రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం మహ్మద్ సొలిహ్, డెమోక్రటిక్ సోశలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన లు వారి వారి దేశాలను సందర్శించాలని ఆహ్వానించిన మీదట నేను 2019 జూన్ 08వ తేదీన మాల్దీవ్స్ లోను, 2019 జూన్ 09 తేదీన శ్రీ లంక లోను పర్యటించనున్నాను. ప్రధాన మంత్రి గా నేను మళ్లీ ఎన్నికైన అనంతరం జరిపే తొలి విదేశీ సందర్శన ఇదే అవుతుంది.
గత సంవత్సరం డిసెంబర్ లో మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ సొలిహ్ కు భారతదేశాని కి స్వాగతం పలికే సంతోషం మనకు దక్కింది. 2018 నవంబర్ లో మాల్దీవ్స్ అధ్యక్షుడు శ్రీ సొలిహ్ పదవీబాధ్యతల ను స్వీకరించినప్పుడు, ఆ కార్యక్రమాని కి హాజరయ్యే అవకాశం కూడా నాకు లభించింది. సుదీర్ఘ కాలంగా మిత్ర దేశాలు గా, సముద్ర తీర పొరుగు దేశాలు గా ఉభయ దేశాలూ తమ సంబంధాల కు ప్రాధాన్యాన్ని ఇస్తుండడానికి నా మాల్దీవ్స్ పర్యటన ఒక తార్కాణం కానుంది.
మాల్దీవ్స్ ను ఒక విలువైన భాగస్వామ్య దేశం గా మేం పరిగణిస్తాం. మన ద్వైపాక్షిక ఉభయ దేశాలు సుసంపన్నమైన చారిత్రక, సాంస్కృతిక బంధాన్ని కలిగివున్నాయి. ఇటీవల గత కొద్ది సంవత్సరాల లో మాల్దీవ్స్ తో మన ద్వైపాక్షిక సంబంధాలు బాగా బలోపేతం అయ్యాయి. నేను మాల్దీవ్స్ లో జరుపనున్న పర్యటన తో ఉభయ దేశాల మధ్య బహుముఖీనమైన భాగస్వామ్యం మరింతగా వృద్ధి చెందగలదన్న విశ్వాసం నాకు ఉంది.
శ్రీ లంక పర్యటన విషయానికి వస్తే, ఈ ఏడాది అంటే 2019 ఏప్రిల్ 21వ తేదీ న ఈస్టర్ సమయం లో శ్రీ లంక లో జరిగిన ఉగ్ర దాడుల కారణంగా అక్కడి ప్రభుత్వాని కి, అక్కడి ప్రజల కు మన సంఘీభావాన్ని తెలియజేసేందుకు నేను ఈ పర్యటన కు వెళుతున్నాను. ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా సాగించే పోరాటం లో శ్రీ లంక కు భారతదేశం అండ గా ఉంటుంది. మా ద్వైపాక్షిక సంబంధాలు గడచిన కొద్ది సంవత్సరాల లో చెప్పుకోదగిన జోరు ను అందుకొన్నాయి. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ సిరిసేన ఇటీవల భారత్ కు వచ్చిన సందర్భం గా వారి తో భేటీ అయ్యే అవకాశం చిక్కింది. నా శ్రీ లంక పర్యటన సందర్భం గా శ్రీ లంక నాయకత్వాన్ని కలుసుకోవడానికి ఆసక్తి తో ఉన్నాను.
మాల్దీవ్స్ ను మరియు శ్రీ లంక ను నేను సందర్శించనుండటం మన సముద్ర తీర ఇరుగుపొరుగు దేశాల తో ఇప్పటికే మన కు గల సన్నిహిత, సానుకూల సంబంధాలు మా ‘నేబర్ హుడ్- ఫస్ట్ పాలసీ’కి మరియు ఈ ప్రాంతం లో అన్ని దేశాల వృద్ధి కి, భద్రత కు సంబంధించినటువంటి దార్శనికత కు అనుగుణం గా మరింత గా బలోపేతం అవుతాయన్న విశ్వాసం నాకుంది.