పోలెండ్, ఉక్రెయిన్ దేశాల ఆధికారిక పర్యటనను నేను ఈ రోజున మొదలుపెడుతున్నాను.
మన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో పోలెండును నేను సందర్శించబోతున్నాను. మధ్య ఐరోపాకు చెందిన పోలెండ్ ఒక ప్రముఖ ఆర్థిక భాగస్వామ్య దేశంగా ఉంది.
ప్రజాస్వామ్యం పట్ల, బహుళత్వవాదం పట్ల మనకున్న పరస్పర నిబద్ధత మన సంబంధాలను దృఢతరమైందిగా రూపొందిస్తున్నది. మన భాగస్వామ్యాన్ని మరింతగా ముందుకు తీసుకుపోవడానికి నా మిత్రుడు, ప్రధాని శ్రీ డోనాల్డ్ టస్క్ తోను, అధ్యక్షుడు శ్రీ ఆంద్రెజ్ డూడాతోనూ సమావేశం అయ్యేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అలాగే, పోలెండ్ లో చైతన్యశీలురైన భారతీయ సంతతి సభ్యులను కూడా నేను కలుస్తాను.
ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వలోడిమిర్ జెలెన్ స్కీ ఆహ్వానం మేరకు ఆ దేశాన్ని సైతం సందర్శించనున్నాను. భారతదేశం ప్రధాన మంత్రి ఒకరు ఉక్రెయిన్ ను సందర్శించడం ఇదే మొదటిసారి. ద్వైపాక్షిక సహకారాన్ని బలపరచాలన్న అంశంపైనే కాకుండా, ప్రస్తుత ఉక్రెయిన్ సంఘర్షణకు ఒక శాంతియుత పరిష్కారాన్ని సాధించడంపైన మా మా అభిప్రాయాలను పరస్రం పంచుకోవాలని భావిస్తున్నాను. ఉక్రెయిన్ లో శాంతి స్థాపన దిశగా ఆ దేశాధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీతో ఇంతకు ముందు చేసిన సంభాషణలకు కొనసాగింపుగా చొరవ తీసుకొనేందుకు నాకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఉత్సాహ పడుతున్నాను.
ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం వీలయినంత త్వరగా తిరిగి నెలకొనాలని ఒక స్నేహితుడిగా, ఒక భాగస్వామిగా నేను ఆశిస్తున్నాను.
ఈ సందర్శన రెండు దేశాలతో ఉన్న విస్తృత సంబంధాలకు దోహద పడడంతో పాటు, రాబోయే సంవత్సరాల్లో ప్రబలమైన సంబంధాలకు పునాదిని వేయడంలో సహాయకారి కాగలదన్న నమ్మకం నాకు ఉంది.