ఐసిటి ఆధారితమైన మల్టి- మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ప్రగతి) మాధ్యమం ద్వారా ఈ రోజు జరిగిన ఇరవై ఎనిమిదో ముఖాముఖి సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఆదాయపు పన్ను కు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం లో పురోగతి ని ప్రధాన మంత్రి సమీక్షించారు. ఈ విషయం లో చోటు చేసుకొన్న పురోగతి ని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు ఆయన దృష్టి కి తీసుకువచ్చారు. అన్ని వ్యవస్థలను సాంకేతిక విజ్ఞానం చోదక శక్తి గా ఉండేటట్లుగా మలచాలని, మానవ ప్రమేయాన్ని కనీస స్థాయి కి తగ్గించాలని ప్రధాన మంత్రి పురుద్ఘాటించారు. అవినీతిపరులైన అధికారులను చట్టానికి పట్టి ఇవ్వడం లో నమోదైన పురోగతి ని ప్రధాన మంత్రి పరిశీలించి, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు ఆదాయపు పన్ను విభాగం తీసుకొన్న వేరు వేరు చర్యలపై, అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై పన్ను చెల్లింపుదారులకు తగు విధంగా సమాచారాన్ని అందించాలని ప్రధాన మంత్రి సూచించారు.
మొత్తం 11.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి ముడివడ్డ పథకాలను ఇంతవరకు పూర్తయిన 27 ‘‘ప్రగతి’’ సమావేశాలలో సమీక్షించడం జరిగింది. వివిధ రంగాలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తీరును సైతం సమీక్షించడమైంది.
రైల్వేలు, రహదారులు, ఇంకా పెట్రోలియమ్ రంగాలలో తొమ్మిది ముఖ్యమైన మౌలిక సదుపాయాల పథకాల తాలూకు పురోగతిని ప్రధాన మంత్రి ఈ రోజు జరిగిన ఇరవై ఎనిమిదో సమావేశం లో సమీక్షించారు. ఈ పథకాలు ఆంధ్ర ప్రదేశ్, అసమ్, గుజరాత్, ఢిల్లీ, హరియాణా, తమిళ నాడు, ఒడిశా, కర్నాటక, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, మరియు ఉత్తరాఖండ్ లు సహా అనేక రాష్ట్రాలలో వ్యాపించివున్నాయి.
ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఉండబోతున్న ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రారంభ సన్నాహాలలో పురోగతి ని ప్రధాన మంత్రి సమీక్షించారు. అలాగే ప్రధాన మంత్రి జన్ ఔషధి పరియోజన లో పురోగతి పై కూడా ఆయన సమీక్ష జరిపారు.