ఇక్కడ యుఎస్ ఎ లో స్థిరపడిన నా కుటుంబ సభ్యులారా!
మిమ్మల్ని ఎప్పుడు కలుసుకున్నా సరే కుటుంబ సభ్యులను కలుసుకుననప్పుడు ఎవరికైనా ఎలాంటి సంతోషానందాలు కలుగుతాయో అవే నాకు కలుగుతున్నాయి. మీతో సమావేశమైన ప్రతి సారి నాలో ప్రత్యేకమైన ఉత్సాహం పెల్లుబుకుతోంది. పునరుత్సాహంతో నేను తిరిగి ఇండియాకు పయనమవుతుంటాను. ఈ రోజున కూడా మీతో సమావేశమయ్యే మరో అవకాశం నాకు లభించింది.
గత 20 సంవత్సరాలలో పలు సందర్భాల్లో యుఎస్ఎ లో పర్యటించే అవకాశం నాకు లభించింది. నేను ప్రధాన మంత్రినో, ముఖ్యమంత్రినో కానప్పుడు దాదాపు 30 యుఎస్ రాష్ట్రాలలో పర్యటించాను. ప్రతి సారీ ఇక్కడ స్థిరపడ్డ భారతీయ సముదాయాన్ని కలుసుకొనే అవకాశాన్ని నేను పొందాను.
భారతదేశ ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం, మీరు భారీ ఎంత పెద్ద కార్యక్రమాలను ఏర్పాటు చేశారంటే- ఆ కార్యక్రమాల తాలూకు ప్రతిధ్వనులు ప్రపంచమంతటా వినిపించేవి. అమెరికా నేతలు గాని, ఇతర దేశాల నేతలు గాని నాతో భేట అయినప్పుడు యుఎస్ఎ లో నిర్వహించినటువంటి ఆ భారీ కార్యక్రమాల గురించి వారు తమ సంభాషణల్లో ప్రస్తావిస్తుంటారు.
ఇదంతా మీలాంటి అద్భుతమైన వ్యక్తులు ఉండడం వల్లనే సాధ్యపడుతోంది. అమెరికాలో నివసిస్తూ భారీ కార్యక్రమాలను నిర్వహించడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎన్నో అంశాలను పరిష్కరించుకోవలసివుంటుంది; అయినప్పటికీ మీరు వాటిని విజయవంతంగా పూర్తి చేస్తుంటారు.
ఈ సారి పర్యటనలో నేను మిమ్మల్ని నిరుత్సాహరుస్తున్నాను. ఈ సారి నా పర్యటన కోసం భారీ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే సలహాలు వచ్చాయి. అలాంటి భారీ కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు కూడా ఇష్టమే కానీ నా గత పర్యటనల సమయంలో భారీ కార్యక్రమాల ఏర్పాటు కోసం కష్టపడి పని చేసినవారిని కలుసుకోవాలని ఈ సారి నేను భావించాను. వాళ్లు నా కోసం సమయం వెచ్చించారు. వాళ్ల డబ్బు ఖర్చు పెట్టారు. తమ పనుల్లో మార్పులు చేర్పులు చేసుకున్నారు. నా గత కార్యక్రమాల కోసం చాలా కష్టపడి పని చేశారు. కాబట్టి వాళ్లను ఈ సారి కలుసుకోవాలనుకున్నాను. వారిని ఈ రోజున కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ నేను బుల్లి భారతదేశాన్ని, దాంతో పాటే ఒక చిట్టి యుఎస్ఎ ను చూడగలుగుతున్నాను.
ఇక్కడ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అంతే కాదు, అమెరికాలోని అన్ని రాష్ట్రాలనుంచి వచ్చినవారు వున్నారు. మీరు ఎక్క డవున్నా ఏ పరిస్థితుల్లో వున్నా, ఎలాంటి పనిలో మీరు తలమునకలై వున్నప్పటికీ మీరు ఏ పరిస్థితుల్లో దేశాన్ని వదిలి వచ్చారో ఎవరికీ తెలియదు. కానీ భారతదేశంలో ఏదైనా మంచి పని జరిగితే చాలు మీ ఆనందానికి పట్టపగ్గాలుండవు. భారతదేశానికి ఏమైనా జరగారానిది జరిగితే మీరు చాలా ఆవేదన చెందుతుంటారు. నిజానికి మీకు నిద్రపట్టదు. ఎందుకుంటే భారతదేశం ప్రగతి సాధించి అభివృద్ధి దేశంగా పేరు సంపాదించుకోవాలని మీరు హృదయపూర్వకంగా భావిస్తున్నారు కాబట్టి.
మీ కలలు నిజమవుతాయని నేను నమ్మకంగా చెబుతున్నాను. ఇలా నేను భావించడం వెనుక ఉన్నటువంటి కారణం చాలా సాధారణమైంది. మీరు గతంలో భారతదేశంలో జీవించారు. ఇప్పుడు యుఎస్ఎ లో వుంటున్నారు; ఒకసారి మీ సామర్థ్యాలకు, సత్తాకు అనుకూలమైన వాతావరణం లభించగానే, మీరు మాత్రమే సౌభాగ్యాలతో వెలుగొందడం లేదు.. ఈ క్రమంలో అమెరికా కూడా మరింత ప్రగతిని సాధించడానికి మీ కృషి దోహదం చేసింది.
