శీతోష్ఠ స్థితి అంశంపై
తన ప్రారంభిక సమావేశాన్ని గుర్తుకుతెస్తూ, తాను అతి సాధారణమైనటువంటి స్థాయిలో న్యూ ఇండియా ఆవిష్కరణ సంబంధిత దార్శనికతను గురించి, ఇంకా.. 5000 సంవత్సరాల క్రితం రాయబడిన వేదాలను గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. ప్రకృతిని ఆవు నుండి పాలు పితికే తరహాలో వాడుకోవడాన్ని వేదాలు అనుమతించాయని, అయితే ప్రకృతిని లూటీ చేయడాన్ని మాత్రం అనుమతించలేదన్నారు.
మూడు రోజుల కిందట జర్మనీలో తనను ఈ ప్రశ్న అడిగారంటూ, ఆ వేళ తాను పారిస్ ఒడంబడిక ఉన్నా లేకపోయినా శుద్ధమైన భూగ్రహాన్ని, స్వచ్ఛమైన గాలి కలిగిన భూగ్రహాన్ని మన పిల్లలకు ఇవ్వాలన్న సంప్రదాయాన్ని భారతదేశం అనుసరిస్తూ వచ్చిందని, అలా చేసినప్పుడు మాత్రమే వారు చక్కగా జీవించగలుగుతారని చెప్పానని ప్రధాన మంత్రి అన్నారు. ఇక్కడ సమస్య ఒక వైపు ఉండడమా, లేక వేరే వైపు ఉండడమా అన్నది కాదని, ఇంకా పుట్టని తరాల వైపున నిలవాలన్నది ప్రధానమని ఆయన స్పష్టంచేశారు.
భారత-రష్యా సంబంధాల అంశంపైనా మరియు చైనా అంశంపైనా
ప్రపంచం కొన్ని దశాబ్దాల క్రితం మాదిరిగా రెండు ధ్రువాలతో కూడుకొన్నదిగా ఇక ఎంతమాత్రం లేదని ప్రధాన మంత్రి అన్నారు. మనం ప్రపంచ సంబంధాలను గురించి చర్చించేటప్పుడు, ఈ ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో మరొకటి ముడివేసుకొని ఉన్నాయని, ఒక దేశం పైన మరొక దేశం ఆధారపడి ఉన్నాయన్న సంగతిని అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. ప్రతి దేశం మరొక దేశంతో ఏదో ఒక రకంగా అనుసంధానమై ఉందని, అయితే కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలతో పాటు సహకరించుకొనే అంశాలు కూడా ఉండకపోవన్నారు.
భారతదేశానికి, రష్యాకు మధ్య సంబంధాలు బలంగా ఉన్నట్లు పునరుద్ఘాటిస్తూ, ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవడం కోసం సెయింట్ పీటర్స్ బర్గ్ డిక్లరేషన్ ను యావత్తు ప్రపంచం శ్రద్ధగా చదివి, మేం ఎలా ముందుకుపోయామన్నది
గమనించాలని ప్రధాన మంత్రి అన్నారు.
చైనాతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ, గత నలభై సంవత్సరాలలో సరిహద్దు వెంబడి ఒక్క తుపాకి గుండయినా కాల్చడం జరగలేదని ప్రధానమంత్రి చెప్పారు. ఆర్థిక సంబంధాలు విస్తరిస్తున్నాయని తెలిపారు. ఏ రెండు దేశాల మధ్య సంబంధాన్నయినా మూడో పట్టకంలో నుండి చూడకూడదని ఆయన చెప్పారు. బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) లో సభ్యత్వ దేశాలన్నీ ఉమ్మడిగా పనిచేస్తున్నాయన్నారు. ఈ సందర్భంలో ఆయన బ్రిక్స్ బ్యాంకు ను ఒక ఉదాహరణగా ప్రస్తావించారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ (అందరితోనూ కలిసి.. అందరి వృద్ధికోసం) అనే సూత్రాన్ని భారతదేశం విశ్వసిస్తోందంటూ, మేం అభివృద్ధి బాటలోకి ప్రతి ఒక్కరినీ కలుపుకువెళ్లాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై
ఎనభైలు, తొంభైలలో ప్రపంచం ఉగ్రవాదాన్ని, అది రువ్విన అపాయాలను పూర్తిగా గ్రహించలేకపోయిందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం గత నలభై సంవత్సరాలుగా సీమాంతర ఉగ్రవాద బాధితురాలుగా మిగిలినట్లు ఆయన చెప్పారు. 9/11 ఉదంతం తరువాత మాత్రమే ప్రపంచం ఉగ్రవాదపు నిజమైన భీతిని అర్థం చేసుకొందని, ఉగ్రవాదానికి సరిహద్దులంటూ లేవన్న వాస్తవాన్ని గ్రహించిందని ఆయన అన్నారు.
ప్రపంచాన్ని ఉగ్రవాదం బారి నుండి రక్షించాలంటే మానవీయ శక్తులు అన్నీ ఒక్కటి
కావలసిన తక్షణ అవసరం ఉందని ప్రధాన మంత్రి చెప్పారు.
గత నలభై సంవత్సరాలుగా ఐక్య రాజ్య సమితి ఉగ్రవాదం యొక్క నిర్వచనంపై ఏకీభావానికి రాలేకపోవడం శోచనీయమని ప్రధాన మంత్రి అన్నారు. నిన్న ప్రెసిడెంట్ శ్రీ పుతిన్ తాను ఈ అంశాన్ని ఐక్య రాజ్య సమితిలో ప్రస్తావిస్తానంటూ చేసిన వక్కాణింపును ప్రధాన మంత్రి స్వాగతించారు.
ఉగ్రవాదులు ఆయుధాలను తయారు చేయడం గాని, లేదా కరెన్సీని ముద్రించడం గాని చేయలేరని ప్రధాన మంత్రి చెబుతూ, ఉగ్రవాదులు వీటిని కొన్ని దేశాల వద్ద నుండి పొందుతున్నారన్నది స్పష్టమవుతోందన్నారు. ఈ సమస్య మానవ జాతికి ఆందోళనను కలిగిస్తున్న సమస్య అనే విషయాన్ని యావత్తు ప్రపంచం ఆకళింపు చేసుకోవాలని, అది జరిగినప్పుడే మనం ఉగ్రవాదాన్ని తోసిరాజనగలమని ఆయన చెప్పారు.
ప్రపంచ వ్యాపారం అంశంపై
భారతదేశం ఆంక్షలకు తావు లేని ఆర్థిక వ్యవస్థ పై నమ్మకం ఉంచుతోందని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రపంచ వ్యాపారంలో, అన్ని దేశాలు ఒక దేశం కోసం మరొక దేశం సర్దుబాట్లు చేస్తాయని, దేశాలన్నీ ఒకటికి మరొకటి సహాయం చేసుకోవాలని ఆయన అన్నారు.