ప్రపంచ వ్యాప్తంగా ఫూడ్ ప్రాసెసింగ్ మరియు సంబంధిత రంగాలలో నిమగ్నమై ఉన్న అగ్ర కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్య కార్యనిర్వహణ అధికారులతో (సిఇఒ లతో) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వరల్డ్ ఫూడ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది.
ఈ సమావేశంలో అమెజన్ (ఇండియా), ఆమ్ వే, బ్రిటానియా ఇండస్ట్రీస్, కార్గిల్ ఏశియా పసిఫిక్, కోక-కోలా ఇండియా, డాన్ ఫోస్, ఫ్యూచర్ గ్రూపు, గ్లాక్సో స్మిత్ క్లైన్, ఐసే ఫూడ్స్, ఐటిసి, కికోమన్, లులు గ్రూపు, మెక్ కెయిన్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, మాండెలెజ్ ఇంటర్ నేషనల్, నెస్లే, ఒఎస్ఐ గ్రూపు, పెప్సికో ఇండియా, సీల్డ్ ఏర్, శరాఫ్ గ్రూపు, స్పార్ ఇంటర్ నేషనల్, ద హైన్ సెలెస్టియల్ గ్రూపు, ద హెర్శీ కంపెనీ, ట్రెంట్ లిమిటెడ్, ఇంకా వాల్ మార్ట్ ఇండియా లకు చెందిన ప్రముఖ సిఇఒ లు మరియు అధికారులు పాల్గొన్నారు.
కేంద్ర ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్, ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మరియు కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన డూయింగ్ బిజినెస్ రిపోర్టు లో భారతదేశం తన స్థానాన్ని భారీ ఎత్తున మెరుగుపరచుకోవడం పట్ల ప్రధాన మంత్రి ని వేరువేరు సిఇఒ లు అభినందించారు. వ్యవసాయ సంబంధ ఆదాయాలను రెట్టింపు చేయాలన్న ప్రధాన మంత్రి దార్శనికత నుండి మరియు ఆయన నాయకత్వంలో గత మూడు సంవత్సరాలలో ఆర్థిక సంస్కరణలు జోరుగా పురోగమించడం నుండి పలువురు సిఇఒలు తాము ప్రేరణను పొందినట్లు తెలిపారు. వారు మరీ ముఖ్యంగా ఎఫ్ డిఐ విధాన సరళీకరణను మరియు జిఎస్ టి వంటి నిర్మాణాత్మక, సాహసోపేత కార్యక్రమాలను ప్రశంసించారు.
వ్యవసాయ రంగ ఉత్పాదకతను పెంచడంలో, ఆహార భద్రత మరియు పోషకాహార సంబంధ భద్రత కల్పన, ఉద్యోగ కల్పన, ఇంకా వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించడం లో ఫూడ్ ప్రాసెసింగ్ రంగం కీలకమన్న అభిప్రాయాన్ని సదస్సులో పాల్గొన్న వారు వ్యక్తం చేశారు. భారతదేశ ఫూడ్ ప్రాసెసింగ్ రంగం, వ్యవసాయ రంగం, లాజిస్టిక్స్ రంగం మరియు రిటైల్ రంగాలలో సమ్మిళిత వృద్ధి కోసం తాము ఎటువంటి అనుబంధాన్ని మరియు కార్యక్రమాల అమలును కోరుకొంటున్నదీ సిఇఒలు తమ అభిప్రాయాలను కార్యక్రమంలో వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అవకాశాల పైన మరియు పంట కోతల తాలూకు మౌలిక సదుపాయాల కల్పనను పటిష్టపరచేందుకు ఉన్నటువంటి అవకాశాలపైన వారు ఆసక్తిని వ్యక్తం చేశారు. భారతదేశం వృద్ధి గాథలో ఒక భాగం అవుతామంటూ వారు తమ వచనబద్ధతను పునరుద్ఘాటించారు.
సిఇఒ లు వారి ఆలోచనలను పంచుకొన్నందుకుగాను ప్రధాన మంత్రి వారికి ధన్యవాదాలు తెలిపారు. వారి పరిశీలనలు భారతదేశం పట్ల భారీ స్థాయిలో ఉత్సాహం రేకెత్తుతున్న సంగతిని సూచిస్తున్నాయని కూడా ప్రధాన మంత్రి అన్నారు. సిఇఒ లు ఇచ్చిన శ్రద్ధాపూర్వక సూచనలను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.
సదస్సులో పాలు పంచుకొన్న వారు వ్యవసాయ ఉత్పాదకతను మరియు వ్యవసాయదారుల ఆదాయాలను పెంచడంలో తీసుకొంటున్న చర్యలను ప్రధాన మంత్రి స్వాగతించారు. మరీ ముఖ్యంగా, పెరుగుతున్న భారతదేశ మధ్య తరగతి ప్రజలు, ప్రభుత్వం విధానపరంగా కనబరుస్తున్నటువంటి చొరవలు ఫూడ్ ప్రాసెసింగ్ రంగం తాలూకు ఇకోసిస్టమ్ లో సంబంధిత వర్గాలన్నింటికీ వారు గెలిచే అవకాశాలనే కాక అవతలి పక్షం సైతం గెలిచే అవకాశాలను కూడా ప్రసాదిస్తున్నాయని ఆయన చెప్పారు. రైతుకు ఇన్ పుట్ కాస్ట్ లను తగ్గించాలని, దీంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను వృథా పోనివ్వడం వల్ల వాటిల్లే నష్టాలను నివారించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించుకొందని ప్రధాన మంత్రి నొక్కిపలికారు. భారతదేశంతో మరింత ప్రగాఢమైన మరియు నిర్మాణాత్మకమైన అనుబంధాన్ని ఏర్పరచుకోండంటూ గ్లోబల్ సిఇఒ లను ఆయన ఆహ్వానించారు.
అంతక్రితం కేంద్ర మంత్రి శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ ఫూడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గురించి క్లుప్తంగా వివరించారు.