భారతదేశంలో మీలాగే సామర్థ్యం, తెలివితేటలు గల భారతీయ పౌరులు 1.25 బిలియన్ మంది వున్నారు. అనుకూల వాతావరణం లభించగానే మీరు ఎలాగ ప్రగతి సాధించారో, అలాగే భారతదేశంలో కూడా ఇప్పుడు వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. వీరు భవిష్యత్తులో భారతదేశ ముఖచిత్రాన్ని ఎంత వేగంగా మారుస్తారో త్వరలో మీరే చూస్తారు.
భారతదేశంలో నేను గమనిస్తున్నది ఏమిటంటే, ప్రతి భారతీయుడు భారతదేశ ప్రగతి కోసం కృషి చేయాలనుకుంటున్నాడు అని. ఈ నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు అందుకోసం ఎంతో కొంత కృషి చేస్తున్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా, అటక్ మొదలుకొని కటక్ వరకు ఉన్న 1.25 బిలియన్ భారతీయులు ఇదే సంకల్పాన్ని పెట్టుకొంటే గనక- అటువంటప్పుడు- గతంలో లేని విధంగా మన దేశం వేగంగా ముందడుగు వేస్తుందని నేను మీకు భరోసా ఇవ్వగలుగుతాను.
గత ప్రభుత్వాన్ని ప్రజలు పక్కన పెట్టడానికి గల కారణాలను పరిశీలిస్తే వారికి లభించాల్సింది లభించకపోవడమనేది కారణం కాదు. ప్రధానమైన కారణం ప్రజల్లోని అసంతృప్తి కాదు. సాధారణంగా భారతీయులు వారికి లభించిన దానితో సంతృప్తి చెందుతుంటారు. అంతా సక్రమంగానే ఉందని అనుకుంటారు. యువకుడైన కుమారుడు చనియినా సరే, ఆ తల్లితండ్రులు అది దేవైచ్ఛ అని దానిని ఆమోదిస్తారు. ఇది భారతీయుల మౌలిక ఆలోచనా సరళి.
భారతదేశంలో ప్రభుత్వాలు మారడానికి వెనుక ఉన్న ఒకే ఒక్క విషయం అవినీతి, నిజాయితీ లోపం. భారతదేశంలో సామాన్య మానవుడు దీనిని అసహ్యించుకుంటాడు, ఇదేమిటి అంటూ. ఇవాళ, నేను వినమ్రపూర్వకంగా చెప్పాలనుకొంటున్నది గత మూడు సంవత్సరాల్లో మా ప్రభుత్వం మీద ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ అయినా రాలేదన్న సంగతి. పరిపాలనలో అంతర్గత వ్యవస్థను నిర్మించడం ద్వారా నిజాయితీ అనేది సహజ విధానంగా వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తద్వారా అవినీతిని అరికట్టడానికి 24 గంటలూ అప్రమత్తంగా ఉండనక్కరలేదు. ఇందులో సాంకేతికత చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తోంది. దీని ద్వారా పారదర్శకత వస్తోంది. నాయకత్వం, పరిపాలన ల కారణంగా నిజాయితీయుత పాలన ప్రజలకు అందుతోంది. సాధారణంగా సామాన్య ప్రజలు నిజాయితీగా ఉంటారు కాబట్టి వారు కూడా సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు.
ప్రభుత్వం ద్వారా సామాన్యులు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారో వాటినన్నిటినీ సాంకేతిత ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందేలా చేయగలిగాం. సామాన్య ప్రజల ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరచడానికిగాను వారు వాడే ఎల్‌పిజి సిలిండర్లను సబ్సిడీ కింద ఇవ్వడం తెలిసిదే. తద్వారా మిగిలే డబ్బును సామాన్య ప్రజలు తమ ఆరోగ్యం, విద్య మొదలైన వాటిమీద ఖర్చు పెట్టుకోగలుగుతారు. అయితే చాలా కాలంగా భారతదేశంలో ఈ సబ్సిడీనికి పేదలకే కాదు ధనవంతులకు కూడా ఇవ్వడం జరుగుతోంది. బిలియన్ల కొద్దీ సంపాదించే వ్యక్తి కూడా సబ్సిడీ సిలిండర్‌ను ఉపయోగిస్తున్నాడు.
