ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశ ప్రజలను ఉద్దేశించి ఎర్ర కోట బురుజుల నుండి ప్రసంగించారు. ఆయన ప్రసగంలోని ముఖ్యాంశాలు:
1. భారతీయులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
2. దేశ స్వాతంత్య్ర సాధన కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి, జీవితాలను త్యాగం చేసిన పవిత్ర ఆత్మలు, మాతృమూర్తులు, సోదరీమణులందరికీ, 125 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ ఎర్ర కోట బురుజుల మీది నుండి నేను శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను.
3. భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు ఎందరో మహామహులైన స్త్రీ, పురుషులు ఎంతో శ్రమించారన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం.
4. అదే స్ఫూర్తితో ఈ రోజు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల బాధితులు, ఆసుపత్రిలో బాలల మరణాలు వంటి విషాద ఘటనల బాధితులకు అండగా మనందరం భుజం భుజం కలిపి నిలబడాలి.
5. దేశ చరిత్రలో ఇది ఒక ప్రత్యేక సంతరించుకున్న సంవత్సరం. క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం, చంపారణ్ సత్యాగ్రహం శతాబ్ది, గణేశ్ ఉత్సవం 125 సంవత్సర వేడుకలే ఆ ప్రత్యేకత.
6. క్విట్ ఇండియా ఉద్యమంలో మన నినాదం ‘‘భారత్ చోడో’’ (భారత్ ను వదిలి పోండి), నేడు మన నినాదం ‘‘భారత్ జోడో’’ (భారత్‌ను భాగస్వామిని చేసుకోండి).
7. ‘న్యూ ఇండియా’ ఆవిష్కారం కోసం దేశం యావత్తు నిర్ణయాత్మకంగా ముందుకు కదలాలి.
8. 1942 నుండి 1947 వరకు దేశ ప్రజలు సంఘటిత బలాన్ని ప్రదర్శించారు. వచ్చే 5 సంవత్సరాల కాలంలో మనం అదే సంఘటిత శక్తితోను, నిబద్ధతతోను, కఠిన శ్రమతోను ముందుకు నడవాలి.
9. మన దేశంలో ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనే తారతమ్యం లేదు.. అందరూ సమానమే. అటువంటి భావనతోనే మనం సానుకూలమైన మార్పు తీసుకురాగలుగుతాం.
10. చిన్న, పెద్ద తారతమ్యాలు లేని ప్రబల శక్తిగా 125 కోట్ల మంది భారతీయులు ముందడుగు వేసి ‘నవ భారతా’న్ని నిర్మించాలి.
11. 2018 జనవరి 1వ తేదీ ఒక అసాధారణ దినంగా దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ శతాబ్ది తొలి రోజున జన్మించిన వారంతా ఆ రోజున 18వ సంవత్సరంలో అడుగుపెడతారు. ‘జాతి భాగ్య విధాతలు’ వారే.
12. మనం 'చల్‌తా హై' (అదే నడిచిపోతుంది) అనే ఉదాసీన వైఖరిని విడనాడాలి. 'బదల్ సక్‌తా హై' (పరివర్తన తీసుకురాగలం) అనే విశ్వాసమే మనకు సహాయకారిగా నిలుస్తుంది.
13. దేశం ఎంతో మారింది, మారుతోంది, మారబోతుంది. ఈ నమ్మకంతోను, కట్టుబాటుతోను మనం ముందుకు సాగాలి.
14. దేశ భద్రతే మా అత్యధిక ప్రాధాన్యం. అంతర్గత భద్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. సారగ జలాలు, సరిహద్దులు, సైబర్ ప్రపంచం, అంతరిక్షం.. ఏ విభాగంలోనైనా శత్రు సేనలను ఓడించగలిగే శక్తి భారతదేశానికి ఉంది.
15. వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం, అక్రమ చొరబాట్లు, శాంతికి విఘాతం కలిగించే శక్తులకు వ్యతిరేకంగా పోరాడటంలో మన ఉమ్మడి దళాలు ఎన్నో త్యాగాలు చేశాయి. భారతదేశానికి ఉన్న శక్తిని, సర్జికల్ దాడుల వెనుక ఉన్న మన లక్ష్యాన్ని ప్రపంచం గుర్తించాలి.
16. ‘ఒకే ర్యాంక్, ఒకే పింఛన్’ మన సాయుధ దళాల్లో నైతిక స్థైర్యాన్ని పెంచింది.
