ఇటీవలే ముగిసిన 18వ ఆసియా క్రీడలలో పతకాలను గెలుచుకొన్న వారి తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తన నివాసం లో భేటీ అయ్యారు.
పతకాల విజేతలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు అందించారు. ఆసియా క్రీడలలో భారతదేశానికి ఇంతకు ముందు ఎన్నడూ ఎరుగని స్థాయి లో ఉత్తమమైన పతకాల ను సాధించి పెట్టడంలో మార్గదర్శకమైన ప్రదర్శన ను ఇచ్చినందుకు వారికి ఆయన అభినందనలు తెలిపారు. వారి యొక్క క్రీడా విన్యాసాలు భారతదేశం యొక్క హోదా ను పెంచి, భారతదేశం గర్వపడే విధంగా చేశాయని పతక విజేతల తో ఆయన అన్నారు. పతక విజేత లు నేల విడచి సాము చేయబోరని, వారికి లభించిన ఖ్యాతి మరియు ప్రశంసల కారణంగా శ్రద్ధ ను కోల్పోబోరన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
క్రీడాకారులు/క్రీడాకారిణులు వారి ప్రదర్శన ను మెరుగుపరచుకోవడానికిగాను సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ప్రధాన మంత్రి సంభాషణ క్రమం లో వారికి విజ్ఞప్తి చేశారు. అలాగే, వారు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని వారి స్వీయ ప్రదర్శన కు మెరుగులు దిద్దుకోవడం తో పాటు ప్రపంచం లోని అగ్రగామి ఆటగాళ్ళందరి ప్రదర్శన లను లోతు గా విశ్లేషించుకోవాలని వారికి ఆయన చెప్పారు.
యువ ప్రతిభావంతులు చిన్న పట్టణాల నుండి, పల్లె ప్రాంతాల నుండి, పేద కుటుంబాల నుండి ఎదిగి వచ్చి, దేశానికి పతకాల ను గెలవడం పట్ల తాను సంతోషిస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సిసలైన సత్తా దాగివుందని, అటువంటి ప్రతిభాన్వితులను మనం పెంచి పోషించుకుంటూవుండాలని ఆయన చెప్పారు. క్రీడా రంగం లోని వ్యక్తులు దైనందిన జీవనం లో ఏ విధమైన సంఘర్షణల కు లోనవుతారో బాహ్య ప్రపంచానికి తెలియదు అని కూడా ఆయన చెప్పారు.
దేశ ప్రజల కోసం ఒక పతకాన్ని గెలుచుకోవడానికి అత్యంత కష్టనష్టాల గుండా పయనించిన కొద్ది మంది క్రీడాకారుల పేర్ల ను ప్రస్తావిస్తున్న సమయం లో ప్రధాన మంత్రి ఉద్వేగ భరితుడయ్యారు. వారి వారి విభాగాల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి, దృఢత్వానికి ఆయన ప్రణామం ఘటించారు. వీరి ప్రయత్నాల నుండి దేశం లోని మిగతా వ్యక్తులు ప్రేరణ ను పొందగలరన్న ఆశాభావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.
క్రీడాకారులు వారు సాధించిన విజయాలతో సంతృప్తి పడిపోరాదని ప్రధాన మంత్రి శ్రీ మోదీ కోరారు. మరింత ఖ్యాతి కోసం చెమటోడ్చండంటూ వారికి ఆయన సూచించారు. పతకాల విజేతలకు అతి పెద్ద సవాలు ఇప్పుడే మొదలవుతుందని, వారు ఒలంపిక్ క్రీడల ఉన్నత వేదిక మీదకు చేరాలనే వారి లక్ష్యాన్ని ఎన్నటికీ విడనాడకూడదని ఆయన చెప్పారు.
యువజన వ్యవహారాలు, ఇంకా క్రీడల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) కర్నల్ రాజ్యవర్ధన్ రాఠౌడ్ ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఆయన తొలి పలుకులు పలుకుతూ, పతకాల పట్టిక మెరుగవడం లోను, యువ క్రీడాకారులలో స్ఫూర్తి ని నింపడం లోను ప్రధాన మంత్రి యొక్క దార్శనికత తో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా కీలక భూమిక ను పోషించాయన్నారు.
ఇండోనేశియా లోని జకార్తా లోను, పాలెంబాంగ్ లోను నిర్వహించిన 18వ ఆసియా క్రీడల్లో భారతదేశం ఒక రికార్డు స్థాయి లో 69 పతకాలను సంపాదించుకొంది; తద్వారా, 2010వ సంవత్సరం లో జరిగిన గ్వాంగ్ ఝోవూ ఆసియా క్రీడల్లో భారతదేశం ఖాతా లో చేరిన 65 పతకాలను అధిగమించినట్లయింది.