ఈ కారణంగా నేను ధనవంతులైన ప్రజలకు విజ్ఞప్తి చేశాను. ఆర్ధిక తాహతు ఉన్న వారు ఎల్ పిజి మీద సబ్సిడీని వదిలేసుకోవాలని. 1,000-1,500 రూపాయల సబ్సిడీని తీసుకోవడంవల్ల మీకు ఏం లబ్ధి చేకూరుతుంది. అది మీ రోజువారీ పాకెట్ మనీకంటే తక్కువే కదా అని వివరించాను. భారతీయ సామాన్య ప్రజలుభారతదేశాన్ని ప్రగతి మార్గంలో నడిపించడానికి అసమాన స్ఫూర్తితో పని చేస్తున్నారని నేను అనడం వెనుక ఉన్న కారణం ఏమిటని అనుకొంటున్నారా ? భారతదేశంలోని 250 మిలియన్ నివాస గృహాలకుగాను 12.5 మిలియన్ కుటుంబాలు ఎల్ పిజి సబ్సిడీని వదులుకున్నాయి. మోదీ గారు, మీరు విజ్ఞప్తి చేశారు కాబట్టి ఇప్పటి నుండి మా ఎల్‌పిజీ సబ్సిడీని మేం వినియోగించుకోబోము అని వారు ముందుకు వచ్చారు.
భారతదేశ ప్రగతికోసం చేసే కృషిలో భాగస్వాములు కావడానికి ఎంతో కొంత కృషి చేయాలనే సామాన్య ప్రజల ఆకాంక్షకు ఇది అద్దంపడుతోంది. ప్రజలు భారీ స్థాయిలో తమ సబ్సిడీని వదులుకోవడం వల్ల మిగిలిపోయే డబ్బును మేం ఖజానాలో దాచలేదు. వంట చేసుకోవడానికి కట్టెలు ఉపయోగించుకునే వారి కోసం ఈ డబ్బును నేరుగా అందించాలని మేం అనుకుంటున్నాం. సమాజంలో అత్యంత పేదవారైన వారు తెల్లవారు జామున 3గంటలకు లేదా 4 గంటలకు నిద్ర లేచి వంట చెరకును సమీకరించి ఇంటికి తెచ్చుకొంటారు. ఆ తరువాత వంట చేసుకొని, పనికి వెళతారు.
కట్టెల పొయ్యి ద్వారా వచ్చే పొగ 400 సిగరెట్ల నుండి వచ్చే పొగకు సమానమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే అలాంటి పొయ్యి మీద వంట చేసే ఓ మాతృమూర్తి 400 సిగరెట్లకు సమానమైన పొగను పీల్చుకుంటోంది. అంతే కాదు, ఈ పొగను ఇంట్లోని చిన్నపిల్లలు కూడా పీల్చుకుంటూ ఉంటారు. ప్రతి రోజూ 400 సిగరెట్లకు సమానమైన పొగను పీల్చుకుంటున్నప్పుడు ఆ ఇంటి గృహిణి, ఆ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు.
నేను కలలు కంటున్న ఆరోగ్యకర భారతదేశం సాక్షాత్కరించాలంటే, తల్లీ పిల్లలు ఇద్దరూ ఆరోగ్యకరంగా ఉండాలి. అందుకే నేను 12.5 మిలియన్ కుటుంబాలు వదలివేసిన సబ్సిడీని పేద కుటుంబాలకు అందించాలనే బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఇంతే కాదు, మేం మరో పనినీ చేస్తున్నాం. సబ్సిడీని విడచిపెట్టిన వారికి మేం ఒక ఉత్తరం ఇస్తున్నాం. గుజరాత్‌లో సబ్సిడీని వదలివేసుకొన్న కుటుంబానికి ఓ ఉత్తరం రాస్తూ మీరు వదులుకున్న సబ్సిడీ కారణంగా అసోంలో ఫలానా వ్యక్తి సబ్సిడీ కింద లబ్ధి పొందుతున్నాడని చెబుతున్నాం. దీనికి చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఇలాంటి పారదర్శకత వల్ల ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి.
మీరు భారతదేశంలో వున్నప్పుడు మీకు ఇది అవగతమయ్యే ఉంటుంది. ఒక ఎల్‌పిజి సిలిండర్ ను సంపాదించాలంటే సామాన్య ప్రజలు చాలా కష్టపడే వారు. స్థానిక రాజకీయ నేతల చుట్టూ తిరిగి గ్యాస్ కనెక్షన్ ను పొందే వారు. రాబోయే మూడు సంవత్సరాల్లో 50 మిలియన్ పేద ప్రజలకు గ్యాస్ కనెక్షన్ లు ఇవ్వాలని మేం నిర్ణయించాం. 11- 12 నెలల్లో దాదాపు 10 మిలియన్ కుటుంబాలకు ఎల్ పిజి కనెక్షన్ ఇవ్వగలిగామని నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను.