17. జాతిని, పేద ప్రజలను దశాబ్దాలుగా దోచుకున్న వారు ఈ రోజు శాంతియుతంగా నిద్రించగలిగే పరిస్థితి లేదు.
18. ఎన్నో సంవత్సరాలుగా బినామీ ఆస్తులు గల వారిపై చర్యలు తీసుకోగల చట్టం ఏదీ లేదు. ఇటీవల బినామీ చట్టాన్ని ఆమోదించడంతో స్వల్ప కాలంలోనే ప్రభుత్వం 800 కోట్ల రూపాయల విలువ గల బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకొంది. నిజాయితీపరులకే దేశంలో స్థానం ఉందన్న భావం సామాన్య ప్రజల్లో ఏర్పడింది.
19. ఈ రోజు మనం ‘‘నిజాయితీ పండుగ’’ను జరుపుకొంటున్నాం.
20. జిఎస్‌టి సహకారాత్మక సమాఖ్యతత్వం స్ఫూర్తిని ప్రదర్శించింది. జిఎస్‌టి కి జాతి యావత్తు మద్ధతుగా నిలిచింది. టెక్నాలజీ కూడా దానికి సహకరించింది.
21. ఈ రోజు పేద ప్రజలంతా జాతి ప్రధాన స్రవంతిలో భాగస్వాములవుతున్నారు. దేశం ప్రగతి పథంలో పురోగమిస్తోంది.
22. సుపరిపాలన అంటే వేగం, విధానాల సరళీకరణ.
23. ప్రపంచంలో భారతదేశం ప్రాబల్యం పెరుగుతోంది. ఉగ్రవాద పై పోరాటంలో ప్రపంచం మనకు తోడుగా ఉంది. ఇందుకు ఆ దేశాలన్నింటికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
24. జమ్ము & కశ్మీర్ పురోగతికి మనందరం కలిసి కృషి చేయాలి.
25. ఉగ్రవాదులు, ఉగ్రవాద చర్యలపై మెతక వైఖరి ప్రసక్తే లేదు.
26. తుపాకిగుండ్లు, దూషణలు కశ్మీర్ సమస్యను పరిష్కరించలేవు. సాదరంగా హత్తుకోవడంతోనే దాన్ని సాధించగలం.
27. నల్లధనంపై, అవినీతిపై మా పోరాటం కొనసాగుతుంది. సాంకేతిక పరిజ్ఞానంతోనే పారదర్శకతను తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాం.
28. వ్యవస్థకు ప్రజలే చోదక శక్తిగా ఉండాలి. వ్యవస్థ ప్రజలను నడిపేదిగా ఉండకూడదు - ‘‘తంత్ర సే లోక్ నహీ, లోక్ సే తంత్ర చలేగా’’.
29. ప్రజాస్వామ్యానికి అతి పెద్ద బలంగా ‘న్యూ ఇండియా’ ఉంటుంది.
30. డిమాండ్ లోను, సాంకేతిక పరిజ్ఞానంలోను మార్పులతో ఉద్యోగాల స్వభావం మారిపోతోంది.
31. ఉపాధి కోసం యాచించే వారుగా కాకుండా, ఉపాధి కల్పన శక్తులుగా నిలిచేలా యువతను ప్రోత్సహిస్తున్నాం.
32. ‘‘తలాక్ అనే పదాన్ని మూడు సార్లు ఉచ్చరించడం’’ వలన బాధితులైన మహిళలందరికీ అండగా నిలుస్తున్న వారి సాహసాన్ని నేను అభినందిస్తున్నాను. ఆ పోరాటంలో అందరం మీ వెంటే ఉంటాం.
33. శాంతికి, ఏకతకు, సద్భావనకు భారతదేశం కట్టుబడి ఉంటుంది. మతతత్వం, కులతత్వం మనకు ఏ రకంగానూ ఉపయోగపడవు.
34. ‘ఆస్థా’ (మతం) పేరిట హింస హర్షించవలసిందేమీ కాదు, దీనిని భారతదేశంలో ఆమోదించడం జరగదు.
35. శాంతి, ఐక్యత, సామరస్యాలే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని వెంట నడిపించుకుంటూ పోవడమే మన నాగరికత, సంస్కృతి.
36. దేశాన్ని మేము సరికొత్త పథంలో (అభివృద్ధి) నడిపిస్తూ - వేగంగా ముందుకు సాగుతున్నాం.
37. తూర్పు భారత్ - బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య ప్రాంతాల సంక్షేమం పై అధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాం. ఈ ప్రాంతాలన్నీ మరింతగా అభివృద్ధి చెందాలి.
