భారత ప్రభుత్వం లోని వివిధ మంత్రిత్వ శాఖలలోనూ, విభాగాలలోనూ పని చేస్తున్న డైరెక్టర్లు, ఇంకా డిప్యూటీ సెక్రటరీలు దాదాపు 380 మందితో కూడిన నాలుగు బృందాలతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై చర్చ జరిపారు. ఈ ముఖాముఖి చర్చలు 2017 అక్టోబర్ నెలలో వేరు వేరు రోజులలో సాగాయి. వీటిలో కడపటి సంభాషణ 2017, అక్టోబర్ 17వ తేదీన చోటు చేసుకొంది. ప్రతి సమావేశం సుమారు రెండు గంటల పాటు కొనసాగింది.
ముఖాముఖి చర్చలలో.. పరిపాలన, అవినీతి, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వానికి చెందిన ఇ-మార్కెట్ ప్లేస్, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, వ్యవసాయం, రవాణా, జాతీయ సమైక్యత, జల వనరులు, స్వచ్ఛ భారత్, సంస్కృతి, కమ్యూనికేషన్ మరియు పర్యటన ల వంటి అంశాలపై చర్చలు జరిగాయి.
2022 కల్లా ‘న్యూ ఇండియా’ ఆవిష్కారం దిశగా పూర్తి అంకిత భావంతో పని చేయాలని అధికారులకు ప్రధాన మంత్రి ఉద్బోధించారు. కేంద్ర ప్రభుత్వం పనితీరులో గిరి గీసుకొని ఉండడం అనేది ఒక పెద్ద ప్రతిబంధకంగా ఉందని ఆయన అన్నారు. ఈ అడ్డుగోడలను ఛేదించడం కోసం కొత్త కొత్త మార్గాలను అనుసరించాలని, ఇలా చేస్తే పరిపాలనలో వివిధ ప్రక్రియలను వేగవంతం చేయడం సాధ్యపడుతుందని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే తీరులో డైరెక్టర్ మరియు డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారులు తప్పక బృందాలుగా ఏర్పడి, ఉత్తమ ఫలితాలను సాధించాలని కూడా ఆయన సూచించారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) సహాయ మంత్రి శ్రీ డాక్టర్ జితేంద్ర సింగ్ తో పాటు, పిఎమ్ఒకు, కేబినెట్ సెక్రటేరియట్ కు చెందిన సీనియర్ అధికారులు ఈ ముఖాముఖి సమావేశాలలో పాల్గొన్నారు.