సబ్సిడీ ఇవ్వడంలో అనేక ప్రాథమిక మార్పులు చేశాం. గతంలో గ్యాస్ అమ్మకందారుకు సబ్సిడీ మొత్తం అందేది. దాన్ని మేం ఆపేశాం. సబ్సిడీకి అర్హమైన వ్యక్తే నేరుగా అతని బ్యాంకు అకౌంటు ద్వారా ఆ సొమ్మును పొందే విధంగా మార్పులు చేశాం. సామాన్య ప్రజలు బ్యాంకు ఖాతాలు తెరవాలనే ఉద్యమాన్ని ఆరు నెలల క్రితం మొదలుపెట్టినప్పుడు 40 శాతం మంది భారతీయులు బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. వారికి ఎలాంటి బ్యాంక్ ఖాతా లేదు. బ్యాంకు అకౌంట్లు ప్రారంభించినప్పుడు వాటిలో వేసుకోవడానికి సొమ్ములేవి అని మమ్మల్ని నిందించే వారు. లబ్ధిదారులకు నేరుగా చేరేలా వారి అకౌంట్లలోకే డబ్బు జమ చేసే విదానం మొదలు పెట్టగానే పేదల బ్యాంకు ఖాతాలలోకి సబ్సిడీ డబ్బు చేరడం మొదలైంది. ఈ విధానం మొదలైన తరువాత ఏం జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంతవరకు సబ్సిడీ తీసుకొంటున్న30 మిలియన్ మంది ఎక్కడికి వెళ్లారో అంతు చిక్కలేదు. ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల సబ్సిడీ డబ్బును ఎవరు నొక్కేశారో ఎవరికీ తెలియకుండా పోయింది. లబ్ధి దారులకు నేరుగా లబ్ధి చేకూర్చే కార్యక్రమంవల్ల 30 మిలియన్ మంది అనర్హత గల వారు తొలగిపోయారు. తద్వారా ఆదా చేస్తున్న సబ్సిడీ సొమ్మును ఉపయోగించి గ్రామాల్లో విద్యాలయాలను కట్టడానికి ఉపయోగిస్తున్నాం.
పారదర్శకతను తీసుకురావడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నాం. నేటి యువతకు తెలుసు సాంకేతికత సామర్థ్యమేంటో. ఇవాళ సాంకేతికత మీద ఆధారపడి భారతదేశం తన సొంత వ్యవస్థలను నిర్మించుకొంటోంది.
భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుంటున్న వారికి నేను చెప్పబోయే విషయం తెలుసు. పంటలు వేసే సమయం రాగానే వాటి ఎదుగుదల కోసం ఉపయోగించాల్సిన ఎరువులను సంపాదించడం రైతులకు చాలా కష్టమయ్యేది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విషయంపైన కేంద్రానికి ఉత్తరాలు రాసే వాడిని. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆ ఉత్తరాల్లో రాసే వాడిని. నేను ప్రధాన మంత్రిని అయిన తరువాత నాకు ముఖ్యమంత్రుల నుండి అలాంటి ఉత్తరాలే రావడం మొదలైంది. నేను ప్రధాన మంత్రిని అయిన మొదటి నెలలో నాకు వచ్చిన ఉత్తరాలన్నీ ఇదే అంశంపైన ఉండేవి. ఈ విషయం మీకు చెబితే ఆశ్చర్యపోతారు. గత రెండు సంవత్సరాలుగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తమ రాష్ట్రానికి యూరియా కావాలని లేఖ రాయడం లేదు. ప్రస్తుతం దేశంలో యూరియా కొరత లేదు. యూరియా కోసం ప్రజలు బారులుతీరి ఉండడం ఇప్పుడు కనిపించడం లేదు. గతంలో రైతులు యూరియాకోసం రాత్రే వచ్చి షాపు ముందు క్యూలో నిలబడేవారు. ఉదయమెప్పుడో తెరిచే షాపు కోసం రాత్రి పూట కూడా క్యూలలో నిలబడి నానా ఇబ్బందులు పడే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు.
దీని అర్థం రాత్రికి రాత్రే మేం యూరియా కర్మాగారాలు ప్రారంభించామని కాదు. రాత్రికి రాత్రే మేం యూరియా ఉత్పత్తిని పెంచలేదు. మేం చాలా చిన్న పని చేశాం. యూరియాకు వేప పూత పూయడం ద్వారా మేం ఈ విజయం సాధించాం. వేప విత్తనాల ద్వారా తయారు చేసే నూనెను యూరియాకు పూశాం. వృథాగా పోయే వేప నూనెను యూరియాకు పూశాం. గతంలో ఏం జరిగేదంటే యూరియా ఫ్యాక్టరీలలో తయారైనప్పుడు చాలా తక్కువ ధరకే లభించేది. ఫ్యాక్టరీల నుండి బైటకు రాగానే అది కెమికల్ ఫ్యాక్టరీలకు వెళ్లేది. సబ్సిడీ కింద రైతులకు చేరే యూరియా ధర చాలా తక్కువ వుండేది. ప్రతి ఏడాది సుమారు ఎనభై వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీ కోసం ఖర్చు చేసేది. ఈ సబ్సిడీ యూరియా రైతులకు చేరకుండా రసాయనిక కర్మాగారాలకు వెళ్లగానే దాన్ని ఉపయోగించి ఇతర ఉత్పత్తులను తయారు చేసి వాటిని ఆయా రసాయనిక కర్మాగారాల యజమానులు అధిక లాభాలకు అమ్ముకునే వారు.
