ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐసిటి ఆధారితమైన మల్టి- మోడల్ ఫ్లాట్ ఫారమ్ ఫర్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేషన్- PRAGATI (ప్రగతి) మాధ్యమం ద్వారా 24వ పర్యాయం ఈ రోజు జరిగిన ముఖాముఖి సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఇంతవరకు జరిగిన ‘ప్రగతి’ తాలూకు 23 సమావేశాల లోను మొత్తం 9.46 లక్షల కోట్ల పెట్టుబడి తో కూడిన 208 ప్రాజెక్టులపై సమీక్షను నిర్వహించడం జరిగింది. 17 రంగాలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారాన్ని గురించి కూడా సమీక్షించారు.
ఈ రోజు జరిగిన 24వ సమావేశంలో ఉత్తరాఖండ్ లో కేదార్‌నాథ్ పునర్ నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతి ని ప్రధాన మంత్రి సమీక్షించారు. పనుల పురోగతి పై డ్రోన్ దృశ్యాలతో కూడిన ఒక నివేదికను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.
ఢిల్లీ పోలీస్ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులను పరిశీలిస్తున్న తీరులోను మరియు పరిష్కరిస్తున్న తీరులోను పురోగతిని గురించి ప్రధాన మంత్రి అడిగి తెలుసుకొన్నారు. ఫిర్యాదులను పరిష్కరించే పద్ధతిలో నాణ్యతను మెరుగు పరచడానికి ప్రాముఖ్యం ఇవ్వవలసిందిగా ఆయన నొక్కి చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్‌ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళ నాడు, ఇంకా కేరళ లు సహా అనేక రాష్ట్రాలలో రైల్వే, రోడ్డు, విద్యుత్తు, పెట్రోలియమ్ మరియు బొగ్గు రంగాలలో అమలవుతున్న పది అవస్థాపన పథకాలు ఏ దశలో ఉన్నదీ ప్రధాన మంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల సంచిత విలువ 40,000 కోట్ల రూపాయలకు పైగానే ఉంది.
‘ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన’ తో పాటు ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ ల అమలులో పురోగతి పైనా ప్రధాన మంత్రి సమీక్షను నిర్వహించారు.