భారత ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న 80 మందికి పైగా అదనపు కార్యదర్శులు మరియు సంయుక్త కార్యదర్శులతో కూడిన బృందంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు సమావేశమై చర్చించారు. ఈ తరహా సమావేశాలు అయిదింటిలోనూ ఇది నాలుగో సమావేశం.
ప్రధాన మంత్రితో ముఖాముఖి సందర్భంగా, పరిపాలనలో జట్టు స్ఫూర్తిని కనబరచడం మరియు నవకల్పన, ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సంబంధిత విద్య, వ్యవసాయం, జల వనరులు, ఇ-గవర్నెన్స్, పన్నుల సంబంధిత పరిపాలన మరియు వస్తువులు, సేవల పన్ను (జిఎస్ టి), వ్యాపారాన్ని సులభతరంగా కొనసాగించడం, ఫిర్యాదుల పరిష్కారం, ఇంకా బాలల హక్కులు వంటి విషయాలపై అధికారులు వారి వారి అనుభవాలను గురించి వివరించారు.
పరిపాలన ప్రక్రియలను మెరుగుపరచే దిశగా కృషి చేయవలసిందని అధికారులకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉత్తమమైనటువంటి ఉమ్మడి ఫలితాలను బృంద స్ఫూర్తి అందించగలదని, బృంద స్ఫూర్తిని అలవరచుకోవడంలో మానవీయ కోణానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న సానుకూల వాతావరణం భారతదేశానికి అనుకూలంగా ఉన్నదని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, 2022 కల్లా ఒక ‘న్యూ ఇండియా’ను నిర్మించే దిశగా స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని పని చేయవలసిందని అధికారులకు సూచించారు.