యూరియాకు వేప పూత పోయడంవల్ల ఒక గ్రాము యూరియా కూడా ఇతర ఉత్పత్తుల తయారీకి ఉపయోగపడడం లేదు. దాంతో యూరియా ఫ్యాక్టరీలకు వెళ్లడం ఆగిపోయి రైతుల పొలాలకు వెలుతోంది. అంతే కాదు, వేప పూత పూసిన యూరియా మరింత సామర్థ్యాన్ని పొందుతోంది. దాంతో భూసార నాణ్యత పెరుగుతోంది. తద్వారా 5-7 శాతం ఉత్పత్తి పెరుగుతోంది. అక్రమ పద్ధతుల్లో యూరియాను వినియోగించడం ఆగిపోవడంతో సబ్సిడీ ఖర్చులు తగ్గిపోయాయి. ఉత్పత్తి అయిన యూరియా అంతా పొలాలకు వెలుతోంది. తద్వారా రైతుల కష్టాలు తగ్గుముఖం పట్టాయి. వేప పూత కారణంగా పంటల ఉత్పత్తి పెరిగింది. సాంకేతికత సాయంతో మేం ఇదంతా సాధించగలిగాం.
సాంకేతిక కారణంగా భారతదేశం సాధిస్తున్న ఇలాంటి విజయాల గురించి నేను అనేక ఉదాహరణలు ఇవ్వగలను. అంతరిక్ష రంగంలో భారతదేశం తనకంటూ పేరును సంపాదించుకుంది. రెండు రోజుల క్రితమే భారతదేశం ఒకే సారి 31 నానో శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించింది. గత నెలలో ఒకే సారి 104 శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డును సాధించాం. ఒకే సారి 104 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం వెనక భారతదేశం సాధించిన శక్తి సామర్థ్యాల గురించి ప్రపంచం చర్చించుకొంటోంది. ఈ మధ్య భారతదేశం ప్రవేశపెట్టిన శాటిలైట్ బరువు కిలోగ్రాముల్లో లేదు. దాని బరువు పలు ఏనుగుల బరువుతో సమానం. ఆధునిక భారతదేశం కలల్ని సాకారం చేసేందుకు సాంకేతికతతో కూడినా పరిపాలనపైన మేం దృష్టి పెట్టాం. సాంకేతితతో కూడిన సమాజం, అభివృద్ధి కారణంగా వస్తున్న ఫలితాలు సంతోషకరంగా వున్నాయి. వాటి ఫలితాలను చాలా వేగంగా చూడవచ్చు కూడా.
గతంలో మన దేశంలో అభివృద్ధి జరగలేదని కాదు. గతంలో కూడా అభివృద్ధి జరిగింది. పనులు చేయడానికే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఏ ప్రభుత్వమూ నిర్ వ్యాపారంగా ఉంటూ ఎన్నికల్లో ఓడిపోవాలని భావించదు. ఏది ఏమైనప్పటికీ, కొంత పని జరగడం వేరు; వేగంగా, ఫలితాలను దృష్టిలో పెట్టుకొని, సరైన మార్గంలో, ప్రజల అవసరాల మేరకు, దేశ అంచనాల ప్రకారం పనులు జరగడం వేరు. ఈ రెండూ పూర్తిగా వేరు వేరు అని గ్రహించాలి. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం, అంతే కాదు సమయానికి తీసుకోవాలి. ఫలితాలను ఇచ్చేలా తీసుకోవాలి. ఈ ప్రమాణాల మీద ఆధారపడి దేశ ప్రగతిని మీరు అంచనా వేయాలి.
గతంలో ఎంత వేగంగా రోడ్లను నిర్మించే వారు.. ఇప్పుడు ఎంత వేగంగా వేస్తున్నారు, గతంలో రైలు ట్రాక్ లను ఎంత వేగంగా వేసే వారు, ఇప్పుడు వీటిని వేయడంలో ఎంత వృద్ధి రేటు ఉంది, రైల్వే ట్రాక్ ల విద్యుదీరకణ గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది.. ఇలా మీరు అనేక అంశాలను తీసుకొని పోల్చండి. ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రాథమిక సౌకర్యాల కల్పనకోసం పనులు జరుగుతున్నాయి. ఎందుకంటే, స్థిరమైన అభివృద్ధి కోసం ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. ఆధునిక భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నాం. అంతే కాదు, వీటి విషయంలో 21 శతాబ్దిని, అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని పని చేస్తున్నాం.
సాదాసీదాగా ఆలోచిస్తే పనులు జరగవు. గతంలో కరువులు వచ్చినప్పుడు ప్రజలు ప్రభుత్వానికి లేఖలు రాసి తమ గ్రామాలలో పరిస్థితిని వివరించే వారు. ఏవైనా పనులు చేపట్టమని ప్రభుత్వాన్ని అభ్యర్థించే వారు. ప్రభుత్వం కూడా నేలల్ని తవ్వి మట్టి రోడ్లను వేసేది. అదే అప్పటికి ప్రభుత్వాలు సాధించిన గొప్ప విజయాలుగా చెప్పుకునేవారు. ఆ రోజులు అలాంటివి.
