు వ్యతిరేకం గా పోరాటం ప్రస్తుతం నిర్ణయాత్మక దశ కు చేరుకున్నట్లు ప్రధాన మంత్రి చెప్పారు. ఈ జిల్లాల లో అభివృద్ది త్వరితగతి న, సమతుల్యత తో సాగుతున్నదని, హింస పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు.
ఆరోగ్య రంగాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, 2022వ సంవత్సరానికల్లా సాధించవలసిన పలు లక్ష్యాల ను మనస్సు లో ఉంచుకోవలసివుందన్నారు. 2025వ సంవత్సరం కల్లా టి బి నిర్మూలన లక్ష్యాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగం గా ఇప్పటివరకు పిఎం జెఎవై ని ఇంకా అమలు చేయని రాష్ట్రాలు వీలైనంత త్వరగా ఈ పథకం లోకి రావాలని ప్రధాన మంత్రి కోరారు. ప్రతి నిర్ణయాని కి హెల్త్, వెల్ నెస్ లు ప్రధానాంశాలుగా ఉండాలని ప్రధాన మంత్రి సూచించారు.
ప్రస్తుతం మనం పనితీరు, పారదర్శకత, లక్ష్యాల అమలు వంటి వాటి పై ఆధారపడిన పాలనా వ్యవస్థ దిశ గా ముందుకు సాగుతున్నామని ప్రధాన మంత్రి చెప్పారు. వివిధ పథకాలు , నిర్ణయాలు సరైన రీతి లో అమలు చేయడం ముఖ్యమని ప్రధాన మంత్రి అన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ , ప్రజల కోసం పని చేసే ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణాని కి నీతి ఆయోగ్ పాలక మండలి లోని సభ్యులంతా సహకరించాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.