నేను 2019వ సంవత్సరం 22-26 తేదీ ల మధ్య కాలం లో ఫ్రాన్స్, యుఎఇ మరియు బహ్రెయిన్ లలో పర్యటించబోతున్నాను.
ఫ్రాన్స్ లో నేను జరుపబోయే పర్యటన మన రెండు దేశాలు ఎంతో విలువ ను ఇస్తున్న మరియు పరస్పరం నెరపుతున్న బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. 2019వ సంవత్సరం ఆగస్టు 22వ మరియు 23వ తేదీ లలో ఫ్రాన్స్ లో ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. వీటి లో అధ్యక్షుడు మాన్య శ్రీ మేక్రోన్ తో శిఖర సమ్మేళనం, ఇంకా ప్రధాని శ్రీ ఫిలిప్ తో సమావేశం భాగం గా ఉంటాయి. నేను భారతీయ సముదాయం తో కూడా భేటీ అవుతాను. 1950వ ఇంకా 1960వ దశాబ్దుల లో ఫ్రాన్స్ లో జరిగిన రెండు ఎయర్ ఇండియా ప్రమాద ఘటనల లో బాధితులైన భారతీయుల కు గుర్తు గా నిర్మింపబడ్డ ఒక స్మారకాన్ని నేను అంకితం చేస్తాను.
ఆ తరువాత ఆగస్టు 25వ, 26వ తేదీ లలో అధ్యక్షుడు మాన్య శ్రీ మేక్రోన్ ఆహ్వానించిన మీదట పర్యావరణం, జల వాయు, సముద్ర సంబంధి మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ లపై జరుగనున్న జి7 శిఖర సమ్మేళనం తాలూకు సమావేశాల లో నేను పాలు పంచుకొంటాను.
భారతదేశాని కి మరియు ఫ్రాన్స్ కు మధ్య ఉత్కృష్ట ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. ఇవి మన రెండు దేశాల తో పాటు ప్రపంచం లో శాంతి ని, ఇంకా సమృద్ధి ని పెంపొందించడం కోసం సహకార పూర్వకమైనటువంటి ఉమ్మడి దార్శనికత తో నిండుతనాన్ని సంతరించుకొనేటట్టు చేస్తున్నాయి. ఉగ్రవాదం, జల వాయు పరివర్తన తదితర ప్రపంచ ఆందోళనకర అంశాల పై ఉమ్మడి దృక్పథాన్ని వ్యక్తం చేసుకొంటున్నందున మన దృఢమైన వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాలు మరింత సమగ్రం అయ్యాయి. ఈ సందర్శన పరస్పర దీర్ఘకాలిక మరియు బహుమూల్య మిత్రత్వాన్ని మరింత గా ప్రోత్సహించగలదన్న నమ్మకం నాలో ఉంది.
ఆగస్టు 23, 24వ తేదీల లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను సందర్శించేటప్పుడు అబూ ధాబీ రాకుమారుడు మాన్య శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తో చర్చలు జరపడం కోసం నేను నిరీక్షిస్తున్నాను. ఈ సందర్భం లో పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్నటువంటి ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు సహా యావత్తు ద్వైపాక్షిక సంబంధాల ను గురించి చర్చించడం జరుగుతుంది.
మాన్య శ్రీ రాకుమారుడి తో కలసి మహాత్మ గాంధీ 150వ జయంతి ని స్మరించుకొంటూ ఒక తపాలా బిళ్ల ను విడుదల చేయాలని కూడా నేను ఎదురుచూస్తున్నాను. యుఎఇ ప్రభుత్వం ప్రదానం చేసే అత్యున్నత పౌర సమ్మానమైన ‘ఆర్డర్ ఆఫ్ జాయద్’ను ఈ సందర్శన లో భాగం గా స్వీకరించడం గౌరవప్రదం కానుంది. విదేశాల లో నగదు రహిత లావాదేవీల నెట్ వర్క్ ను విస్తరించడం కోసం రూపే కార్డు ను కూడా నేను ఆధికారికం గా జారీ చేస్తాను.
యుఎఇ కి మరియు భారతదేశాని కి మధ్య తరచు గా జరుగుతున్న ఉన్నత స్థాయి సంప్రదింపులు మన హుషారైన సంబంధాల కు నిదర్శనం గా ఉన్నాయి. యుఎఇ మన మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామి కావడంతో పాటు భారతదేశాని కి ముడి చమురు ను ఎగుమతి చేస్తున్న నాలుగో అతి పెద్ద దేశం గా కూడా ఉంది. ఈ సంబంధాల లో గుణాత్మక వృద్ధి మా విదేశీ విధాన కార్యసాధనల లో ఒకటి గా ఉంది. ఈ పర్యటన మనకు యుఎఇ తో గల బహుముఖీన ద్వైపాక్షిక సంబంధాల ను మరింత బలపరచగలుగుతుంది.
2019వ సంవత్సరం ఆగస్టు నెల 24వ, 25వ తేదీల లో కింగ్‌డమ్ ఆఫ్ బహ్రెయిన్ ను కూడా నేను సందర్శించనున్నాను. భారతదేశం నుండి ఈ రాజ్యాని కి ప్రధాన మంత్రి స్థాయి సందర్శన ఇదే తొలిసారి కాగలదు. మన ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా ప్రోత్సహించుకొనేందుకు ఉన్న మార్గాలు, మరియు పరస్పరం ఆసక్తులు ముడివడి ఉన్న ప్రాంతీయ, ఇంకా అంతర్జాతీయ అంశాల పట్ల అభిప్రాయాల ను వెల్లడి చేయడం కోసం ప్రధాని, రాకుమారుడు మాన్య శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ సల్ మాన్ అల్ ఖలీఫా తో చర్చలు జరపడం కోసం నేను వేచి ఉన్నాను. అలాగే, బహ్రెయిన్ రాజు మాన్య శ్రీ శేఖ్ హమాద్ బిన్ ఈసా అల్ ఖలీఫా తో మరియు ఇతర నాయకుల తో కూడాను నేను భేటీ అవుతాను.
ఈ యాత్ర సందర్భం గా భారతీయ సముదాయం తో మాటామంతీ జరిపేందుకు నాకు అవకాశం లభించనుంది. మంగళప్రదమైన జన్మాష్టమి పర్వదినం సందర్భం లో గల్ఫ్ ప్రాంతం లోని అతి పురాతన శ్రీనాథ్ జీ దేవాలయ పునరుద్ధరణ పనుల కు ఆచారబద్ధం గా శ్రీకారం చుట్టే కార్యక్రమం లో హాజరు అయ్యే భాగ్యం కూడా నాకు దక్కనుంది. ఈ సందర్శన అన్ని రంగాలలో మన సంబంధాల ను గాఢతరం చేయగలదన్న పూర్తి విశ్వాసం నాలో ఉంది.