ఈ పరిస్థితి మారిపోయింది. రహదారుల కోసం, పక్కా రహదారుల కోసం, డబుల్ లేన్ రోడ్ల కోసం డిమాండ్లు వచ్చాయి. ఈ రోజుల్లో ఎక్స్ ప్రెస్ రహదారి కోసం ప్రజలు అడుగుతున్నారు. అంతకంటే తక్కువ డిమాండ్ల జోలికి పోవడం లేదు. ఇలా ప్రజల నుండి పెరుగుతున్న అంచనాల కారణంగానే భారతదేశం అభివృద్ధి చెందుతోంది. సామాన్య ప్రజల ఆకాంక్షలు పెరిగినప్పుడు సమర్థవంతమైన నాయకత్వం కింద, సుపరిపాలన కారణంగా, సరైన విధానాలు రూపొందుతాయి. ప్రజల ఆకాంక్షలు విజయానికి దారి తీస్తాయి.
ప్రజల ఆకాంక్షలను విజయాలుగా మార్చడానికి మేం విధాన స్పందనను, వేగాన్ని, ప్రాధాన్యాలను నిర్ణయిస్తున్నాం. ఆ తరువాత అంకితభావంతో పని చేయడంవల్ల ఆశించిన ఫలితాలను సాధిస్తాం.
ఈ రోజుల్లో ప్రపంచం ఉగ్రవాదంకారణంగా తీవ్రంగా నష్టపోతోంది. ఇది మానవాళికే శత్రువు. 20, 25 సంవత్సరాల క్రితం ఉగ్రవాదం గురించి భారతదేశం మాట్లాడితే కొన్ని పెద్ద దేశాలు ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాయి. ఆ రోజుల్లో ఆ దేశాలు అది మన దేశానికి చెందిన శాంతి భద్రతల సమస్యని మాత్రమే భావించేవి. ఎందుకంటే ఆ సమయంలో అవి ఉగ్రవాదంతో ఇబ్బందిపడేవి కావు. ఈ రోజున ఉగ్రవాదమంటే ఏంటో ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు. ఉగ్రవాదులే ఉగ్రవాదమంటే ఏంటో పెద్ద దేశాలు తెలుసుకునేలా చేశారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారతదేశం సర్జికల్ దాడులు చేసినప్పుడు ప్రపంచానికి భారతదేశం సామర్థ్యం ఏంటో అర్థమైంది. తనను తాను కట్టడి చేసుకోవడమే కాదు అవసరమైనప్పుడు భారతదేశం తన శక్తిని ప్రదర్శిస్తుందనే విషయం ప్రపంచానికి అర్థమైంది.
అంతర్జాతీయ సంప్రదాయాలకు భారతదేశం కట్టుబడి ఉంటుంది. ఇది మన దేశానికి అంతర్గతంగా అలవడిన గుణం. ఇది దేశ లక్షణం. మనం మొత్తం ప్రపంచమే ఒక కుటుంబంగా భావిస్తాం. ఇవి వట్టి మాటలు కాదు. ఇది మనలోని అంతర్గత గుణానికి నిదర్శనం, మనలో దాగిన విధానమిది. శక్తి వుంది కదా అని ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే లక్షణం మన దేశానికి లేదు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజలను, శాంతిని, సంతోషాలను, ప్రజల ప్రగతిని కాపాడుకోవడానికి కఠినమైన నిర్ణయాలను తీసుకునే దేశం మనది. అదే సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలు, చట్టాలను అనుసరించే ఈ పని చేస్తాం. అవసరమైనప్పుడు మనం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ ఆపలేరు.
ప్రపంచానికి నచ్చకపోతే మనం చేసిన సర్జికల్ దాడులపై అనేక ప్రశ్నలు తలెత్తేవి. ప్రపంచ దేశాలు మనల్ని ఇబ్బంది పెట్టేవి. ప్రపంచం మనల్ని తీవ్రంగా విమర్శించేది. అయితే మీరు గమనించే వుంటారు.. భారతదేశం తీసుకున్న కఠిన నిర్ణయాన్ని మొదటిసారి ఎవరూ ప్రశ్నించలేదు. భారతదేశ సామర్థ్యం గురించి తెలుసుకున్న దేశాలకు ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. భారతదేశ జనజీవితాన్ని నాశనం చేస్తున్న ఉగ్రవాద అసలు రూపాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో మనం విజయం సాధించాం.