38. మన రైతన్నలు ఎంతో శ్రమించి రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేశారు.
39. ‘‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’’లో భాగంగా 5.75 కోట్ల మంది రైతన్నలకు లబ్ది చేకూరుస్తున్నాం.
40. ‘‘ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన’’ ద్వారా 30 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 50 ప్రాజెక్టుల పని నడుస్తోంది.
41. ‘‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన’’ ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు వారి ఉత్పత్తులకు మంచి మార్కెట్ అవకాశాలు కూడా అందుబాటులో ఉంచాము.
42. విద్యుత్ సౌకర్యం లేని 14000 కు పైగా గ్రామాలకు విద్యుత్ వెలుగులు తీసుకువచ్చాము.
43. 29 కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభమయ్యాయి.
44. ఎలాంటి హామీలు అవసరం లేకుండానే 8 కోట్ల మందికి పైగా యువతకు రుణాలు అందించాం.
45. భారతదేశ ఉజ్జ్వల భవిష్యత్తు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అవినీతికి వ్యతిరేక పోరాటం చేస్తున్నాం.
46. నల్లధనంపైన, అవినీతి పైన మా పోరాటం కొనసాగుతుంది. దోపిడీని ఇక ఏ మాత్రం అంగీకరించేది లేదు.
47. ‘అవినీతి రహిత భారతదేశం’ ఆవిష్కారానికి మేము పడుతున్న శ్రమ సత్ ఫలితాలు అందించింది.
48. రూ. 1.25 లక్షల కోట్ల విలువ గల నల్లధనాన్ని వెలికి తీయగలిగాం.
49. 1.75 లక్షలకు పైగా నకిలీ కంపెనీలను మూసి వేయించాం.
50. జిఎస్‌టి అనంతరం రవాణా రంగంలో పొదుపు, సామర్థ్యం పెరిగాయి. సామర్థ్యం 30 శాతం వరకు పెరిగింది.
51. పెద్ద నోట్ల రద్దు కారణంగా అధిక ధనం బ్యాంకులకు వచ్చింది. అది ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని అందిస్తుంది.
52. మన దేశంలో ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో యువ జనాభా ఉంది. ఇది ఐటి యుగం. డిజిటల్ లావాదేవీల పథంలో మనం మరింత ముందుకు సాగుదాం.
53. మనం ముందుండి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నడిపిద్దాం. భీమ్ యాప్ ను ఉపయోగిద్దాం.
54. మనం సహకారాత్మక సమాఖ్య తత్వం నుండి పోటీతో కూడిన సహకారపూర్వక సమాఖ్య తత్వం లోకి అడుగుపెట్టాం.
55. సకాలంలో పని పూర్తి చేయలేకపోతే ఆశించిన ఫలితాలు సాధించలేం అని మన ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి.
56. ‘న్యూ ఇండియా’ ఆవిర్భావానికి కట్టుబాటు ప్రకటించేందుకు 'టీమ్ ఇండియా' కు ఇదే సరైన సమయం.
57. పేదలకు నాణ్యమైన నీరు, విద్యుత్ సదుపాయాలు ఉన్న గృహాలతో కూడిన భారతదేశాన్ని మనమందరం కలిసి నిర్మిద్దాం.
58. రైతన్నలు ఎలాంటి చింతలు లేకుండా శాంతియుతంగా నిద్రించగల, ప్రస్తుతం తాము ఆర్జిస్తున్న సంపాదనకు రెట్టింపు ధనాన్ని సంపాదించగల భారతదేశాన్ని మేము నిర్మిస్తాం.
59. కలలు సాకారం చేసుకోగల చక్కని అవకాశాలు యువతీ యువకులకు అందుబాటులో ఉండే భారతదేశ ఆవిష్కారం మా సంకల్పం.
60. ఉగ్రవాదానికి, మతవాదానికి, కులతత్వానికి ఏ మాత్రం చోటులేని భారతదేశాన్ని నిర్మించాలన్నది మా లక్ష్యం.
61. అవినీతికి, ఆశ్రిత పక్షపాతాలకు తావు లేని భారతదేశాన్ని మేము కలసికట్టుగా నిర్మిస్తాం.
62. స్వయంపాలన (‘స్వరాజ్’) కలను సాకారం చేయగల స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించాలని మేము భావిస్తున్నాం.
63. దివ్యమైన, భవ్యమైన భారతదేశాన్ని నిర్మించాలన్నది మా ఆకాంక్ష.