భారతదేశం లోని వేరు వేరు ప్రాంతాలను సందర్శిస్తున్న రెండు ఐటిబిపి విహార యాత్ర బృందాలలో పాలుపంచుకొన్న సిక్కిమ్, ఇంకా లద్దాఖ్ లకు చెందిన 53 మంది విద్యార్థులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజు కలుసుకొన్నారు. వారు అవినీతికి చోటు లేని భారతదేశాన్ని గురించిన మరియు సమృద్ధమైన భారతదేశాన్ని గురించిన తమ అభిప్రాయాలను ఈ సందర్భంగా ప్రధాన మంత్రి తో పంచుకొన్నారు. ఈ దార్శనికతను సాకారం చేసుకొనే దిశలో కృషి చేయాలంటూ వారికి ప్రధాన మంత్రి ఉద్బోధించారు. మరిన్ని సాఫల్యాలను సాధించేందుకుగాను శారీరిక దారుఢ్యాన్ని కలిగివుండవలసిందిగా విద్యార్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో, యోగ యొక్క ప్రాముఖ్యం పైన కూడా చర్చించారు.
జ్ఞానం యొక్క ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, అన్ని కాలాల్లో విద్యార్థిగా ఉండాలన్న స్వాభావిక అనురక్తి ని ఏర్పరచుకోవాలంటూ ప్రోత్సహించారు.
విద్యార్థులు డిజిటల్ ఇండియా కార్యక్రమం పై ఆసక్తిని వ్యక్తం చేశారు. నగదు రహిత లావాదేవీలు సైతం చర్చలో చోటు చేసుకొన్నాయి. ప్రయోజనాల ప్రత్యక్ష బదిలీలు సామాన్య ప్రజానీకానికి ఏ విధంగా లబ్దిని చేకూరుస్తున్నాయో ప్రధాన మంత్రి వివరించారు.
విద్యార్థులు ప్రధాన మంత్రి రచించిన ‘‘ఎగ్జామ్ వారియర్స్’’ పుస్తకాన్ని గురించి ప్రస్తావించారు. అనుచితమైన ఒత్తిడికి మరియు అధిక భారానికి లోనవకుండా మనుగడ సాగించండంటూ విద్యార్థులకు ప్రధాన మంత్రి సూచన చేశారు.