ఆర్ధిక రంగంలో 21వ శతాబ్ద దేశంగా భారతదేశం విజయవంతంగా అవతరించింది. ఒక దేశ అభివృద్ధిని చాటడానికి ఆర్ధిక ప్రగతి మాత్రమే ప్రమాణం కాదు. ఒక దేశ అతి పెద్ద సామర్థ్యం ఆ దేశానికి గల మానవవనరులు, సహజ వనరులు. భారతదేశంలో ప్రస్తతుం 35 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉన్న వారు 800 మిలియన్లు ఉన్నారు. యువశక్తితో నిండిన దేశం యువకుని లానే కలలు కంటుంది. యువకులకుండే సామర్థ్యాన్ని కలిగివుంటుంది. అందుకే మనం ఇతర దేశాలతో పోల్చినప్పుడు విధానాల ప్రకారం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రకారం ముందుంటున్నాం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటిసారిగా మనం ఇప్పుడు ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందుతున్నాం.
అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారతదేశ సామర్థ్యాన్ని గుర్తించాయి. ప్రపంచబ్యాంకు లేదా ఐఎమ్ఎఫ్.. ఇంకా అనేక సంస్థలు భారతదేశ సామర్థ్యాన్ని ప్రశంసిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రదేశాల్లో భారతదేశం ముందు వరసలో ఉందని ప్రపంచం గుర్తించింది. నూతన ఆవిష్కరణలు, సాంకేతిక ప్రతిభ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వివిధ దేశాల్లో స్థిరపడిన భారత సంతతి ప్రజలకు చాలా సామర్థ్యం వుంది. వారి అనుభవాలు, విజయాలు భారతదేశానికి ఉపయోగపడుతున్నాయి. భారతదేశ విజ్ఞాన సామర్థ్యం, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన భారతీయుల తెలివితేటలు చాలా గొప్పవి. మీ సామర్థ్యం, తెలివితేటలు దేశానికి ఉపయోగపడతాయని మీరు భావిస్తే మీరు భారతదేశానికి సేవలందించే సరైన అవకాశం ఇంకెప్పుడో కాదు. అది ఇప్పుడే. మీరు విజయం సాధించడానికిగాను మీకు సహాయపడ్డ దేశంపట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఇదే సరైన సమయం.
ప్రపంచవ్యాప్తంగా గల పలు దేశాల నుండి వచ్చిన ప్రజలు యుఎస్ఎ లో స్థిరపడ్డారు. అయితే ఇక్కడ నాకు దక్కినట్టుగా గౌరవం అంతర్జాతీయ స్థాయి గల నేతలకు అరుదుగా లభిస్తుంది. ఏది ఏమైనా అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది మీ తరువాత ఏమవుతుంది, తరువాతి తరాల వారు మీలాగే ఆలోచిస్తారా ? అని ఆలోచిస్తుంటాను. అయితే ఇదే అనుబంధాన్ని భారతదేశంతో కొనసాగించడం చాలా ముఖ్యం.
మీ తరువాతి తరాల వారు భారతదేశంతో అనుబంధం కొనసాగించేలా మీరు నిరంతరం కృషి చేయాలి. భారతదేశంలోని ప్రతి రాష్ట్రం విదేశాల్లో నివసించే తమ రాష్ట్ర పౌరులకు సేవలందించడానికిగాను విభాగాలను కలిగివున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ప్రవాసీ భారతీయ భవన్ పేరుతో ఒక ఘనమైన భవనాన్ని నిర్మించింది. మీరు ఎప్పుడైనా భారతదేశానికి వచ్చినప్పుడు ఆ భవనాన్ని సందర్శించాలి. అందులో వసతి సౌకర్యం కూడా ఉంది. ఈ సౌకర్యాలన్నీ మీకోసం మాత్రమే.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే ప్రజల్లో వేరే అభిప్రాయం వుండేది. సూటు బూటు వేసుకున్న అధికారులు, నేతలు సమాజంలో బాగా పేరున్న మనుషుల్ని కలుసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ వుంటారని అనుకునే వారు. విదేశీ మంత్రిత్వ శాఖకున్న పేరు అలాంటిది. అయితే గత మూడు సంవత్సరాల్లో మీరు గమనించే వుంటారు మన విదేశీమంత్రిత్వ శాఖ మానవత్వం విషయంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు సంఘటనల కారణంగా ఆయా దేశాల్లో చిక్కుకుపోయి సాయం కోసం అలమటించిన 80 వేల మంది భారతీయులను కేంద్రప్రభుత్వం రక్షించగలిగింది. వారిని భద్రంగా వారి కుటుంబాల వద్దకు పంపడం జరిగింది. 80 వేలు అంటే చిన్న సంఖ్య కాదు.
20 సంవత్సరాల క్రితం విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు భద్రంగా జీవిస్తుండే వారు. అయితే గత రెండు దశాబ్దాల్లో వచ్చిన మార్పుల కారణంగా విదేశాల్లో నివసిస్తున్న ప్రతి భారతీయుడు ఏదైనా జరుగుతుందనే భయంతో జీవిస్తున్నాడు. గత మూడు సంవత్సరాలుగా విదేశాల్లో నివసించే భారతీయుల్లో తిరిగి నమ్మకం వచ్చింది. తమ రాయబార కార్యాలయం తమకు అండగా ఉంటుందనే నమ్మకం వారిలో కలిగింది. మీకు తెలిసే వుంటుంది.. భారతీయురాలైన అమ్మాయి ఒకరు మలేశియాకు వెళ్లింది. మలేషియాలో పరిచయమైన వ్యక్తి కోసమని పాకిస్థాన్ కు వెళ్లింది. ఆమె ఎన్నెన్నో ఆశలతో అక్కడకు వెళ్తే అక్కడ దుర్భర పరిస్థితులు ఎదురయ్యాయి. ఆమె ముస్లిం మహిళ. పాకిస్థాన్ లో సంతోషకరమైన జీవితంకోసం వెళ్లింది. అయితే ఆ అమ్మాయి ట్రాప్‌లో పడిపోయాననే విషయాన్ని గ్రహించింది. పాకిస్థాన్‌లోని భారతీయ దౌత్య కార్యాలయాన్ని చేరుకుంటే తనకు రక్షణ లభిస్తుందనే నమ్మకంతో ఆ పని చేసింది. ఆమె ఎలాగోలా కష్టపడి భారతీయ రాయబార కార్యాలయానికి చేరుకోవడంతో, తిరిగి భారతదేశానికి రాగలిగింది. సుష్మా గారు స్వయంగా ఆ అమ్మాయికి స్వాగతం పలికారు.
గతంలో నేను ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడి నా సోదరులనుంచి అనేక ఫిర్యాదులను వినేవాడిని. ట్యాక్సి డ్రైవర్ల గురించి, వాణిజ్య పన్నుల అధికారుల గురించి, ఇంకా ఇతర అన్యాయాల గురించి ఫిర్యాదులు చేసే వారు. ఇలాంటి అనేక కారణాలతో భారతదేశానికి తిరిగి రావాలని భావించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విదేశాలనుంచి వచ్చే ఉత్తరాలు భారతీయ రాయబార కార్యాలయంలో వచ్చిన మార్పుల గురించి ప్రశంసలతోనే వస్తున్నాయి. రాయబార కార్యాలయ వాతావరణంలో వచ్చిన మార్పుల గురించి రాస్తున్నారు. తమకు తగిన గౌరవం లభిస్తోందని, ఎంబసీలలో ప్రజలకు అనుకూల విధానాలున్నాయని, ఇలాంటి ప్రశంసలతోనే అనేక ఉత్తరాలు వస్తున్నాయి. మా విధానాల్లో గణనీయమైన మార్పులు తెచ్చాం. పాస్‌పోర్టు సంపాదించడానికి ప్రయత్నిస్తే ఎదురయ్యే సమస్యల గురించి మీకు స్వయంగా తెలుసు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రతి తపాలా కార్యాలయం లో పాస్ పోర్టు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. గతంలో పాస్‌పోర్టు చేతికి రావాలంటే ఆరు నెలలు పట్టేది. ఇప్పుడు 15 రోజుల్లోనే లభిస్తోంది.
ఈ రోజుల్లో సామాజిక మాధ్యమం చాలా బలోపేతమవుతోంది. నేను కూడా సామాజిక మాధ్యమంలో చాలా చురుకుగా పొల్గొంటున్నాను. నరేంద్ర మోదీ యాప్ గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోతే డౌన్ లోడ్ చేసుకోండి. ఒక ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేయడానికి సోషల్ మీడియాను ఎంత బాగో ఉపయోగించుకోవచ్చో మన విదేశీ శాఖ చేసి చూపించింది.
గతంలో కోట్లు, ప్యాంట్లు, టైలు ధరించే వారికి మాత్రమే సేవలందిస్తున్నదనే విమర్శలు ఎదుర్కొన్న విదేశీ మంత్రిత్వశాఖ ఇప్పుడు అన్ని వర్గాలవారికి సేవలందిస్తోంది. ఇలా మొదటి సారి జరుగుతోంది. ఎవరైనా బాధితులు వేకువజామున 2 గంటలకు ట్వీట్ చేస్తే, 15 నిమిషాల్లో సుష్మా గారు స్పందిస్తున్నారు. 24 గంటల్లో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వెంటనే ఫలితాలు వస్తున్నాయి. ఇది సుపరిపాలన అంటే, ఇది ప్రజల అనుకూల పరిపాలన. ఇదే సెంటిమెంటు ప్రజల్లో ఉంది.
ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా మేం మా బాధ్యతలు నిర్వహిస్తున్నాం. ఈ మూడు సంవత్సరాలు చాలా అద్భుతంగా గడిచాయి. దేశం మరిన్ని ఎత్తులు ఎదగడానికిగాను మేం ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేస్తున్నాం. మీ మద్దతు లభించడం నా అదృష్టం. భారీ సంఖ్యలో ఇక్కడకు తరలివచ్చిన మీకు మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఫోటో సెషన్ ఉంటుందని తెలిసింది. కాసేపట్లో మీతో కలిసి తప్పక అందులో పాల్గొంటాను. మీరు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉండండి. మరొక్క సారి, నేను మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
మీకు ఇవే నా ధన్యవాదాలు.